బొంబాయి చెట్నీ బాగానే ఉంది

By G.R Maharshi Nov. 24, 2020, 11:39 am IST
బొంబాయి చెట్నీ బాగానే ఉంది

బొంబాయి చెట్నీ ఇదెప్పుడు నాకు పెద్ద రుచిగా అనిపించ‌దు. చెనిక్కాయ చెట్నీ ముందు ఏదీ స‌మానం కాద‌ని న‌మ్మ‌కం. చెట్నీ అనే ప‌దం మ‌ధ్య‌లో వ‌చ్చింది కానీ మేము మామూలుగా వూరిమిండి అంటాం. రాయ‌ల‌సీమ ప‌ల్లెల్లో ఇట్లే పిలుస్తారు. బొంబాయి చెట్నీ మా అబ్బాయికి బాగా ఇష్టం. ఇంకో అబ్బాయికి కూడా ఇష్టం. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలోని హీరో రాఘ‌వ‌కి (ఆనంద్ దేవ‌ర‌కొండ‌). అతనికి చెట్నీ చేయ‌డం కూడా వ‌చ్చు. తాను చాలా రుచిగా చేస్తాన‌ని న‌మ్మి ప‌ల్లెని వ‌దిలి గుంటూరులో హోట‌ల్ పెట్టి చివ‌రికి స‌క్సెస్ అవుతాడు. సినిమాలో OK కానీ, బొంబాయి చెట్నీ వ‌ల్ల స‌క్సెస్ అయిన హోట‌ళ్లు నాకు తెలిసి ఇప్ప‌టి వ‌ర‌కూ లేవు.

గృహ ప్ర‌వేశానికి అవుతో పేడ వేయించ‌డంతో ఈ సినిమా స్టార్ట‌వుతుంది. తెలిసిన మ‌నుషులే అంద‌రూ, స‌హ‌జంగా మాట్లాడుతూ వుంటారు. న‌టించిన‌ట్టు కాకుండా మామూలుగా వుంటారు. నిజం చెప్పాలంటే మొత్తం న‌టుల్లో ఆనందే కొంచెం వీక్‌. త‌మాషా ఏమంటే ఆనంద్ దేవ‌ర‌కొండ త‌ప్ప మిగ‌తా న‌టులెవ‌రూ మ‌న‌కు తెలియ‌దు. ఫ‌స్ట్ సినిమా దొర‌సాని కంటే ఆయ‌న కొంచెం మెరుగుప‌డ్డాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిగా బండి లాగ‌డం క‌ష్టం. త‌న‌కాళ్ల‌ మీద తాను నిల‌బ‌డాల్సిందే. దీనికి ఎంతో సాధ‌న చేయాలి. అది కొర‌వ‌డింద‌ని అనిపిస్తుంది.

కృష్ణార్జున‌యుద్ధం సినిమాలో నానీ చిత్తూరు యాస మాట్లాడుతాడు. నిజానికి ఆయ‌న‌కి చిత్తూరు యాస రాదు. షూటింగ్‌లో ఒక ట్ర‌యిన‌ర్‌ని పెట్టుకుని ప్రాక్టీస్ చేశాడు. మిడిల్‌క్లాస్ సినిమాలో అంద‌రూ అచ్చ గుంటూరు యాస‌లో మాట్లాడుతుంటారు. హీరో మాత్ర‌మే ఆ యాస‌లో మాట్లాడ‌డు. అదేం బ్ర‌హ్మ విద్య కాదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వ‌చ్చేది. ఆ ప‌ని ఎందుకు జ‌ర‌గ‌లేదో తెలియ‌దు. దాని వ‌ల్ల సినిమాకి న‌ష్టం జ‌ర‌గ‌లేదు కానీ అవ‌కాశాన్ని ఆనంద్ వాడుకోలేక‌పోయాడు.

సినిమాలో క‌థ అంటూ ప్ర‌త్యేకంగా లేదు కానీ క‌థనం అద్భుతం. కొడుకు మీద చీటికి మాటికి అరుస్తూ , అత‌ని హోట‌ల్ పెట్టుబ‌డి కోసం పొలాన్ని కూడా అమ్మేసే మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రి, పాలు పోసి చీటీ క‌డితే, అ డ‌బ్బులు పోతే బాధ‌ప‌డే ఒక పెద్దాయ‌న‌, కూతురి ప్రేమ‌ని ఒప్పుకోని తండ్రి, స‌ర్పంచ్‌గా పేరు రావాల‌ని రోడ్డు వేసి, కాంట్రాక్ట‌ర్ చేతిలో మోస‌పోయి ఆత్మ‌హ‌త్య చేసుకున్న పెద్ద మ‌నిషి. ప్ర‌తి ఒక్క‌రూ మ‌నకి వూళ్ల‌లో క‌నిపించేవాళ్లే.

హీరోయిన్‌గా వ‌ర్ష క‌ళ్ల‌తోనే న‌టించింది. త‌న తండ్రి ల్యాండ్ కొని హీరోని మోసం చేస్తుంటే అది చెప్ప‌డానికి ఆమె చేసే ప్ర‌య‌త్నం చాలా బావుంటుంది.

సినిమా మొత్తం సున్నిత‌మైన హాస్యం న‌డుస్తూ వుంటుంది. క్లైమాక్స్‌లో ఇది వేగం అందుకుంటుంది. ప‌గ‌ల‌బ‌డి న‌వ్వం కానీ, పెద‌వుల‌పై న‌వ్వు వుంటుంది. సెకెండాఫ్‌లో కొంచెం బిగువు స‌డ‌లి రిపీటెడ్ సీన్స్ వుండ‌డం ఒక లోపం. పాటలు OK. క‌థ‌కి అడ్డం ప‌డ‌కుండా క‌థ‌లో భాగంగా ఉన్నాయి.

చిన్న పాయింట్ తీసుకుని క‌థ‌నంతోనే లాక్కు రావ‌డం గొప్ప Art. దాన్ని ర‌చ‌యిత జ‌నార్ధ‌న్‌, ద‌ర్శ‌కుడు వినోద్ సుల‌భంగా సాధించారు. ఇది థియేట‌ర్‌లో రిలీజ్ అయి వుంటే జ‌నాల‌కి ఎక్కేదో లేదో తెలీదు కానీ, ఇప్ప‌టి వ‌ర‌కూ అమెజాన్‌లో క‌రోనా టైంలో వ‌చ్చిన వాటిలో ది బెస్ట్‌.

మ‌ళ‌యాళంలో లా మ‌న‌కి కూడా కొత్త‌గా ఆలోచించే ద‌ర్శ‌కులు వ‌స్తున్నారు. మొన్న ప‌లాస‌తో క‌రుణ‌కుమార్‌, ఇపుడు వినోద్‌.

తెలుగు సినిమా, వూపిరి పీల్చుకో ... కొత్త కుర్రాళ్లు వ‌స్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp