క్రాక్ వివాదం - ఒక మేలుకొలుపు

కొద్దిరోజుల క్రితం నైజామ్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను క్రాక్ సినిమా విషయంలో దిల్ రాజు, శిరీష్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేయడం ఎంత దుమారం రేపిందో చూశాం. ఇతర పండగ చిత్రాల కోసం మంచి టాక్ వచ్చిన క్రాక్ కు కావాలని స్క్రీన్లు తగ్గించారని అడిగితే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడమే కాక గతంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వివరించడంతో ఇష్యూ చాలా పెద్దదయ్యింది. ఈ రోజు నుంచి క్రాక్ కు కనక థియేటర్లను తగ్గిస్తే రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేసి మీడియాకు మొత్తం వివరించాలని శ్రీను నిర్ణయించుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. దాంతో నిన్న అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసుకుని దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం న్యాయం వరంగల్ శ్రీను వైపే జరిగిందని సమాచారం. క్రాక్ కు ఈ వారాంతం కూడా ఎక్కువ స్క్రీన్లు వచ్చేలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇది అధికారికంగా బయటికి చెప్పేది కాదు కాబట్టి అంతర్గతంగా సెటిల్ చేసినట్టు వినికిడి. అంతే కాదు దిల్ రాజు, శిరీష్ ల నుంచి వివరణ కూడా తీసుకోబోతున్నారట. శ్రీనుకి క్రాక్ నిర్మాత మధు అండగా నిలవడంతో పాటు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం ఈ పరిమాణం వేగంగా జరిగేందుకు దోహదపడింది. సో క్రాక్ కు ఈ రోజు నుంచే స్క్రీన్ కౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ వీకెండ్ ఇక్కడ ఉపయోగపడుతుంది.
ఏది ఏమైనా క్రాక్ వివాదం పరిశ్రమకు ఒక మేలుకొలుపు లాంటిది. భవిష్యత్తులో ఏ నిర్మాతా పంపిణీదారుడు తమ వ్యక్తిగత అజెండా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా చేసేలా ఏదైనా ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. విడుదల రోజున షోలు ఆలస్యంగా మొదలుకావడం, పాన్ ఇండియాని సాకుగా చూపి డబ్బింగ్ సినిమాలకు ప్రాధ్యాన్యం ఇచ్చి అవసరానికి మించిన స్క్రీన్లను వాటికి కేటాయించడం లాంటి ధోరణికి అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇలాంటి సమస్యలు ముందు ముందు కూడా తలెత్తుతాయి. ఇప్పటిదాకా ఈ విషయంలో మౌనంగానే ఉన్న దిల్ రాజు ఇకనైనా స్పందిస్తారేమో చూడాలి


Click Here and join us to get our latest updates through WhatsApp