అరణ్యలో చందమామ కానుక

By iDream Post Aug. 07, 2020, 07:11 pm IST
అరణ్యలో చందమామ కానుక

బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా బొత్తిగా నల్లపూసైపోయాడు. ఎన్టీఆర్ మహానాయకుడులో చేశాడు కానీ ఎవరికీ గుర్తులేనంత ఫ్లాప్ అయ్యింది. రేపు ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడు రానా. లాక్ డౌన్ రాకపోయి ఉంటే అంగరంగ వైభవంగా జరిగేది కానీ నిబంధనల నేపధ్యంలో చాలా పరిమిత సభ్యుల మధ్య కార్యం చేసేస్తున్నారు. ఇదిలా ఉండగా రానా కొత్త సినిమా అరణ్య ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉండగా థియేటర్లు మూతబడిన కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఓటిటి రిలీజ్ గురించి నిర్మాతలు ఏమి చెప్పడం లేదు. హాల్స్ లోనే వస్తుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

అరణ్యకు సంబంధించి ఒక స్వీట్ సర్ప్రైజ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం చందమామ కాజల్ అగర్వాల్ ఇందులో ఓ అరగంట పాటు కనిపించే స్పెషల్ క్యామియో చేసిందట. గిరిజన యువతీగా చాలా సహజమైన మేకప్ తో ఎవరూ ఊహించని రీతిలో ఈ పాత్ర ఉంటుందని ఇన్ సైడ్ న్యూస్. ఇప్పటిదాకా గుట్టుగా ఉంచినప్పటికీ మొత్తానికి లీకైతే వచ్చేసింది. అయితే నిజమా కదా అనేది మాత్రం అధికారికంగా బయటికి వచ్చే ఛాన్స్ లేదు. హిందీలో హాతీ మేరీ సాతి, తమిళ్ లో కాండన్ పేరుతో రూపొందుతున్న అరణ్యకు ప్రభు సాల్మన్ దర్శకుడు.

ఇతను గతంలో ప్రేమఖైది, గజరాజు సినిమాల ద్వారా మనకూ సుపరిచితుడే. అడవి నేపధ్యంలో మంచి ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీస్ తీస్తాడని పేరున్న ప్రభు సల్మాన్ ఈసారి వన్యప్రాణి సంరక్షణ కాన్సెప్ట్ ను తీసుకున్నారు. పాత్ర చాలా ప్రత్యేకమైనది కాబట్టే కాజల్ కు డెబ్భై లక్షల దాకా పారితోషికం ఇచ్చినట్టుగా తెలిసింది. రానాకు అరణ్య తర్వాత విరాట పర్వం పూర్తి చేయాల్సిన టాస్క్ ఉంది. దీని తర్వాత సురేష్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే హిరణ్యకశిప వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. రానా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందబోతోంది. కొత్త పెళ్లికొడుకయ్యాక రానా చాలా బిజీ కాబోతున్నాడు. ఒకపక్క నటన మరోపక్క ప్రొడక్షన్ వ్యవహారాలు అన్ని బాలన్స్ చేయాలి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp