సినిమా క‌థ రాయ‌డ‌మెలా? - 7

By G.R Maharshi Feb. 08, 2021, 10:32 am IST
సినిమా క‌థ రాయ‌డ‌మెలా? - 7

వ‌స్తువు అవ‌స‌రం దాని ఉప‌యోగ‌పు విలువ‌ని నిర్ణ‌యిస్తుంది. అది భౌతికం కావ‌చ్చు, మాన‌సికం కావ‌చ్చు. సినిమా నీ ఆక‌లిని తీర్చ‌దు. మేథో ఆక‌లిని తీరుస్తుంది. ఇంట్లో బియ్యం లేక‌పోతే సినిమా చూడ‌వు. ఆ డ‌బ్బుల‌తో బియ్యం కొంటావు. ప‌స్తులుండి కూడా సినిమా చూసే వాళ్లుంటారు. కానీ త‌క్కువ‌.

రైతు బియ్యాన్ని పండిస్తాడు. దాన్ని లాభానికో న‌ష్టానికో అమ్ముకుంటాడు. లేదా తానే తింటాడు. ర‌చ‌యిత క‌థ త‌యారు చేస్తాడు. 6 నెల‌లు నిద్రాహారాలు మాని చేశాను. నెల‌కో ల‌క్ష చొప్పున 6 ల‌క్ష‌లు ఇమ్మంటే ఎవ‌డూ ఇవ్వ‌డు. 600 కూడా ఇవ్వ‌రు. ఆ బౌండ్ పుస్త‌కాన్ని పాత కాగితాల వాడికిస్తే 10 రూపాయ‌లు ఇవ్వొచ్చు. చ‌లి కాల‌మైతే 5 నిముషాలు చ‌లి కాచుకోవ‌చ్చు. స్ప‌ష్టంగా చెప్పాలంటే ఆ ర‌చ‌న‌కి ప్రాథ‌మిక ద‌శ‌లో ఏ విలువా లేదు.

పురాత‌న ఖ‌డ్గాన్ని కొలిమి వాడికి చూపిస్తే దాన్ని ఇనుప వ‌స్తువుగా భావించి రూ.50 ఇస్తాడు. అదే మ్యూజియం వాడికి ఇస్తే ల‌క్ష రూపాయ‌లు ఇవ్వొచ్చు. వ‌స్తువు ఒక‌టే, చూసే దృష్టి మారింది.

సినిమా క‌థ‌ని కూడా ఎవ‌రో ఒక‌రు గుర్తు ప‌ట్టాలి. రైతు త‌న బియ్యాన్ని తిన‌గ‌ల‌డు. ర‌చ‌యిత త‌న క‌థ‌తో సినిమా తీసుకోలేడు. ఒక్కోసారి ఉంటారు కూడా! 4 ఏళ్ల క్రితం సంచ‌ల‌నం సృష్టించిన ఒక సినిమాని ఇలాగే తీశారు. ఆ యువ ద‌ర్శ‌కుడు చాలా మందికి ఆ క‌థ‌ని వినిపించాడు. ఎవ‌రికీ ఎక్క‌లేదు. చివ‌రగా ప్ర‌ముఖ నిర్మాత‌కు చెప్పాడు.

క‌థ వింటూ వింటూ ఆయ‌న నిద్ర‌పోయాడు. గుర‌క వినిపించే స‌రికి షాక్ అయిన ద‌ర్శ‌కుడు లేచి వ‌చ్చేశాడు. ప‌ట్టుద‌ల‌తో ఆస్తులు అమ్మి డ‌బ్బులు పోగు చేసి విజ‌యం సాధించాడు. అయితే ఇది అరుదు.

ర‌చ‌యిత‌లంటే నిర్మాత‌ల‌కి ఎందుకు లోకువ అంటే వాళ్ల‌లో చాలా మందికి పురాత‌న ఖ‌డ్గానికి, ఇనుప వ‌స్తువుకి తేడా తెలియ‌దు. తెలిసిన వాళ్లు త‌క్కువ మంది ఉంటారు. అయితే వాళ్ల ద‌గ్గ‌రికి ఎక్కువ‌గా ఇనుప వ‌స్తువులు వ‌స్తూ ఉంటాయి.

స‌క్సెస్ రేటు ఒక శాతం కూడా లేక‌పోయినా తెలుగు ఇండ‌స్ట్రీకి ర‌చ‌యిత‌లు వ‌స్తూనే ఉంటారు. ప్ర‌తిరోజూ క‌నీసం ఇద్ద‌రైనా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కావాల‌ని రైలు దిగుతారు. వీళ్ల‌లో 100కి 80 మందికి పుస్త‌కాలు చ‌దివే అల‌వాటు ఉండ‌దు. చ‌లం ఎవ‌రంటే న‌టి శారద భ‌ర్త అంటారు. తిల‌క్‌, బుచ్చిబాబుల పేర్లు కూడా విని ఉండ‌రు. ఇంగ్లీష్‌, తెలుగు సినిమాలు విప‌రీతంగా చూసి వాటిని గ్రైండ‌ర్‌లో ఆడించి చెట్నీ బాటిల్స్‌తో తిరుగుతూ ఉంటారు.

ఒక ర‌చ‌యిత ఇప్ప‌టికి 4 సినిమాల‌కి డైలాగ్‌లు రాశాడు. ఆయ‌న‌కు పుస్త‌కాలు చ‌దివే అలవాటే లేదు. టైం లేదంటూ ఉంటాడు. ఎన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసినా ప‌ని చేయాల్సింది తెలుగు సినిమాల‌కే క‌దా! తెలుగే రాకుండా బండి లాగించేస్తాడు. పాత కాలం డైలాగ్‌లు ఇప్పుడు అవ‌స‌రం లేదు. ట్రెండీగా ఉండాలి అంటే బ్రో, బ‌డ్డీ, వాట్స‌ప్ ఇలా కొన్ని బూతుల‌తో క‌లిసి ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుకోవాల‌ని కొంద‌రు సూచిస్తూ ఉంటారు.

త‌మాషా ఏమంటే గ‌త 20 ఏళ్లుగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ నెంబ‌ర్ 1 రైట‌ర్‌. ఆయ‌న డైలాగ్‌లు అచ్చ తెలుగులో ప్రాస‌లు, పంచ్‌ల‌తో ఉంటాయి. బ్రో , బ‌డ్డీలు ఇంగ్లీష్ వాడింది చాలా త‌క్కువ‌.

నేనే శూన్యాన్ని, నేనే స‌మ‌స్తాన్ని అంటాడు శ్రీ‌కృష్ణుడు. సినిమా క‌థ కూడా ఇలాంటిదే. హీరో డేట్స్ దొరికాయ‌ని ఏదో ఒక‌టి లాగిస్తే అది శూన్యం. క‌థ‌నే న‌మ్ముకుంటే అది స‌మ‌స్తం.

సినిమా అంటే ఏక కాలంలో కొన్ని వంద‌ల మంది క‌నే క‌ల‌. సినిమా తీయాలంటే కూడా కొన్ని వంద‌ల మంది అవ‌స‌ర‌మ‌వుతారు. ఇది స‌మ‌ష్టి కృషి. విడుద‌ల త‌ర్వాత కొంద‌రికే డ‌బ్బులు, పేరు రావ‌చ్చు.

ప‌త్తి పండించే రైతు లాంటి వాడు ర‌చ‌యిత‌. ప‌త్తి పండిన త‌ర్వాత అది మిల్లు చేరి వ‌స్త్రంగా మారుతుంది. అది చొక్కా, ప్యాంటు, కోటుగా రూపాంత‌రం చెందుతుంది. చొక్కా కొంటున్న‌ప్పుడు మ‌నం బ్రాండ్‌ని చూస్తాం. రైతు అన‌వ‌స‌రం.

క‌థ త‌యారు చేసిన త‌ర్వాత అది అనేక మందితో రూపు దిద్దుకుని సినిమాగా మారుతుంది. ప్రేక్ష‌కుడు న‌టుల్నే గుర్తు ప‌డ‌తాడు.

క‌థ‌కి ఏం కావాలో , దాన్ని ఎన్ని ర‌కాలుగా చెప్పుకోవ‌చ్చో రేపు చూద్దాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp