క్లాసు మాసు మెచ్చిన బాణీ 'కీరవాణి'

By iDream Post Jul. 04, 2020, 01:51 pm IST
క్లాసు మాసు మెచ్చిన బాణీ  'కీరవాణి'

ఉద్దండులుండే సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుడిగా నెగ్గుకురావడం అంత సులువు కాదు. ఇక్కడే ప్రతిభే కొలమానంగా పని చేస్తుంది. అందులోనూ విజయాలు ఉంటేనే అవకాశాలు పలకరించే స్థితిలో ఇళయరాజా, రాజ్ కోటి లాంటి అగ్రజుల ప్రభంజనం కొనసాగుతూ వాళ్ళ మ్యూజిక్ కు జనం విపరీతంగా అలవాటు పడిన పోటీలో నిలవడం అంత సులభం కాదు. కానీ ఎంఎం కీరవాణి దాన్నే సవాల్ గా తీసుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీ ఏర్పరుచుకున్నారు. నిజానికి ఈయన పరిచయం జరగాల్సింది రామ్ గోపాల్ వర్మ శివతో. కానీ మొదటి సినిమా ఇళయరాజా సంగీతం కావాలన్న కోరికతో వర్మ మాట మీద నిలవలేకపోయారు. కానీ రెండో సినిమా క్షణక్షణంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూపర్ హిట్ అందుకున్నారు.

కీరవాణి డెబ్యూ చేసింది 1990లో ఉషాకిరణ్ వారి మనసు మమత సినిమాతో. ఫలితం పేరు తెచ్చింది కానీ ఆశించినంత గొప్పగా కాదు. మూడో చిత్రం సీతారామయ్య గారి మనవరాలు ఒకేసారి వంద మెట్లు పైకెక్కించింది. వయసులో ఉన్న స్టార్ హీరో కాకుండా ఏఎన్ఆర్ తో క్రాంతి కుమార్ తీసిన ఎమోషనల్ డ్రామాకు కీరవాణి ఇచ్చిన ట్యూన్స్ ఊరు వాడా మారుమ్రోగిపోయాయి. ఆ తర్వాత అశ్విని, మొండిమొగుడు పెంకిపెళ్ళాం ఇలా వరస హిట్లతో దూసుకుపోతున్న టైంలో రాఘవేంద్రరావు గారి పరిచయం ఊహించని మలుపులకు దారి తీసింది. 1992లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఘరానా మొగుడు అవకాశం దక్కించుకున్న కీరవాణి తన మీద పెట్టుకున్న అంచనాలను రెట్టింపు న్యాయం చేకూరుస్తూ మాస్ వెరెక్కిపోయే స్థాయిలో పాటలు ఇచ్చారు. నిర్మాతలు ఎగబడటం మొదలయ్యింది. ఆ వెంటనే డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందిన సుందరకాండకు ఎవర్ గ్రీన్ ట్యూన్స్ ఇచ్చి వెంకటేష్ కో మ్యూజికల్ హిట్ జమ చేశారు.

ఇక అక్కడి నుంచి అల్లరి మొగుడు, ఆపద్బాంధవుడు, మిస్టర్ పెళ్ళాం, అల్లరి ప్రియుడు. అబ్బాయిగారు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు, మేజర్ చంద్రకాంత్, క్రిమినల్, అల్లరి ప్రేమికుడు, బొబ్బిలి సింహం, శుభసంకల్పం ఇలా అందరి దర్శకులతోనూ మరపురాని హిట్స్ అందుకున్నారు. మాతృదేవోభవ పాటల గురించి గ్రంథమే రాయొచ్చు. ఒక సినిమా ఆల్బమ్ లో ఐదారు పాటలతోనే మెప్పించడం కష్టమనుకుంటున్న టైంలో 1995 పెళ్లి సందడిలో ఏకంగా 14 పాటలు ఒక్కటీ పక్కకు పెట్టే అవకాశం లేకుండా ఆణిముత్యాల్లాంటి సాంగ్స్ ఇచ్చి ఆడియో రిలీజ్ చేసిన లహరి కంపెనీకు కోట్లలో లాభం వచ్చేలా క్యాసెట్ సేల్స్ చేయించిన ఘనత కీరవాణిదే. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంలో కీరవాణి సంగీతానిదే సింహభాగం.

1997లో వచ్చిన ఆధ్యాత్మిక చిత్రం అన్నమయ్యతో మరో గొప్ప మజిలీ అందుకున్నారు. తెలిసిన కీర్తనలనే జనరంజకంగా రూపొందించి దిగ్గజ గాయకులతో పాడించిన తీరు లక్షల్లో క్యాసెట్లు, సిడిలు అమ్ముడుపోయేలా చేసింది. ఇప్పటికీ గుళ్ళలో ఇవే పాటలు విన్పించడం అతిశయోక్తి కాదు. యువతరంలోనూ కీరవాణి తన మార్కును కొనసాగించారు. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్-సింహాద్రి-యమదొంగ , ప్రభాస్ బాహుబలి-ఛత్రపతి , అల్లు అర్జున్ గంగోత్రి, రవితేజ విక్రమార్కుడు, రామ్ చరణ్ మగధీర ఇలా అందరితోనే చిరకాలం నిలిచిపోయే పాటలు ఇచ్చిన ఘనత ఆయనదే. 2020లోనూ రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు పనిచేస్తున్నా రామ్ గోపాల్ వర్మ 12ఓక్లాక్ కు కంపోజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ 27కి ట్యూన్స్ ఇస్తున్నా అదే పట్టుదల అదే తపన కనిపించే కీరవాణి పుట్టినరోజు ఇవాళ. అందుకే సోషల్ మీడియాలోనూ ఆయన గీతాల మధురస్మృతులతో గడుపుతూ రాబోయే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp