లాక్ డౌన్ రివ్యూ 50 - ఒరేయ్ బుజ్జిగా

By iDream Post Oct. 01, 2020, 09:37 pm IST
లాక్ డౌన్ రివ్యూ 50 - ఒరేయ్ బుజ్జిగా

ఇంకొద్ది రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్న తరుణంలో వి తర్వాత కాస్త చెప్పుకోదగిన క్యాస్టింగ్ తో ఉన్న తెలుగు సినిమా ఇవాళ డైరెక్ట్ రిలీజ్ అయ్యింది. గతంలో ప్రకటించిన తేదీని ఒక రోజు ముందుకు జరిపి సర్ప్రైజ్ చేసిన టీమ్ ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఒరేయ్ బుజ్జిగాను ఆహా యాప్ వరల్డ్ ప్రీమియర్ ద్వారా విడుదల చేసింది. వరస పరాజయాలతో గత మూడేళ్లుగా సక్సెస్ లేక ఎదురీదుతున్న రాజ్ తరుణ్ దీని మీద గట్టి ఆశలే పెట్టుకున్నాడు. ట్రైలర్ వచ్చాక అంచనాలు ఓ మోస్తరుగా ఏర్పడిన ఈ ఒరేయ్ బుజ్జిగా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

నిడదవోలులో ఉండే శ్రీనివాస్ అలియాస్ బుజ్జి(రాజ్ తరుణ్)ని తండ్రి కోటేశ్వరరావు(పోసాని)పెళ్లి చేసుకోమని పోరు పెట్టడంతో చెప్పా పెట్టకుండా హైదరాబాద్ బయలుదేరతాడు. అదే సమయంలో గవర్నమెంట్ ఇంజనీర్ చాముండేశ్వరి(వాణి విశ్వనాధ్)కూతురు కృష్ణవేణి(మాళవిక నాయర్)తన బావతో మూడు ముళ్ళు వేయించుకోవడం ఇష్టం లేక బుజ్జి ఉన్న ట్రైన్ ఎక్కేస్తుంది. దీంతో ఊరి జనం ఇద్దరూ లేచిపోయారని మాట్లాడుకుంటారు. అనుకోకుండా బుజ్జి, కృష్ణవేణిలు సిటీకి వచ్చాక స్నేహితులు అవుతారు. అప్పుడే బుజ్జికి తన లవర్ సృజన(హేబ్బా పటేల్)తో బ్రేకప్ అవుతుంది. ఈలోగా కృష్ణవేణి కుటుంబం వీళ్ళ జాడ కనుక్కుంటారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు గందరగోళం. అదేంటనేది సినిమాలోనే చూడాలి

నటీనటులు

అచ్చం పక్కింటి కుర్రాడిలా కనిపించే రాజ్ తరుణ్ ఇందులో కూడా అదే ఈజ్ తో చేసుకుంటూ పోయాడు. ఇలాంటి తరహా పాత్ర ఇతనికి కొత్తేమి కాదు. కొట్టిన పిండే. అలవోకగా చేసుకుంటూ పోయాడు. కాకపోతే తనను ఇలా తప్ప జనం రిసీవ్ చేసుకోరు అనుకుంటున్నాడేమో కాబోలు పదే పదే వీటినే రిపీట్ చేయడం ఇప్పటికే మొనాటనీ అయిపోయింది. ఇకనైనా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఒరేయ్ బుజ్జిగా కూడా అదే మూసలోకి వెళ్లిపోయింది. తన ఎనర్జీతో సాధ్యమైనంత నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కొంత వరకు అదే కాపాడింది కూడా.

మాళవిక నాయర్ లో సహజమైన అందంతో పాటు చక్కని నటన ఉంది. ఈ రెండింటిని దర్శకుడు చక్కగా వాడుకున్నాడు. గ్లామర్ స్కిన్ షోలకు దూరంగా ఉండే మాళవికను సరైన పద్ధతిలో వాడుకోవాలే కానీ ఛాలెంజింగ్ రోల్స్ ని సైతం సులువుగా మోయగలిగే టాలెంట్ తనలో ఉంది. ఇందులో కూడా మెప్పించేసింది. హేబ్బా పటేల్ కేవలం ఫస్ట్ హాఫ్ కు మాత్రమే పరిమితమయ్యింది. మరీ స్పెషల్ గా చెప్పుకోదగ్గ స్థాయిలో తన పాత్ర లేకపోయినా ఉన్నంతలో బాగానే కుదిరింది

కామెడీపరంగా సత్య, సప్తగిరి, సత్యం రాజేష్, భద్రం, పమ్మి సాయి హెల్ప్ అయ్యారు. మధునందన్ కు ఎక్కువ స్పేస్ దక్కింది కానీ మరీ గుర్తుండిపోయేలా లేదు. రాజా రవీంద్ర, అవినాష్ కురువిల్లా, పోసాని తదితరులవి రెగ్యులర్ పాత్రలే. జయజానకి నాయక తర్వాత మళ్ళీ వాణి విశ్వనాథ్ ఇందులోనే కనిపించారు. ఉన్నంతలో ఓకే. అన్నపూర్ణ కూడా సేమ్ బ్యాచ్. ఏదో మమ అనిపించేసారు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు విజయ్ కుమార్ కొండా తీసుకున్న పాయింట్ లో ఎలాంటి కొత్తదనం లేదు. ఇలాంటి క్యారెక్టర్ స్వాపింగ్ కామెడీలు రెడీతో మొదలుకుని ఇప్పటిదాకా లెక్కలేనన్ని వచ్చాయి. హీరో హీరోయిన్లు అసలు ఐడెంటిటీని దాచేసుకుని వేరే పేర్లతో పిలుచుకోవడం వాళ్లకు సంబంధించిన వాళ్ళు కన్ఫ్యూజ్ కావడం ఇదంతా చాలా రొటీన్ వ్యవహారం. అయితే విజయ్ కుమార్ ఇదంతా ఎలా ఉన్నా కామెడీతో నవ్విస్తే చాలు ప్రేక్షకులను కన్విన్స్ చేసి మెప్పించొచ్చు అనే నమ్మకంతో ముందుకు వెళ్లారు. ఫస్ట్ హాఫ్ లో ఓ మాదిరిగా సక్సెస్ అయినప్పటికీ అసలు చిక్కు సెకండ్ హాఫ్ లో వచ్చింది. కథనం ఎంతకీ ముందుకు సాగదు. పదే పదే ఒకే చోట తిరుగుతూ అక్కడక్కడా నవ్వించినప్పటికీ మిగిలినదంతా ఎప్పుడు అయిపోతుందా అనిపించేలా సాగింది. అందులోనూ రెండున్నర గంటలకు తగ్గకుండా రాసుకోవడంతో దానికి పాటలు తోడై క్లైమాక్స్ కోసం ఎదురు చూసేలా చేసింది.

కథలో వైవిధ్యం లేనప్పుడు స్క్రీన్ ప్లే వీలైనంత ఎంగేజింగ్ గా ఉండేలా చూసుకోవాలి. అసలే ఇవి జబర్దస్త్ కామెడీకి అలవాటు పడిపోయి వాటికి కూడా ప్రేక్షకులు అంత సులభంగా నవ్వని రోజులు. సింపుల్ కామెడీతో పని జరగదు. ఆరేడేళ్ల క్రితం ఇవన్నీ నడిచాయి కానీ ఇప్పుడు కాదు. శీను బుజ్జి అంటూ రాజ్ తరుణ్, మాళవిక మధ్య పదే పదే ఒకే రిపీట్ సీన్స్ నడిపించడం ఒకదశకు చేరేటప్పటికి బోర్ కొట్టిస్తాయి. మంచి ప్రొడక్షన్ తో పాటు క్యాస్టింగ్ సపోర్ట్ తో చాలా బలహీనతలు కవరైపోయాయి కానీ లేదంటే ఫలితం ఇంకా తేడాగా ఉండేది. ఇంటర్వెల్ బ్లాక్ దాకా పర్లేదు అనిపించినా ఆ తర్వాత గ్రాఫ్ ఎగుడుదిగుడుగా మారిపోయింది. హాస్యంలోనూ వైవిధ్యం కోరుకుంటున్న ట్రెండ్ లో ఓల్డ్ స్కూల్ లో విజయ్ కుమార్ కొండా చేసిన ప్రయత్నం ఓటిటి వరకు ఓకే కానీ థియేటర్ అయ్యుంటే ఖచ్చితంగా ఫలితం ఇంకోలా ఉండేది

అనూప్ రూబెన్స్ సంగీతంలో పెద్దగా మెరుపులు లేవు. డాబా సాంగ్ మాస్ కి నచ్చేలా సాగినా మిగిలినవన్నీ ఏదో విజువల్స్ వల్ల పాసయ్యాయి కానీ ఆడియో రిపీట్ వేల్యూ స్థాయిలో లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. ఆండ్రూ ఛాయాగ్రహణం బెస్ట్ గా నిలిచింది. కెమెరా పనితనం చాలా నీట్ గా ఉండటంతో పాటు అవుట్ ఫుట్ కలర్ఫుల్ గా రావడంలో కీలక పాత్ర పోషించింది. నంద్యాల రవి సంభాషణలు పర్వాలేదు. కొన్ని సీన్స్ లో డైలాగులు పేలాయి కానీ తనదైన ముద్ర మాత్రం పూర్తిగా వేయలేకపోయారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ నిడివిని తగ్గించాల్సింది. ఈ లైన్ కి ఇంత లెన్త్ అవసరం లేదనిపిస్తుంది. కెకె రాధామోహన్ నిర్మాణ విలువలను మెచ్చుకోవచ్చు. కథ డిమాండ్ మేరకు అడిగినంత ఖర్చు పెట్టారు

ప్లస్ గా నిలిచినవి

రాజ్ తరుణ్ ఎనర్జీ
మాళవిక నాయర్
ఫస్ట్ హాఫ్ కామెడీ
ఛాయాగ్రహణం

మైనస్ గా అనిపించేవి

సినిమా నిడివి
సెకండ్ హాఫ్ ల్యాగ్
రొటీన్ స్టోరీ
రిపీట్ గా అనిపించే సీన్స్
క్లైమాక్స్

కంక్లూజన్

ప్రేమకథల్లో కామెడీని మిక్స్ చేసి ఎంటర్ టైన్ చేయడం ఒక ఆర్టు. దర్శకుడు విజయ్ కుమార్ కొండా తన మొదటి సినిమా గుండె జారీ గల్లంతయ్యిందే తరహాలో దీన్ని కూడా మంచి వినోదాత్మకంగా మలిచే ప్రయత్నం గట్టిగా చేశాడు. కానీ ఆ మూవీకి ఇప్పటికి మధ్య జరిగిన కాలంలో వచ్చిన మార్పులను ఒడిసిపట్టలేక అదే పాత స్టైల్ లో దీన్ని మెప్పించేలా చేద్దామనుకున్నాడు కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కాకపోతే ఇది థియేట్రికల్ రిలీజ్ కాదు కాబట్టి ఓటిటి కోణంలో చూసుకుంటే మరీ బ్యాడ్ ఛాయస్ అనిపించదు. ఏదో టైం పాస్ జరిగిన ఫీలింగ్ ఇస్తుంది. అది కూడా ఒరేయ్ బుజ్జిగాలో గట్టి విషయం ఉంటుందని ఎక్కువ అంచనాలు పెట్టేసుకోకుంటేనే సుమా. ఒక్కసారి చూసే క్యాటగిరీలో వేయొచ్చు.

ఒరేయ్ బుజ్జిగా - కొంచెం కిక్కు మొత్తం చిక్కు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp