వకీల్ సాబ్ వస్తే చాలా చిక్కులు

By iDream Post Oct. 29, 2020, 03:18 pm IST
వకీల్ సాబ్ వస్తే చాలా చిక్కులు

తన 25వ సినిమా అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ళకు పైగా గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ లాక్ డౌన్ కు ముందు బ్రేక్ పడిన షూటింగ్ ని వచ్చే నెల మొదటి వారం నుంచి కొనసాగించబోతోంది. మూడు వారాల్లోపే మొత్తం పూర్తి చేసేలా దర్శకుడు వేణు శ్రీరామ్ పక్కా ప్లానింగ్ తో అంతా సిద్ధం చేసినట్టు సమాచారం. దసరాకు టీజర్ విడుదల చేస్తారేమో అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ కలిగినప్పటికీ దీపావళికి చేయొచ్చని తెలిసింది . శృతి హాసన్ పాల్గొనాల్సిన షెడ్యూల్ కూడా ఇందులోనే పూర్తి చేయాల్సి ఉంది. దీంతో పాటు ఇంకొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి.

నిర్మాత దిల్ రాజు 2021 సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన గట్టిగానే చేస్తున్నారట. అప్పటికంతా థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తూ ఉంటాయనే నమ్మకంతో దానికి అనుగుణంగానే ప్రణాళికలు వేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే వకీల్ సాబ్ పండగను టార్గెట్ చేసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే అరణ్య, క్రాక్, రెడ్, రంగ్ దే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డేట్ చెప్పకపోయినా సంక్రాంతి విడుదల అని తమ ప్రమోషన్ లో చెప్పేసుకున్నాయి. తేదీలు మాత్రమే ఖరారు చేయలేదు. ఈ ఐదు సినిమాలకే థియేటర్లు దాదాపు లాక్ అయిపోతాయి. ఒకవేళ అప్పటికీ యాభై శాతం ఆక్యుపెన్సీనే ఉంటే రెండు మూడు డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదు.

అలా కాకుండా వీటి మధ్యలో వకీల్ సాబ్ వస్తే స్క్రీన్లు సరిపోక డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలే జనం ఇంతకుముందులా హౌస్ ఫుల్ చేసే స్థాయిలో వస్తారో రారో అనే అనుమానాలు ఇంకా ట్రేడ్ లో వ్యక్తమవుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఇన్నేసి సినిమాలు పోటీకి దింపితే ఖచ్చితంగా ఒకదాని మీద మరొక సినిమా ప్రభావం పడి కలెక్షన్లను పంచుకోవాల్సి ఉంటుంది. అసలే కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో భయాందోళనలు ఇంకా తొలగిపోలేదు. కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు అనుకుని వకీల్ సాబ్ తో అందరూ పోటీకి సై అంటే పరిస్థితిని ఇప్పుడే ఊహించడం కష్టం. అసలింతకీ డిసెంబర్ లోగా పవన్ సినిమా రెడీ అవుతుందా అనేదాన్ని బట్టే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp