యూత్ హీరో పాంచ్ పటాకా

By iDream Post Jan. 23, 2021, 11:38 am IST
యూత్ హీరో పాంచ్ పటాకా

ఇప్పుడున్న హీరోల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా ఏడాదికి మహా అయితే ఒకటి లేదా రెండు సినిమాల కంటే ఎక్కువ చేసే సీన్ కనిపించడం లేదు. నాని లాంటి ఒకరిద్దరు చాలా ప్లాన్డ్ గా సంవత్సరానికి మూడు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు కానీ ఏదో ఒక కారణం వల్ల ప్రతిసారి అది సాధ్యపడటం లేదు. ఈ విషయంలో నాగ శౌర్య స్పీడ్ ని మెచ్చుకోవాల్సిందే. ఏకంగా అయిదు సినిమాలను పక్కా ప్లానింగ్ తో లైన్ లో పెట్టేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి కెరీర్ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ గా సాగుతున్నా వీలైనన్ని ఎక్కువ మూవీస్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం ఎందరికో అవకాశాలు ఉపాధిని తెచ్చిపెడుతోంది.

నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అన్నింటికి సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్ గా నిలిచింది. సంతోష్ జాగార్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్య' టీజర్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. అర్చరీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో తీస్తున్న 'వరుడు కావలెను' కూడా చిన్న వీడియోతో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇందులో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. మహేష్ కోనేరు నిర్మించే 'పోలీసు వారి హెచ్చరిక' టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు. దీనికి రాజేంద్ర దర్శకుడు.

ఇవి కాకుండా శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శ్రీమాన్ వేముల డైరెక్ట్ చేయబోయే సినిమాను ప్రకటించారు. దీనికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. స్క్రిప్ట్ లాక్ చేశారు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద తర్వాత అవసరాల శ్రీనివాస్ తో నాగ శౌర్య హ్యాట్రిక్ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' పేరుని ఖరారు చేశారు. ఇలా మొత్తం అయిదు సినిమాలతో నాగ శౌర్య స్పీడ్ మాములుగా లేదు. వీటిలో ఎంత లేదన్నా కనీసం మూడు సినిమాలైతే ఈ ఏడాదే విడుదలవుతాయి. మొత్తానికి ప్లానింగ్ విషయంలో ఇతర యూత్ హీరోలు నాగ శౌర్య వేగాన్ని ఫాలో అయితే వీలైనన్ని ఎక్కువ సినిమాలు వచ్చి థియేటర్లు కళకళలాడుతాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp