ఫ‌స్టాఫ్ ల‌వ్‌, సెకెండాఫ్ రొటీన్ స్టోరీ

By G.R Maharshi Sep. 25, 2021, 10:30 am IST
ఫ‌స్టాఫ్ ల‌వ్‌, సెకెండాఫ్ రొటీన్ స్టోరీ

శేఖ‌ర్ క‌మ్ముల‌పై ఒక న‌మ్మ‌కం. అన‌వ‌స‌ర ఓవ‌రాక్ష‌న్లు, బిల్డ‌ప్‌ లేకుండా హాయిగా తీస్తాడు. మామూలు క‌థ‌లోనే ఎమోష‌న్ పండిస్తాడు. మాట‌లు కూడా బ‌రువుగా లేకుండా స‌ర‌దాగా వుంటాయి. అన్నిటికి మించి హీరోయిన్లు బ‌ల‌మైన వ్య‌క్తిత్వంతో వుంటారు. ఒక ర‌కంగా వాళ్లే హీరోలు.

నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి, శేఖ‌ర్ క‌మ్ముల క‌లిసి ల‌వ్‌స్టోరీ అంటే అంచ‌నాలు వుంటాయి. మొద‌టి రెండు మూడు చైల్డ్ సీన్స్‌తోనే కులం క‌థ చెబుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. హీరోయిన్ ఎంట్రీ త‌ర్వాత కాసేప‌టికే క‌థ ఎటు వెళుతుందో కూడా తెలిసిపోతుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌తిభావంతుడు కాబ‌ట్టి ఎలా ముగిస్తాడా అని క్యూరియాసిటీ.

మొద‌టి స‌గం సున్నితంగా వెళ్లిపోయిన సినిమా, రెండో స‌గానికి రొటీన్‌గా మారిపోతుంది. కొత్త‌గా ఏమైనా చెబుతాడా అని ఎదురు చూస్తే పాత క‌థ‌ని పాత‌గానే ముగించాడు. ద‌ర్శ‌కుడికి ఎటు వెళ్లాలో తెలియ‌క‌, ప్రేమికుల‌ని ఏం చేయాలో అర్థం కాక‌, కొత్త ట్విస్ట్‌ని మ‌న‌ముందు పెడ‌తాడు. చివ‌రి గంట‌సేపు అస‌హ‌నం, విసుగు తెప్పిస్తాడు. ఎంత‌లా అంటే ఎప్పుడా అని ఎదురు చూసిన సారంగ ద‌రియా పాట కూడా ఎంజాయ్ చేయ‌లేనంత‌.

సాయిప‌ల్ల‌వి అద్భుత న‌టి. ఆమె న‌ట‌నే సినిమాని కాపాడింది. ఉన్నంత‌లో నాగ‌చైత‌న్య బాగా చేశాడు. ఒక ద‌ళిత యువ‌కుడిగా అత‌న్ని ఊహించుకోవ‌డం క‌ష్టం. కొన్నిచోట్ల తేలిపోయినా , అంత‌కంటే ఆశించ‌లేం.

ఈ మ‌ధ్య కులం సినిమాలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. ఉప్పెన ఏదో బ‌య‌ట‌ప‌డింది. శ్రీ‌దేవిసోడా సెంట‌ర్ న‌ష్ట‌పోయింది. ల‌వ్‌స్టోరీ సాయిప‌ల్ల‌వి సాయంతో గ‌ట్టెక్కితే ఎక్కొచ్చు. ఉప్పెన‌లో ప్రేమించిన నేరానికి ఏం జ‌రిగిందో తెలుసు. సోడా సెంట‌ర్‌లో హీరోయిన్ చ‌చ్చిపోతుంది. ల‌వ్‌స్టోరీలో హీరో బాధ‌ని భ‌రిస్తాడు కానీ పోరాడే మూడ్‌లో వుండ‌డు.

పా.రంజిత్‌, వెట్రిమార‌న్ త‌ర‌హాలో పాత్ర‌ల్లో ఎక్క‌డైనా బ‌లం వుందా? ఆ జాన‌ర్‌లో తీస్తే ఆడేస్తాయ‌నుకుని తీయ‌డం త‌ప్ప. ద‌ళిత క‌థ‌లు తీయాలంటే చాలా తెలియాలి. చాలా రాసుకోవాలి. అది జ‌ర‌గ‌క సెకెండాఫ్ గంద‌ర‌గోళం.

శేఖ‌ర్ క‌మ్ముల యోగా మాస్ట‌ర్ లాంటోడు. వెయిట్‌లిఫ్టింగ్ చేయ‌లేడు. బ‌రువు ఎత్తుకుంటే మోయ‌లేడు. ప్రేమ‌, ఎమోష‌న్స్‌, అపార్థాలు, సున్నిత‌మైన హాస్యం త‌న జాన‌ర్‌లో తీసి వుండాల్సింది. లేదు, స‌మ‌స్య‌ను తీసుకుంటే కొత్త‌గా దాన్ని ఎలా ప‌రిష్క‌రించాలో చూపాల్సింది. రొటీన్‌లోకి వెళ్లే స‌రికి ఒక విల‌న్ కావాల్సి వ‌చ్చాడు. ఇంకేదో క్లైమాక్స్ ట్విస్ట్ అవ‌స‌ర‌మైంది.

ఓపిక వుంటే సాయిప‌ల్ల‌వి కోసం ఒక‌సారి చూడొచ్చు.

Also Read : లవ్ స్టోరీ రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp