ఛలో ఓటిటి - ఇంకా ఆలోచనేంటి

By iDream Post Jun. 29, 2020, 11:44 am IST
ఛలో ఓటిటి - ఇంకా ఆలోచనేంటి

థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదని తెలుసుకున్న కోలీవుడ్ నిర్మాతలు ఓటిటి విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలుగు ప్రొడ్యూసర్లు ఈ విషయంగా సైలెంట్ గా ఉన్నప్పటికీ పక్క రాష్ట్రాల సినిమాలు మాత్రం డిజిటల్ దారులు పడుతున్నాయి. బాగుందా లేదా అనే టాక్ తో సంబంధం లేకుండా అందరూ చూసే అవకాశం ఉండటంతో వీటికి స్పందన బాగానే ఉంటోంది. ఇటీవలే ప్రైమ్ ద్వారా రిలీజైన 'పెంగ్విన్' కేవలం మూడు రోజుల్లో పెట్టుబడిని వెనక్కు ఇచ్చిందని మీడియా టాక్. డిజాస్టర్ రివ్యూలు, మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా సరే అమెజాన్ లో మెంబెర్ షిప్ ఉన్న ప్రతి ఒక్కరు పెంగ్విన్ ని చూశారు. ఒకవేళ ఇదే హాల్స్ లో విడుదలై ఉంటే దారుణంగా వచ్చేది ఫలితం.

దీనికన్నా ముందు వచ్చిన జ్యోతిక 'పొన్మగళ్ వందాళ్' సైతం భారీ స్పందన దక్కించుకుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆరవ చిత్రాలు డీల్స్ పూర్తి చేసుకుంటున్నాయి. తాజాగా మరో రెండు చేరాయి. వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న 'డానీ' జీ5 ద్వారా ఆగస్ట్ 1న నేరుగా నట్టింట్లోకి రాబోతోంది. లేడీ పోలీస్ ఆఫీసర్ గా వరలక్ష్మి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్ ఇప్పటికే మంచి స్పందన దక్కించుకుంది. షియాజీ షిండే తదితరులు కీలక పాత్ర పోషిస్తుండగా సంతానమూర్తి దర్శకత్వం వహించారు. వైభవ్ నటించిన 'లాకప్' వచ్చే నెల ఇదే జీ5 ద్వారా రిలీజ్ కాబోతోంది. ఇవాళే డీల్ ఫైనల్ చేశారు. వెంకట్ ప్రభు, వాణి భోజన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న లాకప్ కు ఎస్జి ఛార్లెస్ దర్శకుడు. రామ్ చరణ్ ధ్రువ ఒరిజినల్ దర్శకుడు మోహన్ రాజా దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం ఉంది.

దీని మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ డానీ, లాకప్ లను తెలుగు, హిందీలో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇవి కాకుండా యోగి బాబు 'కాక్ టైల్', త్రిష కొత్త సినిమాతో పాటు విశాల్ 'చక్ర' కూడా డిజిటల్ రేస్ లో ఉందని టాక్ బలంగా ఉంది. తెలుగులో ఈ మూమెంట్ తక్కువగా ఉన్నప్పటికీ త్వరలో ఇక్కడా అదే బాట పట్టక తప్పేలా లేదు. ఇప్పటికే '47 డేస్' 'భానుమతి రామకృష్ణ' డేట్స్ ని లాక్ చేసుకున్నాయి. భారీ సినిమాలు తప్పించి మీడియం రేంజ్ మూవీస్ కి ఇంతకన్నా వేరే దారి కనిపించడం లేదు. ఒకవైపు కరోనా వైరస్ అంతకంతా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ లో పూర్తిగా కంట్రోల్ తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో థియేటర్లు తెరుస్తారన్న నమ్మకం ఎవరికీ లేదు. తెలుగులోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాల విడుదలలు ఆగిపోయాయి. మరి అరవం వాళ్ళ లాగే మనవాళ్ళూ నిర్ణయాలు తీసుకుంటారేమో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp