NBK నర్తనశాల ఎలా ఉంది - రిపోర్ట్

By iDream Post Oct. 24, 2020, 07:04 pm IST
NBK నర్తనశాల ఎలా ఉంది - రిపోర్ట్

ఇవాళ నందమూరి బాలకృష్ణ నర్తనశాల ఏటిటిలో విడుదలయ్యింది. 2004లో అట్టహాసంగా మొదలైన ఈ సినిమా సౌందర్య అర్ధాంతరంగా చనిపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల కొంతకాలానికే ఆగిపోయింది. అప్పటిదాకా షూట్ చేసిన ఫుటేజిని ఇన్నేళ్లు కాపాడుకుంటూ వచ్చిన ఎన్బికె టీమ్ ఎట్టకేలకు అభిమానుల కోసం ప్రపంచానికి చూపించారు. శ్రేయాస్ యాప్ ద్వారా ట్యాక్సులతో కలుపుకుని 60 రూపాయలు ఛార్జ్ చేసిన టీమ్ అందులో కొంత మొత్తాన్ని బసవతారకం ట్రస్ట్ కి విరాళంగా ఇస్తామని ముందే ప్రకటించారు. ఇక వీడియో విషయానికి వస్తే మొత్తం 16 నిమిషాల నిడివితో ఇది సాగింది. బాలకృష్ణ అర్జునుడిగా, సౌందర్య ద్రౌపదిగా, శరత్ బాబు ధర్మరాజుగా, శ్రీహరి భీముడిగా కనిపించారు.

వనవాసం సెటప్ లో సాగిన ఈ ఎపిసోడ్ లో హై లైట్స్ గా చెప్పుకోదగ్గవి ఏకబికిన ధర్మరాజుని ఉద్దేశించి అర్జునుడుగా బాలయ్య చెప్పిన సింగల్ టేక్ డైలాగు. బయట ఎలా తడబడినా కెమెరా ముందు వచ్చేప్పటికి తనకు తానే సాటి అని ఇందులో మరోసారి రుజువు చేశారు బాలకృష్ణ. సౌందర్య కనిపించేది కాసేపే అయినా అలా పాత జ్ఞాపకాలలోకి లాక్కెళ్లిపోతారు. శ్రీహరిని ఒక అద్భుతమైన పాత్రలో చూడటం మిస్ అయ్యిందన్న ఫీలింగ్ కలుగుతుంది. శరత్ బాబు సైతం తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. అయితే ఇదంతా ఆ సమయంలో తక్కువ వ్యవధిలో తీసినవి కావడంతో ఎక్కువ లెంగ్త్ ఉండే అవకాశం లేకపోయింది.

పేరుకి పదహారు నిముషాలు అయినప్పటికీ అందులో సుమారు ఆరు నిమిషాల దాకా పాత ఎన్టీఆర్ నర్తనశాల క్లిప్పింగ్స్ ని కలిపారు. ఆ సినిమా చూడని ఇప్పటి తరానికి ఆసక్తి కలిగేలా చేయడం విశేషం. చివర్లో ఎస్వి కృష్ణారెడ్డి టాప్ హీరో సినిమాలో సామజవరగమనా పాట నుంచి బాలకృష్ణ బృహన్నల గెటప్ తో కూడిన డాన్స్ బిట్ తో ఫినిష్ చేయడం బాగుంది. అరవై రూపాయలకు న్యాయం జరుగుతుందా అని ఆలోచించడం సరికాదు. కేవలం సౌందర్య, శ్రీహరిలకు ఓ జ్ఞాపక నివాళిగా, బాలయ్యను అరుదైన పాత్రలో కాసేపైనా చూసే అవకాశంగా నర్తనశాలను చూడాలే తప్పించి అంతకన్నా ఇంకేదీ ఆశించకపోవడం మంచిది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp