ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ రిపోర్ట్

By iDream Post Jun. 19, 2021, 11:15 am IST
ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ రిపోర్ట్
నిన్నంతా జగమే తంత్రం ఓటిటి రిలీజ్ హడావిడిలో పడి సోషల్ మీడియా ఊగిపోయింది కానీ తెలుగులోనూ ఓ వెబ్ సిరీస్ విడుదలైన సంగతి అధిక శాతం ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. ధనుష్ సినిమా అనే కారణంగా మీడియా సైతం దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే స్ట్రీమింగ్ మొదలైన మూడు గంటల్లోపే డిజాస్టర్ టాక్ రావడంతో ఇతర ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా అని చూసిన వాళ్ళకు ఆహాలో వచ్చిన ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ కనిపించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో పోసాని, నందిని రాయ్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ ని బాషా-మాస్టర్ చిత్రాల దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించడం విశేషం. దీని రిపోర్ట్ ఏంటో చూద్దాం

కార్ డ్రైవర్ గా పని చేసే ఆది(ప్రియదర్శి) ఓ రిసార్ట్ పెట్టుకుని సెటిలవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోవైపు చీప్ బడ్జెట్ లో సినిమాలు తీసే అయ్యప్ప(పోసాని)కు అతని భార్య మీనా(నందిని రాయ్)కు వయసులో వ్యత్యాసం ఉంటుంది. ఓ మూడో వ్యక్తి దాచమని ఇచ్చిన అయిదు కోట్ల హవాలా డబ్బు అయ్యప్ప వద్ద రహస్యంగా ఉంటుంది. మరోపక్క మీనాకు థామస్ అనే కుర్రాడితో సంబంధం మొదలవుతుంది. ఇది తెలిసిన అయ్యప్ప వాళ్ళను చంపే క్రమంలో తనే బలవుతాడు. మధ్యలో ఆది ఇరుక్కుంటాడు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు ఆట. హత్య ఎవరు చేశారు, ఆ సొమ్ము ఏమ్మయ్యింది అనేదే అసలు కథ

ఇలాంటి సబ్జెక్టులతో గతంలో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయినా దర్శకుడు విద్యాసాగర్ ముత్తుకుమార్ తన టేకింగ్ మీద నమ్మకంతో సాహసం చేశాడు. మొదటి రెండు ఎపిసోడ్లు పర్వాలేదు అనిపించేలా సాగినప్పటికీ ఆ తర్వాత ఓపికకు అసలు పరీక్ష మొదలవుతుంది. అడుగడుగునా బూతులతో నింపేశారు. ఇవి ఉంటేనే వెబ్ సిరీస్ లకు ఆదరణ దక్కుతుందనే భ్రమలో నుంచి మన డైరెక్టర్లు బయటికి వస్తే మంచిది. మూడో ఎపిసోడ్ నుంచి సాగతీత ఎక్కువయ్యింది. ఎక్కడా గ్రిప్పింగ్ గా అనిపించదు. ట్రైలర్ చూసి ఎన్నో అంచనాలు రేపిన ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ ఫైనల్ గా నిరాశనే మిగిల్చింది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp