లాక్ డౌన్ రివ్యూ 36 - తీవ్రవాద అవరోధం

By iDream Post Aug. 03, 2020, 05:12 pm IST
లాక్ డౌన్ రివ్యూ 36 - తీవ్రవాద అవరోధం

ఈ మధ్యకాలంలో డిజిటల్ సంస్థల మధ్య మూవీస్ కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ పోటీ బాగా పెరిగిపోయింది. సినిమాలను తలదన్నే బడ్జెట్ లతో కాంటెంపోరరీ సబ్జెక్టులను తీసుకుని నవతరం దర్శకులు ఆవిష్కరిస్తున్న తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అన్నీ బాగున్నాయని చెప్పలేం కానీ గతంతో పోల్చుకుంటే చాలా క్వాలిటీ మేకింగ్ వీటిలో కనిపిస్తోంది. పెద్దగా హడావిడి లేకుండా సోనీ లివ్ వదులుతున్న సిరీస్ లు ఈమధ్యలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవలో వచ్చిందే అవరోధ్ - ది సీజ్ వితిన్. భారతదేశ ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేని 2016 యురి అటాక్ - సర్జికల్ స్ట్రైక్ ఘటనలు ఆధారంగా తీసుకుని 9 ఎపిసోడ్లు కలిపి నాలుగున్నర గంటల నిడివిలో దీన్ని రూపొందించారు. మరి ఇది ఎలా ఉందో రివ్యూలో లుక్ వేద్దాం

కథ

యురి(URI) ఉదంతం గురించి అవగాహన ఉన్న వాళ్లకు ఇదేమి కొత్త కథ కాదు. గత ఏడాది ఇదే పేరుతో విక్కీ కౌశల్ హీరోగా ఓ సినిమా కూడా వచ్చింది. బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇది దానికి ఒకరకంగా ఎక్స్ టెన్షన్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో నివాసం ఏర్పరుచుకున్న జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులు సరిహద్దులు దాటి ఇండియన్ ఆర్మీ కాంప్ మీద దాడి చేస్తారు. పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతంతో ప్రధాని(విక్రమ్ గోఖలే)ఈ ఆపరేషన్ ని కమాండర్ విదీప్(అమిత్ సాద్)కు అప్పగిస్తాడు. దీనికి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తరఫున శైలేష్(నీరజ్ కబీ)నేతృత్వం వహిస్తాడు. చాలా క్లిష్టమైన ఈ మిషన్ ని మన సోల్జర్స్ ప్రాణ నష్టం లేకుండా శత్రువులను ఎలా మట్టుబెట్టి వెనక్కు వచ్చారనేదే ఇందులోని మెయిన్ స్టోరీ

నటీనటులు

ఇందులో కథే హీరో కాబట్టి ప్రత్యేకంగా ఒకరి గురించే చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు దర్శకుడు. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ తో సిరీస్ ఆద్యంతం ఆసక్తిగా నడిచేలా ప్రతిఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు. అంతా చూశాక సహజంగానే అమిత్ సాద్ ఎక్కువ గుర్తుండిపోతాడు. ఇటీవలి కాలంలో ఇలాంటి వెబ్ సిరీస్ లకు అద్భుతమైన ఆప్షన్ గా నిలుస్తున్న అమిత్ సాద్ ఇందులో మరోసారి చెలరేగాడు. వార్తలను త్వరగా ఇవ్వాలనే ఆత్రంతో కీలకమైన రహస్యాలను జనానికి చెప్పే జర్నలిస్ట్ గా మధురిమా తులి చక్కటి నటన కనబరిచింది. ఆకట్టుకునే రూపంతో పాటు హావభావాలు కూడా గొప్పగా పలికించింది.

తెలుగు నటుడు ఆదర్శ్ బాలకృష్ణ కూడా కనిపిస్తాడు కానీ కేవలం కొన్ని నిమిషాలకే పరిమితమయ్యాడు. సీనియర్ నటుడు అనంత్ నారాయణ్ మహదేవన్, ఆరిఫ్ జకారియా, మీర్ సర్వార్ తదితరులు పాత్రలకు తగ్గట్టు బాగా అమిరారు. నరేంద్ర మోడీ తరహా వేషభాషలో కనిపించే విక్రమ్ గోఖలే కొంచెం బిగుసుకుని నటించినట్టు అనిపించింది. ఇమిటేట్ చేయకుండా న్యాచురల్ ఉంటే బాగుండేది. సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ ఇలా పిఎం క్యాబినెట్ లోని మినిస్టర్లు ఇందులో కనిపిస్తారు. వారి నుంచి కూడా మంచి నటన రాబట్టుకున్న విధానాన్ని మెచ్చుకోవాలి

డైరెక్టర్ అండ్ టీమ్

ప్రముఖ రచయిత శివ్ ఆరూర్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ పుస్తకంలోని ఒక అధ్యాయం ఆధారంగా తీసుకుని దర్శకుడు రాజ్ ఆచార్య దీన్ని రూపొందించారు. కథ చెప్పిన విధానం యురి సినిమాను పోలినప్పటికీ ఇందులో అసలు ఘటన జరగక ముందు క్రమాన్ని, జరిగినప్పుడు నడిచిన తతంగాన్ని చాలా డీటెయిల్డ్ గా చూపించారు. ఇక్కడ రైటర్స్ బృందానికి ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, మిలిటరి క్యాంప్స్ లో సోల్జర్స్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుంది తదితరాలు బాగా ఆవిష్కరించారు. నిజంగా ఆ టైంలో కెమెరాలు పెట్టి తీశారా అన్నంత సహజంగా అవుట్ ఫుట్ రావడానికి రాజ్ ఆచార్య టీమ్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

ఇందులో మరీ సీట్ ఎడ్జ్ లో కూర్చునేంత థ్రిల్స్ ఉండవు. కానీ ఒక వ్యవస్థలో సమస్య తలెత్తినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేది వార్ రూమ్ ని న్యాచురల్ గా చూపించడం వల్ల ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇవన్నీ సామాన్యులకు అవగాహన ఉండే విషయాలు కాదు కాబట్టి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఒకదశ దాకా మంచి టెంపోలో వెళ్లిన కథనం మధ్యలో కొంచెం నెమ్మదించడం ఒక్కటే మైనస్ గా చెప్పుకోవచ్చు. అప్పటిదాకా చాలా టెర్రిఫిక్ గా సాగిన కథాగమనం ప్రీ క్లైమాక్స్ నుంచి మాములుగా అనిపించడం కొందరికి నచ్చకపోవచ్చు. చివరి ఘట్టం గురించి విపరీతమైన అంచనాలు పెట్టుకుంటేనే ఇలా అనిపిస్తుందే తప్ప వేరే కారణం కాదు . ఇప్పటికే వెండితెరపై చూసేసిన కథను రాజ్ ఆచార్య దానికి రెట్టింపు నిడివితో డీల్ చేయడం సాహసం అనుకుంటే అందులో సక్సెస్ కావడం ఫైనల్ టచ్

షాను సింగ్ రాజ్ పూత్ ఛాయాగ్రహణం ఫెంటాస్టిక్ అని చెప్పాలి. లొకేషన్స్ ని బంధించిన తీరు, చిమ్మ చీకటిలో జరిగిన సంఘటలను గందరగోళం లేకుండా చూపించాలని లైటింగ్ సెట్ చేసుకున్న వైనం టాప్ స్టాండర్డ్ లో ఉన్నాయి. సంగీతం కూడా హడావిడి లేకుండా బాగా కుదిరింది. కాకపోతే గతంలో విన్న స్కోర్ అనిపిస్తుంది అక్కడక్కడా. నిర్మల్ పాండ్య మరీ గొప్పగా అనిపించే అవుట్ ఫుట్ అయితే ఇవ్వలేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కృషి మాత్రం చాలా గొప్పగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి. పైపెచ్చు దానికన్నా ఎక్కువే అని చెప్పినా అతిశయోక్తి కాదు.

కంక్లూజన్

మనకు నచ్చిన ఉద్యోగం చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతూ గుండెల మీద చేతులు వేసుకుని నిబ్బరంగా ఉన్నామంటే దానికి కారణం దేశరక్షణ కోసం ప్రాణాలు ఒడ్డుతున్న సైనికులే. వాళ్ళు ఎదురుకునే సవాళ్లు , చేసే యుద్ధాలు, కొనితెచ్చుకునే ప్రమాదాలు ఎలా ఉంటాయో కనీసం మన ఊహకు కూడా అందదు. అలాంటి వాటికీ కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసే అవరోధ్ ని తప్పకుండా చూడాలి. ఇటీవలి కాలంలో కొన్ని వెబ్ సిరీస్ లలో కనిపిస్తున్న విశృంఖలత్వం, పైత్యం లాంటివి ఏవీ లేకుండా చరిత్రలో నిలిచిపోయిన ఓ దేశజెండా విజయానికి సాక్ష్యంగా నిలిచిన అవరోధ్ లాంటివి ఇప్పటి తరానికి చాలా అవసరం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp