మహేష్ సినిమాలు అందుకే ఇవ్వలేదు

By iDream Post Jun. 27, 2020, 07:43 pm IST
మహేష్ సినిమాలు అందుకే ఇవ్వలేదు

తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి పేరు తెలియని వారు ఉండరు. రాజ్ తో కలిసినప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ ఎన్నో. చక్రవర్తి, ఇళయరాజాల ప్రభంజనం విస్తృతంగా ఉన్న టైంలో వచ్చిన రాజ్ కోటి అంత పోటీలోనూ తమ ప్రతిభను నిరూపించుకుని ప్రతి ఒక్క స్టార్ హీరోకు తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అందులో చిరంజీవి యముడికి మొగుడు, బాలకృష్ణ బాలగోపాలుడు, నాగార్జున హలో బ్రదర్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. కోటి విడిగా ఇచ్చిన గొప్ప సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. మెగాస్టార్ కు అల్లుడా మజాకా ఇచ్చినా, తరుణ్ లాంటి కొత్త హీరోకు నువ్వే కావాలి చేసినా , సెంటిమెంట్ సబ్జెక్టుతో కన్యాదానం కంపోజ్ చేసినా తనదంటూ ప్రత్యేక బాణీ చూపించడం ఆయనకే చెల్లింది.

రీ రికార్డింగ్ లోనూ కోటిది అందెవేసిన చెయ్యి. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ తొలుత రాజ్ కోటి దగ్గరే పని చేశారు. మణిశర్మ వచ్చాకే కోటి స్పీడుకి బ్రేకులు పడ్డాయి.. అయితే ఇంత చేసినా మహేష్ బాబుతో సోలో సినిమా లేదే అన్న లోటు మాత్రం కోటికి అలా ఉండిపోయింది. దానికి కారణం లేకపోలేదు. 1999లో అమితాబ్ బచ్చన్ హీరోగా హిందిలో సూర్యవంశం రీమేక్ ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందింది. కృష్ణ గారి పద్మాలయ బ్యానర్ లో దీన్ని నిర్మించారు. అను మాలిక్ పాటలు కంపోజ్ చేయగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కోటిని తీసుకున్నారు. బడ్జెట్ ముందే మాట్లాడుకున్నారు. అయితే పని జరుగుతుండగా ముందు అనుకున్న పేమెంట్ కంటే తక్కువగా ఇవ్వబోతుండటం కోటికి నచ్చలేదు. ఆర్కెస్ట్రాకి అప్పటి యూనియన్ రూల్స్ ప్రకారం డబుల్ లేదా ట్రిపుల్ పేమెంట్ ఇవ్వాలి.

కాని ఇలా కోత వేస్తే అది తన నెత్తి మీద పడుతుంది. దీంతో కోటి ఇలా చేయనని చెప్పేశారు. దీంతో విషయం పైదాకా వెళ్ళింది. కృష్ణ, విజయనిర్మల మీద ఉన్న గౌరవంతో కోటి దాన్ని పూర్తి చేశారు. కాని కోటి మీద లేనిపోనివన్ని చెప్పేయడంతో మహేష్ బాబు హీరో అయ్యాక ఆ కాంపౌండ్ నుంచి ఏ అవకాశం కోటి తలుపు తట్టలేదు. దీంతో విషయం అర్థం చేసుకున్న కోటి సైలెంట్ అయ్యారు. ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే కాబట్టి అంతటితో ఆ విషయాన్నీ వదిలేశారు. ఒకవేళ ఆ కాంబినేషన్ కూడా కుదిరి ఉంటే ఓ మంచి రికార్డు కోటి ఖాతాలో అదనంగా వచ్చి చేరేది. ఎంత గొప్ప సంగీత దర్శకులైనా విధి వాళ్ళ చేతుల్లో ఉండదుగా. అందుకే ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp