సినిమా క‌థ రాయ‌డ‌మెలా? - 9

By G.R Maharshi Feb. 10, 2021, 10:35 am IST
సినిమా క‌థ రాయ‌డ‌మెలా? - 9

జీవితం విప‌రీత‌మైన గంద‌ర‌గోళంగా, తిక‌మ‌క‌గా వున్న‌పుడు సినిమా గంద‌ర‌గోళంగా వుంటే ఏంటి అంటాడు డేవిడ్ లించ్‌. స‌ర్రియ‌లిస్ట్ సినిమాలు తీసినందుకు 2019లో ఆస్కార్ గౌర‌వం అందుకున్నాడు. మ‌న వాళ్లు మంచోళ్లు. తిక‌మ‌క లేకుండా అర‌టి పండు వ‌లిచి తినిపిస్తారు. బుర్ర‌కి వాళ్లూ ప‌ని పెట్ట‌రు, మ‌న‌ల్ని పెట్ట‌నివ్వ‌రు. Text పుస్త‌కాల‌కి గైడ్ ఉన్న‌ట్టు క్రిస్ట‌ఫ‌ర్ నోల‌న్ సినిమాల‌కి ఎవ‌డో ఒక‌డు అర్థం చెబితే త‌ప్ప ఎక్క‌వు. అర్థ‌మైన త‌ర్వాత ఆ కిక్కు వేరే.

క‌థ కూడా యంత్రం లాంటిదే. అనేక విడిభాగాల్ని క‌లుపుకోవాలి. Plot ఇంజ‌న్ లాంటిది. ఒక బైక్‌ని ర‌చ‌యిత అసెంబుల్ చేశాడ‌నుకుంటే , దాన్ని న‌డుపుతూ గ‌మ్యం చేర్చే బాధ్య‌త డైరెక్ట‌ర్‌ది. ర‌చ‌యిత‌, డైరెక్ట‌ర్ ఒక‌రే అయితే సొంతంగా బైక్ రెడీ చేసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ల‌డ‌మే. ఈ ప్ర‌యాణంలో ఎంతో మంది చేతులు క‌లిపితే ఫైన‌ల్ రిజ‌ల్ట్ వ‌స్తుంది. షోలేలో ఒక డైలాగ్ ఉంది. "చెల్ల‌ని నాణెం , రెండు వైపులా చెల్ల‌దు" అని జైల‌ర్ అంటే

"నాణేనికి , మ‌నిషికి చాలా తేడా వుంది" అని ఠాకూర్ అంటాడు.
క‌థ‌కి, యంత్రానికి ఇదే తేడా, యంత్రానికి ఎమోష‌న్స్ వుండ‌వు.
టెక్నిక‌ల్‌గా చెప్పాలంటే కొన్ని రూల్స్ వుంటాయి. 1) ప్లాట్ 2) స‌బ్‌ప్లాట్ 3) క‌థా గ‌మ‌నం 4) హీరో క్యారెక్ట‌ర్ 5) విల‌న్‌తో సంఘ‌ర్ష‌ణ 6) హీరోకి క‌ష్టాలు 7) హీరో గెల‌వ‌డం. ఇలా స్థూలంగా విడ‌దీసుకోవ‌చ్చు. రూల్స్ ఉన్న‌ది బ్రేక్ చేయ‌డానికే. చ‌ట్టం త‌న ప‌ని చేసుకుపోతుంది అని మ‌న నాయ‌కులు అంటూ వుంటారు. అస‌లు చ‌ట్టాన్ని ప‌ని చేయ‌కుండా చేసేది వాళ్లే. క‌థ‌కి కొన్ని రూల్స్ వుండాల‌ని అనుకోవ‌డం త‌ప్పు కాదు. వాటిని ప‌ట్టించుకోకుండా వుండ‌డం కూడా త‌ప్పు కాదు. అది మ‌న హ‌క్కు.

ప్ర‌పంచంలోని అన్ని క‌థ‌ల్లోని ప్ర‌ధాన ల‌క్ష‌ణం ఏమంటే హీరో క‌ష్టాలు ప‌డ‌తాడు. చివ‌ర్లో సుఖ ప‌డ‌తాడు. అత‌న్ని క‌ష్ట‌పెట్టేది దేవుడు లేదా విధి, లేదా విల‌న్‌. పాత సినిమాల్లో శివుడు కైలాసంలో చ‌ల్ల‌గా కూచోకుండా భ‌క్తుల‌కి ప‌రీక్ష‌లు పెట్టేవాడు. చివ‌ర్లో ఫ‌స్ట్ క్లాస్‌లో పాస్ చేస్తాడు. స‌త్య‌హ‌రిశ్చంద్రుడు స‌త్య‌మే చెబుతూ వుంటే విశ్వామిత్రుడికి చిర్రెత్తుకొచ్చింది (పాల‌న అంటేనే అబ‌ద్ధాలు. మ‌రి హ‌రిశ్చంద్రుడు ఎలా పాలించాడో?). అష్ట‌క‌ష్టాల‌పాలు చేశాడు. ప్రేక్ష‌కులు కాసేపు ఏడ్చి చివ‌రికి హ‌రిశ్చంద్రుడు కిరీటం పెట్టుకోగానే ఇగో శాంతించి సుఖ‌శాంతుల‌తో బ‌య‌టికి వ‌చ్చేవాళ్లు. దేవదాసులో విల‌న్ లేడు. Fate Is Villan. టైటానిక్‌లో విధితో పాటు విల‌న్ కూడా వుంటాడు.

హీరోహీరోయిన్లు చివ‌రికి పెళ్లి చేసుకుంటే ఆ సినిమా ఆడేది కాదేమో!

విల‌న్లు ఉన్న సినిమాలు 100కి 99. ఇపుడైతే హీరోలు విల‌న్ల‌ని చంపేస్తున్నారు కానీ, ఒక‌ప్పుడు హీరోలు అహింసావాదులు. అప్ప‌టి వ‌ర‌కు ఫ్రేమ్ బ‌య‌ట వున్న పోలీసులు సీన్లోకి వ‌చ్చి You are under arrest అనేవాళ్లు. ఆ మాట అన‌గానే విల‌న్ ప‌ని అయిపోయింద‌ని చిన్న‌ప్పుడు అమాయ‌కంగా అనుకునేవాళ్లు. లాయ‌ర్లు వుంటార‌ని తెలియ‌దు.

విల‌న్ కూడా అప్ప‌టి వ‌ర‌కు చేయాల్సిన చండాలం ప‌నుల‌న్నీ చేసి "నాకీ శిక్ష ప‌డాల్సిందే"న‌ని పోలీస్ వ్యాన్ ఎక్కుతాడు. ఇపుడు అంత టైం ఇవ్వ‌డు హీరో. అరెస్ట్ చేయిస్తే మ‌ళ్లీ బెయిల్ మీద వ‌స్తాడ‌నే భ‌యంతో క‌త్తితోనో, గొడ్డ‌లితోనో మోదేస్తాడు.

క‌థ‌కి టైం సెన్స్ ముఖ్యం. ఉమ్మ‌డి కుటుంబాల మీద క‌థ రాస్తే ఎవ‌డూ తీయ‌డు. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కి అది తెలియ‌నే తెలియ‌దు. త‌ల్లితండ్రుల్ని వ‌దిలేసి విదేశాల్లో ఉన్న పిల్ల‌ల క‌థ క‌రెంట్ స‌బ్జెక్ట్. శ‌త‌మానంభ‌వ‌తీ, ప్ర‌తిరోజూ పండ‌గే స‌క్సెస్‌కి కార‌ణం ఎక్కువ మంది ఐడెంటిఫై కావ‌డ‌మే.

పుస్త‌కాల్లో కంటే సినిమాల్లోనే ఎక్కువ చ‌రిత్ర రికార్డు అవుతుంది. సామాజిక ప‌రిస్థితులు, ఆర్థికం, రాజ‌కీయం అన్నీ క‌నిపిస్తాయి. మ‌న కుటుంబ సినిమాల్లోని ఇతివృత్తాల‌ని గ‌మ‌నిస్తే

గుండ‌మ్మ‌క‌థ (1962 ) ---గ‌య్యాళిగా ఉన్న గుండ‌మ్మ‌కి బుద్ధి చెప్ప‌డం, అహంకారి స‌రోజ (జ‌మున‌)ని మార్చ‌డం. ఆడ‌వాళ్లు అణిగిమ‌ణిగి ఉండాల‌నే కాలం. భ‌ర్త కాళ్ల‌కి ఫ‌స్ట్ నైట్ దండం పెట్టి పాట పాడే రోజులు.

కోడ‌లు దిద్దిన కాపురం (1970) ---- భ‌ర్త తిరుగుబోతు, తాగుబోతు అయినా అత‌న్ని మార్చి , దారికి తెచ్చుకోవాలి. అంతేకానీ త‌న్ని విడాకులు ఇవ్వ‌కూడ‌దు. డైవ‌ర్స్ అనే ప‌ద‌మే సినిమాలోకి ఎంట‌ర్ కాని కాలం.

పండంటి కాపురం (1972) ---- అన్న‌ద‌మ్ములు క‌లిసి ఉంటే సంతోషం. ఒక కొత్త కోడ‌లు వ‌చ్చి అంద‌ర్నీ విడ‌గొడుతుంది. అప్పుడు తెలియ‌క తిట్టుకున్నా కానీ బి.స‌రోజాదేవి క‌రెక్ట్‌. అంద‌రూ ఆ చిన్న ఇంట్లో ఇరుక్కుని వుండ‌డం ఎందుకు? విడిగా వుండ‌డం హాయి క‌దా అంటుంది. పైగా ఉమ్మ‌డి కుటుంబమంతా గుమ్మ‌డి మీదే న‌డుస్తుంది.

ఆయ‌న‌కి జ‌మునతో ఒక ఉప‌క‌థ (స‌బ్ ప్లాట్‌), ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద హిట్. రోజూ తిట్టుకుంటూ క‌లిసి వుండ‌డం కంటే విడిపోయి ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకోవ‌డ‌మే స‌రైంద‌ని అప్ప‌ట్లో తెలియ‌దు. ఎమోష‌న్స్ మీద కొట్ట‌డం సినిమా ల‌క్ష‌ణం. ప్ర‌తిరోజూ పండ‌గే సినిమా గురించి అమెరికాలో ఉన్న ఒక అమ్మాయి ఏమందంటే "ప‌దేప‌దే ఇండియాకి వ‌స్తే మా ఉద్యోగాలు పోతాయి. మ‌ళ్లీ సంపాదించాలంటే మా చావు మేము చావాలి".

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp