బాలయ్య కోసం మలయాళీ భామ ?

By iDream Post Oct. 15, 2020, 05:38 pm IST
బాలయ్య కోసం మలయాళీ భామ ?

లాక్ డౌన్ కు ముందు కొంత భాగం పూర్తి చేసుకున్న బాలకృష్ణ-బోయపాటిల సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టేందుకు వచ్చే నెల నుంచి ప్లానింగ్ చేసుకుంటోంది. బాలయ్య అప్పటికైనా సిద్ధంగా ఉంటారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సీనియర్ హీరోలు వ్యాక్సిన్ వచ్చే దాకా సెట్స్ కు రావడానికి ఇష్టపడటం లేదన్న కామెంట్స్ నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య చిన్న టీజర్ వదిలితే అది కాస్తా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ గా ఓ మలయాళీ భామను ఫిక్స్ చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇంకా అధికారికంగా చెప్పలేదు. కాకపోతే ఆమె మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు కాదు.

ఆమె పేరు ప్రయాగ మార్టిన్. 2014లో మిస్కిన్ తీసిన పిశాచిలో పార్వతిగా నటించి మెప్పించింది. ఫుల్ లెంగ్త్ రోల్ తన డెబ్యూ మూవీ కూడా అదే. ఆ తర్వాత పూర్తిగా మల్లు వుడ్ మూవీస్ కే అంకింతమైపోయిన ప్రయాగకు ఓరు మురై వంతు పార్తయా చాలా పేరు తీసుకొచ్చింది. ఇప్పటిదాకా ప్రయాగ చేసినవి పట్టుమని పదిహేను సినిమాలు కూడా లేవు. కన్నడలో గత ఏడాది గీతలో చేసింది కానీ ఆ తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కనిపించలేదు. పెర్ఫార్మన్స్ విషయంలో క్రిటిక్స్ ను సైతం మెప్పించే ప్రయాగ బాలయ్య సినిమాలో తోడయ్యిందంటే ఖచ్చితంగా ఏదో పవర్ ఫుల్ పాత్ర కోసమే అయ్యుంటుంది. ఎందుకుంటే రెగ్యులర్ గ్లామర్ షోకు తను సూట్ కాదు. అఘోరాగా, ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య రెండు షేడ్స్ చేస్తున్న ఈ మూవీ పై అంచనాలు మాములుగా లేవు.

గత దశాబ్డ కాలంలో సింహా, లెజెండ్ మాత్రమే బాలకృష్ణకు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అవి తీసింది బోయపాటినే. అందుకే హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్ పాత్ర కోసం సిమ్రాన్ తో పాటు భూమికను కూడా సంప్రదించారట. కానీ ఎవరు ఫైనల్ అయ్యారో బయటికి రాలేదు. వచ్చే వేసవికి విడుదల ప్లాన్ చేసుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే కనీసం డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టుకోవాలి. తన స్టైల్ కి భిన్నంగా ఓవర్ బడ్జెట్ కి వెళ్లకుండా తక్కువ టైంలోనే పూర్తి చేసేలా బోయపాటి శీను ప్లానింగ్ లో ఉన్నాడు. భీభత్సమైన ఫామ్ లో ఉన్న తమన్ సంగీతం అందించడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు, రూలర్ డిజాస్టర్ల తర్వాత మరో సాలిడ్ హిట్ బాలకృష్ణకు చాలా అవసరం. గెటప్పు హంగామా వగైరా చూస్తుంటే అది జరిగేలాగే కనిపిస్తోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య చేసిన సినిమాల్లో అధిక శాతం కమర్షియల్ హిట్లే. మరి ఇది కూడా ఆ సెంటిమెంట్ ని కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp