ఉత్తమ హీరోగా, విలన్ గా ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న జోకర్ - Nostalgia

By Rishi K Feb. 10, 2020, 12:36 pm IST
ఉత్తమ హీరోగా, విలన్ గా ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న జోకర్ - Nostalgia

సినిమా అవార్డుల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును జీవితంలో ఒకసారైనా పొందాలని ప్రతీ నటుడు కలలు కంటారు.. అలాంటిది ఒకే పాత్రకి రెండు వేరు వేరు సినిమాల్లో ఆస్కార్ అవార్డులు రావడం అనేది అత్యంత అరుదైన విషయం.. దాన్ని చేసి చూపించింది జోకర్ పాత్ర.. ప్రపంచ సినీ చరిత్రలో ఒకే పాత్రకి, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు రావడం అనేది ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారేమో.. జోకర్ పాత్ర ఆ అద్భుతాన్ని చేసి చూపించింది.

జోకర్...భాషాభేదం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పాత్ర..మొదట్లో డీసీ కామిక్స్ లో 1939 లో కనిపించిన ఈ పాత్రని, బాట్మాన్ పాత్రని సృష్టించిన బాబ్ కేన్, బిల్ ఫింగర్ జోకర్ పాత్రను కూడా సృష్టించారు. కానీ 2008లో క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో రూపొందిన డార్క్ నైట్ లో బాట్మాన్ ను అంతం చేయడానికి ప్రయత్నించే జోకర్ పాత్రకి ప్రపంచ వ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా యూత్ ఐకాన్ గా జోకర్ పాత్ర మారిపోయింది.. ఎంత గొప్ప హీరోని అయినా తన తెగువతో,పిచ్చితనంతో ఎదుర్కొనే జోకర్ కి యువతరం దాసోహం అయ్యింది..

సూపర్ హీరోని ఎదుర్కొనే సామాన్య వ్యక్తిగా జోకర్ నటన అద్భుతంగ ఉంటుంది.. బాట్మాన్ దగ్గర శత్రువులను మట్టుపెట్టే ఎన్నో ఆయుధాలు ఉంటాయి. కానీ జోకర్ దగ్గర అలాంటి ఆయుధాలు ఏమీ ఉండవు.. అయినా సూపర్ హీరోని ధీటుగా ఎదుర్కొంటాడు. సైకోలాగా కనిపించే,ప్రవర్తించే జోకర్ మాటలను నిశితంగా గమనిస్తే మనుషుల్లో ఉండే లోపాలను ఎత్తి చూపుతున్నట్లు అర్ధం అవుతుంది.. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే జోకర్ పాత్ర పోషించిన హీత్ లెడ్జర్ కు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డుతో సహా 2009 సంవత్సరం ప్రకటించిన మిగిలిన (గోల్డెన్ గ్లోబ్ ,స్క్రీన్ ఆక్టర్,BAFTA ) అవార్డులన్నీ దక్కాయి. కానీ ఆస్కార్ అవార్డు స్వీకరించకుండానే హీత్ లెడ్జర్ చనిపోవడం విషాదం.

జోకర్ పాత్రకి గతం ఏమిటో, ఎక్కడనుండి వచ్చాడో డార్క్ నైట్ లో ప్రస్తావించలేదు.. అందుకే జోకర్ జీవితం ఎందుకు అలా సైకోగా, శాడిస్టిక్ గా మారిందో 2019 లో టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో రూపొందిన జోకర్ లో చూపించారు. డార్క్ నైట్ లో జోకర్ పాత్రకు ప్రీక్వెల్ గా రూపొందిన జోకర్ లో జాక్వీన్ ఫీనిక్స్ నటన అసాధారణంగా ఉంటుంది.. ఈ పాత్ర కోసం జాక్వీన్ ఫీనిక్స్ బరువు తగ్గి మరీ నటించాడు. తనకే సాధ్యమైన నవ్వు, హావభావాలతో ప్రపంచవ్యాప్తంగా కనక వర్షం కురిపించాడు. జోకర్ పాత్రలో మరొకరిని ఉహించుకోలేంతగా జీవించిన, హీత్ లెడ్జర్ ని కూడా మరిపించేలా నటించిన జాక్వీన్ ఫీనిక్స్ కి కూడా ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డు లభించడం విశేషం..

సినిమా చరిత్రలో కొన్ని పాత్రలు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. అలాంటి పాత్రకి సరైన నటుడు దొరికితే సినిమా చరిత్రలో మైలురాయిగా ఆ పాత్ర నిలిచిపోతుంది.. అలాంటి పాత్రే జోకర్ .. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. మనుషుల్లో ఉన్న స్వార్ధాన్ని ప్రశ్నించేలా,తన మాటలతో అంతర్లీనంగా ఫిలాసఫీని ప్రేక్షకులకి తెలియజెప్పేలా, ఎలాంటి బలం,శక్తులు లేకున్నా ఎంతటి వాడినైనా ఎదిరించే తత్త్వం ఉన్న పాత్ర కనుకే జోకర్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. ఏ సినిమాలో అయినా హీరోకి అభిమానులు ఉండటం సహజం.. అలాంటిది కథలో సూపర్ హీరో ఉన్నా కూడా హీరో కంటే ఎక్కువ మంది అభిమానులను విలన్ పాత్ర సంపాదించుకుందంటే ఆ పాత్రకి ఉన్న విశిష్టతని అర్థం చేసుకోవచ్చు..

అందుకే ప్రతినాయకుడిగా కనిపించినా, నాయకుడిగా కనిపించినా సరే ఆ పాత్రకి అవార్డులు రివార్డులు దక్కాయి.. పాత్ర పోషించిన నటులకు మంచి గుర్తింపును తీసుకొచ్చిన జోకర్ క్యారెక్టర్ భవిష్యత్తులో మరెన్ని సంచలనాలకు దారి తీస్తుందో వేచిచూడాలి.idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp