క్రాక్ మాస్ట‌ర్‌, what is Red?

By G.R Maharshi Jan. 18, 2021, 06:03 pm IST
క్రాక్ మాస్ట‌ర్‌, what is Red?

జాక్స‌న్ విల్లీలో వ‌రుస‌గా 3 రోజులు సినిమాలు చూశాను. సంవ‌త్స‌రం గ్యాప్ త‌రువాత క‌రువు తీరింది. స్క్రీన్ మీద తెలుగు విని ఎంత కాల‌మైందో! నేను చూసిన థియేట‌ర్లు చిన్న‌వి. ఒక‌దాని కెపాసిటీ 80, ఇంకొక‌టి 50. మాస్ట‌ర్‌కి 10 మంది, క్రాక్‌కి 12 మంది, రెడ్‌కి 8 మంది వ‌చ్చారు. ఇక్క‌డ ఒక ప్రేక్ష‌కుడు వ‌చ్చినా సినిమా వేస్తార‌ట (నేనోసారి ధ‌నుష్ "రైలు" సినిమాకి ఆన్‌లైన్‌లో బుక్ చేసి వెళితే నేనొక్క‌న్నే. థియేట‌ర్ వాళ్లు షో వేయ‌మ‌ని చెప్పారు (అత్తాపూర్ మల్టిఫ్లెక్స్‌). నేను గ‌ట్టిగా మాట్లాడితే దానికి బ‌దులు "పింక్" మూవీ టికెట్ ఇచ్చారు).

ఈ మూడు సినిమాలు చూసిన త‌ర్వాత దిగులు క‌లిగింది. మాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పేరుతో ఈ ఊబి నుంచి ఎప్ప‌టికీ బ‌య‌టికి రాలేమా అని! మూడింటిలోనూ హింస‌, ర‌క్తం , అన‌వ‌స‌ర బిల్డ‌ప్‌లు. హీరో అన‌గానే ఎంట్రీ అద‌రాలి. ఒక మాస్ సాంగ్‌, ఐట‌మ్ సాంగ్ , చిత‌క్కొట్టుడు. విజ‌య్ , విజ‌య్‌సేతుప‌తి డేట్లు దొరికిన త‌ర్వాత సీన్లు రాసుకున్న‌ట్టున్నారు. వాళ్లిద్ద‌రినీ ఎలివేట్ చేయ‌డానికి స‌గం సినిమా స‌రిపోయింది. ఖైది తీసిన లోకేశ్ క‌న‌గ‌రాజేనా దీని డైరెక్ట‌ర్ అని ఆశ్చ‌ర్య‌పోయేలా ఉంది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్లు కూడా హీరో ఇమేజ్‌లో ప‌డితే ఇదే గ‌తి. హీరో నిరంత‌రం తాగుతూ వుంటాడు. విల‌న్ జైల్లోని చిన్న పిల్ల‌ల‌తో నేరాలు చేయిస్తూ లొంగ‌క‌పోతే చంపేస్తూ వుంటాడు.

వీళ్లిద్ద‌రి మ‌ధ్య ట‌గ్‌. అది కూడా సినిమా చివ‌రి అర‌గంట‌. లారీ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యేందుకు విల‌న్ మ‌ర్డ‌ర్లు చేస్తూ వుంటాడు. అది చాలా గొప్ప ప‌ద‌వ‌ని డైరెక్ట‌ర్ అనుకున్నాడేమో! సినిమాలో ఇంకెవ‌రికీ క్యారెక్ట‌ర్ వుండ‌దు. వీళ్లిద్ద‌రి బిల్డ‌ప్‌లు చూసేస‌రికి వాచి పోయింది. ఈ ఊళ్లో ఇంట‌ర్వెల్ లేదు. పాత కాలంలోలా పాట‌లొస్తే లేచి బ‌య‌టికి పోవాల్సిందే.

ఇక క్రాక్‌. విక్ర‌మార్కుడు , ప‌వ‌ర్ రీమిక్స్ చేసిన‌ట్టుంది. అయితే ఉన్నంత‌లో ఇది బెట‌ర్‌. డైరెక్ట‌ర్ గోపిచంద్ కొన్ని సీన్స్ కొత్త‌గా రాసుకుని, తీశాడు. "ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజిమ‌న్ బ‌ట‌న్‌"లో డైరెక్ట‌ర్ డేవిడ్ ఫించ‌ర్ హీరోయిన్ రోడ్డు యాక్సిడెంట్ గురించి చెబుతాడు. అంత‌కు ముందు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో ఏ ఒక‌టి కొంచెం ఆల‌స్యంగా జ‌రిగినా , ఆ ప్ర‌మాదం జ‌ర‌గ‌దు. ఇలాంటి టెక్నిక్‌ని మామిడికాయ మేకుతో చెప్ప‌డం బాగుంది. అన‌వ‌స‌ర‌మైన పాట‌లు లేక‌పోతే ఇది ఇంకా స్పీడ్‌గా వుండేది. ఇపుడున్న సినిమాల్లో కాసేపు థియేట‌ర్‌లో కూచోపెట్టే సినిమా ఇదే.

ఇక మ‌న ద‌గ్గ‌ర క‌థ‌లు లేవ‌ని త‌మిళ్‌, మ‌ల‌యాళం రీమేక్‌లు ఎక్కువ‌య్యాయి. వీటితో స‌మ‌స్య ఏమంటే OTTలో ఒరిజిన‌ల్ చూసేసి, మ‌న వాళ్లు పోల్చి చూసుకుంటున్నారు. ద‌ర్శ‌కుడికి మార్పులు చేసే స్వేచ్ఛ లేక Cut Pasteకి పూనుకోవ‌డం.

"త‌డం" త‌మిళ సినిమా రీమేక్ రెడ్ ప‌రిస్థితి కూడా ఇదే. ఒరిజ‌న‌ల్‌కి మ‌క్కికి మ‌క్కి తీసిన ఏదో మిస్ అయింది. రామ్ అన‌వ‌స‌ర బిల్డ‌ప్‌, ఐటం సాంగ్ ఇదో అడ్డంకి. మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేష‌న్ పోలీసులు చేస్తూ వుంటారు త‌ప్ప మ‌నం ట్రావెల్ చేయం. మ‌న‌కి సంబంధం లేని స్క్రీన్ మీద ఏదో జ‌రుగుతూ ఉంటుంది. ఈ 3 సినిమాల్లో క‌థా బ‌లం ఉన్న‌ది ఇదే అయిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడికి సొంత బుర్ర వాడే అవ‌కాశం రాక‌పోవ‌డంతో తుస్సుమ‌నింది.

సొసైటీ ఎలా ఉంటుందో సినిమాలు అలా ఉంటాయి. జ‌నంకి ఏం కావాలో అదే ఇస్తాయి. 1980 వ‌ర‌కూ హీరో ఉదాత్త పురుషుడు. జ‌నం కోసం నిల‌బ‌డే వాడు. నీతి నిజాయితీ అనేవాడు. 80 త‌ర్వాత హీరో మాఫియా డాన్‌, స్మ‌గ్ల‌ర్‌, తాగుబోతు, జూద‌రిగా మారాడు. 90 త‌ర్వాత తిక్క‌, క్రాక్ లోఫ‌ర్ , ఇడియ‌ట్ అయ్యాడు. అన్నీ ఇవే వ‌స్తున్నాయి కాదు, వీటికి సామాజిక ఆమోదం ల‌భించింది.

హీరో ఎంత బేవార్స్‌గా ఉంటే అంత గ్లామ‌ర్‌. మాస్ట‌ర్‌లో హీరో ప‌గ‌లూరాత్రి తాగేస్తూ ఉంటాడు కానీ, పిల్ల‌ల‌కి మంచి టీచ‌ర్‌. క్రాక్‌లో హీరోకి సెమి మెంట‌ల్‌. ఎపుడేం చేస్తాడో తెలియ‌దు. రెడ్‌లో హీరో దొంగ‌. తాగుబోతు, జూద‌రి కానీ మంచివాడు.

న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా సినిమాలు చూడ‌క మానం. క‌థ‌లు విన‌డం మ‌న‌కిష్టం. పార్ల‌మెంట్‌లో కూడా అవే చెబుతారు. పాల‌కులు ఎపుడూ స్టోరీ టెల్ల‌ర్సే. రైతుల‌కి మంచి కోసం చ‌ట్టాలు చేశామ‌ని చెబితే వింటున్నామా లేదా? మ‌రి అవే వింటున్న‌ప్పుడు సినిమా క‌థ‌లు విన‌డానికి , చూడ‌డానికేం?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp