గొల్లపూడి నట విశ్వరూపం - సంసారం ఒక చదరంగం

By Guest Writer Dec. 14, 2019, 12:08 pm IST
గొల్లపూడి నట విశ్వరూపం - సంసారం ఒక చదరంగం

అయన పేరు అప్పల నర్సయ్య. పేరుకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. కానీ చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఒక సాధారణ గుమస్తా. నలుగురు పిల్లల బాధ్యతలు నెరవేరుస్తూనే వయసుకొచ్చిన వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బరువును కూడా మోస్తూ సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. పిల్లల కోసం త్యాగం చేసిన చిన్న చిన్న ఆనందాలను సైతం వాళ్లకు తెలియకుండా గుట్టును కాపాడుకునే గొప్ప వ్యక్తిత్వం. నెలాఖరు వస్తే ఖర్చుల తంతు. జేబులో పైకం ఉన్న రోజు అంతకు రెట్టింపు ఉన్న బాధ్యతల మోత. ఇది సగటు ప్రతి మధ్యతరగతి వాడి కథే. అప్పుడు ఇప్పుడు ఇకపై ఎప్పుడూ ఇందులో ఎలాంటి మార్పు ఉండదు మనిషి పేరులో తప్ప. అందుకే 32 ఏళ్ళ క్రితం వచ్చిన ఓ సినిమా గురించి ఇప్పుడు చర్చించాల్సిన ఆవశ్యకత కనిపించింది.

ఇప్పుడీ ప్రస్తావన తేవడానికి కారణం స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు గారి నిర్యాణం. ఎందరో సాహితి ప్రియుల, సినిమా అభిమానుల గుండెలను శోకంలో ముంచెత్తుతూ ఆయన ఈ లోకం వదిలి వెళ్లిపోయారు. రచయితగా చేసిన కళాసేవ కన్నా ఆయన నటించిన సినిమాల ద్వారానే వినోదాన్ని వెతుక్కునే మాములు మనుషులుకు గొల్లపూడి గారు ఎక్కువ పరిచయం. అందుకే అప్పల నర్సయ్యగా ఎప్పటికీ మర్చిపోలేని అసామాన్యమైన నటనా వైదుష్యాన్ని చూపించిన సంసారం ఒక చదరంగం సినిమాని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.
అది 1987 సంవత్సరం. టాలీవుడ్ వద్ద మాస్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. చిరంజీవి బాలకృష్ణ లాంటి హీరోలు తారాపథం వైపు దూసుకుపోతూ మసాలా కంటెంట్ తో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యామిలి ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకుని స్టార్ గా ఎదిగిన శోభన్ బాబు లాంటి స్టార్ల వేగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆ సమయంలో హోరు తుఫానుని ఆపేసి కురిసిన మంచు వర్షంలా వచ్చిన చిత్రమే సంసారం ఒక చదరంగం. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎవిఎం ఒరిజినల్ వెర్షన్ ను తమిళ దర్శకుడు విస్సు తెరకెక్కించగా, తెలుగులో మాత్రం ముత్తురామన్ దర్శకత్వం వహించారు. విపరీతమైన పోటీగా భావించే సంక్రాంతి సీజన్ లో పెద్ద హీరోల సినిమాలను లెక్క చేయకుండా బరిలో దిగిన ఈ సినిమా జనవరి 14న భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైంది.

ఏంటి ఇందులో ప్రత్యేకత?

సంసారం ఒక చదరంగంలో హీరో ఉండడు. ఖచ్చితంగా చెప్పాలంటే వయసు మళ్ళిన అప్పల నర్సయ్య పాత్రే కథానాయకుడు. మిగిలినవన్నీ సపోర్టింగ్ రోల్సే.
తెరమీద కాసులు చల్లే రేంజ్ లో ఐటెం సాంగ్స్ కానీ డాన్సులతో యువతను వెర్రెక్కించే రాక్ మ్యూజిక్ పాటలు కానీ మచ్చుకు కూడా లేవు.
భీకరమైన విలనీతో సవాలు చేసే ప్రతినాయకుడు కానీ రౌద్రమైన రూపాలతో పోరాటాలు చేసే రౌడీలు కానీ ఎవరు ఉండరు.
కంటతడి పెట్టించే అంజలీదేవి రేంజ్ సెంటిమెంటూ ఉండదు.

మరేముంది అనేగా మీ ప్రశ్న?

ఇందులో సహజత్వం ఉంది. నిజ జీవితంలో మన ఇళ్లలో పక్కింటి వసరాలలో నిత్యం మనకు ఎదురయ్యే మనుషులు ఉన్నారు. రోజూ మనం పడే ఈతిబాధలు, కష్టాలు, కన్నీళ్లు, సంతోషాలు, ఆనందాలు అన్ని ఉన్నాయి. అందుకే సంసారం ఒక చదరంగంకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి కలెక్షన్ల వర్షం కురిపించారు. మన కథను ఇంత గొప్పగా ఎలా చూపించారా అంటూ థియేటర్లో ఎన్నో కుటుంబాలు ఆనందంతో చూసి పరవశించిపోయాయి. ఇంత ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించింది అప్పల నర్సయ్య ఉరఫ్ గొల్లపూడి మారుతీరావు గారు.

నిజానికి ఈ పాత్ర చిన్నదే అయితే ఏ మిడిల్ రేంజ్ యాక్టర్ తో చేయించినా సరిపోయేది. కానీ ఇదలా కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఛాలెంజ్ లాంటిది. సంసారం ఒక చదరంగం సినిమా విడుదలయ్యాక చాలా మంది మధ్య తరగతి తండ్రులు అప్పల నర్సయ్యలో తమను తమ కుటుంబాలను చూసుకోవడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి గారు అంత గొప్పగా పండించారు.
పొగరుతో అతిశయోక్తులతో మిడిసిపడే కూతురు, బేరమాడినట్టు నెల మొదట్లోనే ఖర్చులకు కేవలం 800 రూపాయలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్న పెద్ద కొడుకు, చిన్న జీతంతో జీవితం ఎటు వెళ్తుందో అర్థం కానీ రెండో కొడుకు, ఎస్ఎస్ఎల్సి పాస్ కాలేక దారి తప్పుతున్న చిన్న కొడుకు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నా నిబ్బరం కోల్పోకుండా అన్నింటికీ ఎదురు నిలవాలని చూసే పాత్రలో గొల్లపూడి గారి నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆఖరికి ఇవన్నీ భరించలేక మందు తాగే సీన్ లో సైతం ఆయన జీవించిన తీరు అజరామరం.
గొల్లపూడి గారి గురించి మాట్లాడేందుకు ఈ ఒక్క సినిమానే తీసుకునేందుకు పైన చెప్పినవి ముఖ్యమైన కారణాలు అనుకుంటే అన్ని వివరించాలంటే ఓ పుస్తకమంత అవుతుందంటే ఆయన గురించి తెలిసినవారు ఎవరు ఆశ్చర్యపోరు. ఇవే కాదు ఛాలెంజ్, ప్రేమ, అభిలాష, ఆలయ శిఖరం, స్వాతి, ఆదిత్య 369 మొదలుకుని లీడర్ దాకా ఆయన పోషించిన వాటిలో దాదాపు అన్ని విశిష్టత కలిగిన పాత్రలే. కానీ అప్పల నర్సయ్య మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ప్రేమ, జాలి, ఓర్పు, సహనం, కోపం, నిబ్బరం ఇవన్నీ కలగలిసిన ఓ మాములు మనిషి అతను కాబట్టి. అందులో గొల్లపూడి వారు పరకాయ ప్రవేశం చేశారు కాబట్టి.

అందరికి తెలిసిన విషయమే మారుతీరావు గారి ఆత్మకథ పేరు "అమ్మ కడుపు చల్లగా"
కానీ ప్రతి సినిమా ప్రేమికుడికి మదిలో మాత్రం "గొల్లపూడి జ్ఞాపకాలు నూరేళ్లుగా"

Written By ---రవీంద్రనాథ్ శ్రీరాజ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp