జూనియర్ మణిశర్మకు మెగా ఛాన్స్ ?

By iDream Post Aug. 28, 2021, 06:30 pm IST
జూనియర్ మణిశర్మకు మెగా ఛాన్స్ ?

పరిశ్రమలో ఏ టెక్నిషియన్ కైనా బ్రేక్ రావాలంటే ఒక పెద్ద స్టార్ సినిమా పడాలి. అప్పుడే కెరీర్ ఊపందుకుంటుంది. లేదా చిన్న హీరో మూవీ చేసినా గొప్ప ఎవర్ గ్రీన్ ఆల్బమ్ అనే రేంజ్ లో పని చేయాలి. అప్పుడే బ్రేక్ దక్కుతుంది. మణిశర్మ 90 దశకం ప్రారంభంలోనే రామ్ గోపాల్ వర్మ రాత్రికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా, వెంకటేష్ ప్రేమించుకుందాం రాకు బిజిఎం కంపోజ్ చేసినా పేరు వచ్చింది మాత్రం చిరంజీవి బావగారు బాగున్నారాతోనే. ఆ సాంగ్స్ కు వచ్చిన రెస్పాన్స్, బాక్సాఫీస్ ఫలితం మెలోడీ బ్రహ్మకు వరస ఆఫర్లు వచ్చేలా చేశాయి. తర్వాత జరిగిన చరిత్ర ప్రతి మ్యూజిక్ లవర్ కు తెలిసిందే.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం చిరంజీవి మెహర్ రమేష్ కాంబోలో రూపొందుతున్న భోళా శంకర్ కు సంగీత దర్శకుడిగా మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నయని ఇండస్ట్రీ టాక్. మహతి ఇప్పటికే చాలా సినిమాలు చేసినప్పటికీ ఇంకా అనుకున్న స్థాయికి చేరలేదు. ఒక హిట్టు వస్తే మూడు ఫ్లాపులు పలికించి అన్ని మీడియం రేంజ్ హీరోలతో సర్దుకోవాల్సి వచ్చింది. అయినా కూడా ఛలో లాంటి బ్లాక్ బస్టర్లు అతని ఖాతాలో లేకపోలేదు. భీష్మ సూపర్ హిట్ అయినా బిజీ కాలేకపోయారు. ఇప్పుడు భోళా శంకర్ కనక ఓకే అయితే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.

తండ్రి మణిశర్మ ఒకపక్క ఆచార్యకు పని చేస్తుండగానే మరోవైపు ఇలా కొడుకు మహతికి భోళా శంకర్ రావడం కన్నా అరుదైన సంఘటన ఇంకేముంటుంది. ఒకప్పుడు నాన్నతో చూడాలని ఉంది, అన్నయ్య, ఇద్దరు మిత్రులు, మృగరాజు లాంటి హిట్టు ఫ్లాపుతో సంబంధం లేని సూపర్ ఆల్బమ్స్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు మహతితో ఎలాంటి పాటలు రాబట్టుకుంటాడో మరి. కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తున్న ఈ మూవీ తమిళ వేదాళం రీమేక్ అన్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ పూర్తయ్యాక దీని షూటింగ్ కొనసాగించబోతున్నారు. ఫ్లాపుతో చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు మెహర్ రమేష్ కు సైతం దీని సక్సెస్ చాలా కీలకం

Also Read : చైతు ప్రేమకథకు మోక్షం ఎప్పుడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp