బాలయ్య సినిమాకు గట్టి దెబ్బ

By iDream Post Apr. 22, 2020, 11:56 am IST
బాలయ్య సినిమాకు గట్టి దెబ్బ

దేశవ్యాప్తంగా జన జీవనాన్ని స్థంబింపజేసి అన్ని రంగాలు కుదేలయ్యేలా చేసిన కరోనా వైరస్ కరాళ నృత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ముగుస్తుందో ప్రపంచంలోని ఏ దేశాధినేత చెప్పలేకపోతున్నాడు. అందుకే లాక్ డౌన్ పొడిగిస్తూ పోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఎక్కడికక్కడ కేసులు తగ్గుతున్నాయని అనుకోవడం ఆలస్యం అతి కొద్దిరోజుల్లోనే అమాంతం నెంబర్ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో సినిమా రంగం ఎదురుకుంటున్న నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లు, షూటింగులు ఆగిపోయి వీటి మీద ఆధారపడ్డ కొన్ని లక్షల కుటుంబాలు చాలా తీవ్రతను ఎదురుకుంటున్నాయి.

దీని సంగతలా ఉంచితే బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా దీని వల్ల పెద్ద చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓ పాత్ర అఘోరా తరహాలో ఉంటుంది. రెండోది ముందు ఫ్యాక్షనిస్ట్ అనుకుని తర్వాత పొలిటీషియన్ గా మార్చారని టాక్ ఉంది. అయితే అఘోరాకు సంబంధించిన ఎపిసోడ్స్ వారణాసిలో తీయాలి. ఇప్పుడు ఎక్కడిక్కడ కనీసం ఆరేడు నెలలు షూటింగ్ కు అనుమతులు ఇచ్చే ఛాన్స్ లేదు. సో ఇవి ఎక్కడ తీయాలి అనేది పెద్ద సమస్య.

ఒకవేళ ఇక్కడ సెట్స్ వేద్దామంటే బడ్జెట్ చాలా భారీగా పెరిగిపోతుంది. పోనీ ఆ పాత్రను మారుద్దామంటే కథనే మార్చాలి. ఇదంత సులభం కాదు. అసలే గెటప్పుల కోసం బాలయ్య ఏకంగా కెరీర్ లో మొదటసారి జుట్టు మొత్తాన్ని తీసేసి మళ్ళీ పెంచుతున్నాడు. ఇప్పుడీ బ్రేక్ డౌన్ వల్ల హెయిర్ స్టైల్ మారిపోయింది. ఇదంతా ఇబ్బంది పెట్టే వ్యవహారమే. దీని గురించి వీడియో కాల్స్ లో హీరో దర్శకుడు నిత్యం చర్చల్లో ఉన్నారట. ఒకవేళ ప్రత్యాన్మయంగా ఏం చేయాలి అనే దాని గురించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇంకా హీరోయిన్ డిసైడ్ కానీ ఈ మూవీకి తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జూలై నుంచి రీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp