నోరుజారి సారి చెప్పిన మెగాస్టార్

By Ravindra Siraj Mar. 02, 2020, 07:04 am IST
నోరుజారి సారి చెప్పిన మెగాస్టార్

స్టేజి మీద మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఉత్సాహం పట్టలేక రాబోయే కొత్త సినిమాల విశేషాలు లీకుల రూపంలో చెప్పేయడం మెగాస్టార్ చిరంజీవికి కొత్తేమీ కాదు. గతంలో రంగస్థలం ప్రీ రీలీజ్ ఈవెంట్ లో ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుందని చెప్పేసి ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. దర్శకుడు సుకుమార్ తో సహా అక్కడున్న వారందరూ షాక్ తిన్నారు. అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. తాజాగా నిన్న జరిగిన ఓ పిట్టకథ ఈవెంట్ లో కూడా ఇలాంటి ఘటనే రిపీట్ అయ్యింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు విశ్వంత్ హీరోగా నిత్య శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. హైప్ కోసం చిరుని అతిథిగా పిలిచారు. అయితే వచ్చిన గెస్టులు, యూనిట్ సభ్యులు అందరూ చిరుని పొగడ్తల వర్షంలో ముంచెత్తడంతో ఆయనే తన స్పీచ్ లో ఇది సన్మాన సభనా అని ప్రశ్నించడం గమనార్హం. ఇక విషయానికి వస్తే సెట్ లో నటీనటులు పాటించాల్సిన డిసిప్లిన్ గురించి చిరు మాట్లాడుతూ ప్రస్తుతం తాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పేరు "ఆచార్య" అని ప్రకటించేశారు. వాస్తవానికి ఇది ఫ్లోలో పొరపాటుగా వచ్చేసింది. తర్వాత నాలుక కరుచుకున్న చిరంజీవి ఆ వెంటనే కొరటాల శివకు పబ్లిక్ గా సారీ చెప్పేశారు.

చాలా స్పెషల్ గా ఏదైనా ఈవెంట్ లాంటిది ప్లాన్ చేసి శివ టైటిల్ అనౌన్స్ చేయాలనుకున్నారని కానీ ఇలా మిస్ అయిపోయి చెబుతానని ఊహించలేదని చిరు చెప్పడం విశేషం. అయినా మంచి విషయాలు ఎక్కువ రోజులు దాచి ఉంచలేమని ఇదీ మంచిదే అని కవర్ చేసేశారు. వాస్తవానికి ఆచార్య టైటిల్ ఎప్పుడో లీక్ అయ్యింది. కానీ ఇది అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి అభిమానుల్లోనూ కొన్ని సందేహాలు ఉండిపోయాయి. ఇప్పుడు వాటికి చెక్ పడిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య చిరు బర్త్ డే ఆగస్ట్ 22 లేదా దసరాకు ఏదో ఒక తేదీకి ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇంకా మహేష్ బాబు ఇందులో నటిస్తున్నది లేనిదీ కన్ఫర్మ్ కాలేదు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఆచార్యలో హీరోయిన్ ఎవరో ఇంకా తేలలేదు. త్రిష పేరు ప్రచారంలో ఉంది కాని అఫీషియల్ గా అయితే చెప్పలేదు. సో ఆచార్య టైటిల్ విషయంలో ఉన్న డౌట్స్ పిట్టగొడ ఫంక్షన్ పుణ్యమాని ఇకపై ఉండవు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp