టికెట్ రేట్లతో షాక్ తప్పదా

By iDream Post Apr. 05, 2020, 11:19 am IST
టికెట్ రేట్లతో షాక్ తప్పదా

కరోనా తాకిడి ఎప్పుడు తగ్గుతుందో తెలియదు కానీ సినిమా రంగం మీదే ఆధారపడి మనుగడ సాగిస్తున్న థియేటర్లు, మల్టీ ప్లెక్సులు మాత్రం రీ ఓపెనింగ్ కోసం రోజులు లెక్కబెట్టుకుంటున్నాయి. ఏప్రిల్ 15 నుంచి దశలవారి లాక్ డౌన్ ఎత్తేస్తారు అనే ప్రచారం ఉంది కాని అందులో వీటికి స్థానం ఉందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒకవేళ మే నుంచి తెరిచే పక్షంలో జనం ఒకేసారిగా సినిమా హాళ్ళకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఓ కొత్త స్ట్రాటజీతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

దాని ప్రకారం ముందు చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ చేస్తారు. సీట్లకు మధ్య గ్యాప్ ఇచ్చి టికెట్లు అమ్మే పద్ధతి గురించి గతంలోనే ఐడ్రీం మీ దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలా వర్క్ అవుట్ కాదు కాబట్టి కొంత కాలం యాభై శాతం దాకా ధరలు పెంచి పరిస్థితి పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చాక మళ్ళి పాత రేట్లు కొనసాగిస్తారన్న మాట. అయితే ఇది అంత సులభం కాదు. ప్రభుత్వ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది.

దీని ప్రకారం ఒక ప్రేక్షకుడు రెండు టికెట్ల ఖర్చుని భరించాలన్న మాట. ఒకవేళ నాని వి లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజైతే పండగ టైంలో వెసులుబాటు తెచ్చుకున్నట్టు ఒక వారం లేదా పది రోజులు అధిక ధరలకు పర్మిషన్ తెచ్చుకునే విధంగా ప్రతిపాదనలు ఉన్నాయట. వీటికి కారణం లేకపోలేదు. నెల రోజులకు పైగా ధియేటర్లు మూతబడటం వల్ల తీవ్రమైన నష్టాలు ఉన్నాయి. కనీస నిర్వహణ ఖర్చులు కూడా లేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

కొన్నిచోట్ల ఉద్యోగాలు తీసేయల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇంకొందరు సింగల్ స్క్రీన్ ఓనర్లు వాటిని మూసేసి షాపింగ్ కాంప్లెక్సులుగానో లేదా ఫంక్షన్ హాళ్ళు గానో మార్చే ఆలోచనలో ఉన్నారట. చూస్తుంటే ఊహించిన దాని కన్నా పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేలా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే జనం పూర్తి స్థాయిలో థియేటర్లకు రావడానికి ఎంత లేదన్నా రెండు నెలల సమయం పడుతుందని విశ్లేషకుల అంచనా. ఇది తగ్గితే అందరికీ మంచిదే. అదే కోరుకుందాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp