చైనా యుద్ధంపై సినిమాలు షురూ

By iDream Post Jul. 04, 2020, 12:17 pm IST
చైనా యుద్ధంపై సినిమాలు షురూ

ఏదైనా వ్యక్తులు లేదా సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్ తర్వాతే ఇంకెవరైనా. ఇందులో ఎప్పుడూ అక్షయ్ కుమార్ ముందుంటాడు కానీ ఈ సారి ఆ ఛాన్స్ అజయ్ దేవగన్ తీసుకున్నాడు. ఇటీవలే ఇండో చైనా సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంలో 20 మంది సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన గాల్వన్ లోయలో జరిగిన వార్ ఎపిసోడ్ ని ముఖ్య కథా అంశంగా తీసుకుని స్క్రిప్ట్ ని రాయిస్తున్నారట. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ ఈ యుద్ధంలోనే అశువులు బాశారు. ఇలా ఒక్కో సోల్జర్ కి ఒక్కో నేపధ్యం కథా ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఇందులో చూపబోతున్నారు.

అజయ్ దేవగన్ స్వంత బ్యానర్ తో పాటు సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్ఎల్పి ఇందులో నిర్మాణ భాగస్వాములుగా ఉండబోతున్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది లాక్ డౌన్ పూర్తిగా అయ్యాక తెలుస్తుంది. కాకపోతే విడుదల మాత్రం వచ్చే ఏడాది ఉండకపోవచ్చు. బడ్జెట్ వంద కోట్లకు పైగా ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ఇప్పుడీ ఆలోచన రావడానికి కారణం లేకపోలేదు. దేశవ్యాప్తంగా చైనా వ్యవహార శైలిలో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయి. ఆ దేశానికి చెందిన 59 యాప్స్ ని బ్యాన్ చేశాక వాతావరణం ఇంకా వేడెక్కింది. నిన్న మోడీ పర్యటన సైతం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చైనా సైన్యంలో 40కి పైగా ప్రాణాలు కోల్పోయనా ఆ దేశం అధికారికంగా ప్రకటించేందుకు వెనుకడుగు వేసింది. ఇవన్నీ సినిమాలో చూపించే అవకాశం ఉంది. ఇదే తరహాలో గత ఏడాది విడుదలైన యురి ది సర్జికల్ స్ట్రైక్ ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దేశభక్తి కాన్సెప్ట్ ని ఎంత క్యాష్ చేసుకోవచ్చో నిరూపించింది.

విక్కీ కౌశల్ లాంటి అప్ కమింగ్ హీరోకే ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తే ఇక అజయ్ దేవగన్ స్టార్ చేస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. సోషల్ మీడియాలో అప్పుడే దీని మీద చర్చలు మొదలయ్యాయి. సినిమా ఎలా తీసినా క్లైమాక్స్ లో మాత్రం టిక్ టాక్ అన్ ఇన్స్టాల్ చేయడంతో ముగిస్తారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా అజయ్ దేవగన్ ఈ కాన్సెప్ట్ తో సినిమా తీస్తానని కర్చీఫ్ వేసేసి మిగిలిన వాళ్లకు అవకాశాలు తగ్గించేశాడు. తానాజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఊపుమీదున్న ఈ కండల హీరో రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అతనికి జోడిగా శ్రేయ కనిపిస్తుంది. ఇదలా ఉంచితే ఇప్పుడీ సరిహద్దు యుద్ధసినిమాకు చైనా వార్ అని టైటిల్ పెడతారో లేక గాల్వన్ అని ఫిక్స్ చేస్తారో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp