ఈ సినిమాలన్నీ ఒకే పాట ఒకే బాట

By iDream Post Jul. 03, 2020, 02:39 pm IST
ఈ సినిమాలన్నీ ఒకే పాట ఒకే బాట

థియేటర్లు మూతబడి నాలుగో నెలలోకి ప్రవేశించాం. ఎప్పటికి తెరుచుకుంటాయో ఎవరికీ తెలియదు. రెండు వారాల క్రితం జూలై 1 నుంచని ప్రచారం జరిగింది కాని అలాంటి సూచనలు ఈ నెలాఖరుకు కూడా లేవు. మరోవైపు బాలీవుడ్లో ఓటిటి విప్లవం ఊపందుకుంది. సుమారు 15 దాకా క్రేజీ సినిమాలు వచ్చే అక్టోబర్ లోపు నేరుగా డిజిటల్ రూపంలో రాబోతున్నాయి. డేట్లు ఇవ్వలేదు కానీ అధికారిక ప్రకటనలైతే వచ్చేశాయి. ఒకవేళ హాళ్ళు తెరుచుకున్నా ఇవి మాత్రం ఓటిటిలోనే వస్తాయి. ఒప్పందాలు జరిగిపోయాయి కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు. మరోవైపు తమిళం, మలయాళం నుంచి ఒక్కొక్కరుగా ఈ బాట పడుతున్నారు. తెలుగులో ఇప్పటిదాకా నాలుగు మాత్రమే వచ్చాయి.

అమృతరామం, పెంగ్విన్, 47 డేస్, భానుమతి & రామకృష్ణ. ఇందులో ఆఖరిది వెబ్ మూవీ. థియేటర్ కోసం తీసింది కాదు. మొదటి మూడు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇవేవి క్రేజ్ ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలు కావు. పెంగ్విన్ కూడా కీర్తి సురేష్ వల్ల ఆ మాత్రం మార్కెట్ అయ్యింది లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇప్పుడు రెడీ ఫర్ రిలీజ్ సినిమాల కౌంట్ మెల్లగా పెరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నాయి. చిన్న చిన్న వర్క్స్ బాలన్స్ ఉన్నవి కట్టుదిట్టమైన నిబంధనల మధ్య పూర్తి చేసేశారు. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న వాటిలో ముందువరసలో ఉన్నవి నాని వి, రెడ్, ఉప్పెన, నిశబ్దం, ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. వీటి ప్రమోషన్లు కూడా చేయడం లేదు.

పరిస్థితి అంచనా వేసేలా లేకపోవడంతో పబ్లిసిటీకి ఖర్చు పెట్టడం ఇష్టం లేక దిల్ రాజు అగ్ర నిర్మాతలు సైతం మౌనంగా ఉంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా సూచన లాంటిది వస్తే అప్పుడు మొదలుపెట్టాలనేది అందరి ప్లాన్. మరోవైపు ఓటిటి ఎంత భారీ ఆఫర్లు ఇస్తున్నా వీళ్ళంతా సైలెంట్ మంత్రాన్ని జపిస్తున్నారు. పెట్టుబడితో పాటు మంచి లాభం మిగిలేలా ధరను కోట్ చేస్తున్నప్పటికీ టెంప్ట్ కాకుండా నిభాళించుకుంటున్నారు. దసరాకు మొత్తం సద్దుమణిగి జనం థియేటర్లకు వస్తారని అందరి ఆశాభావం. ఇప్పటికే వడ్డీల భారం, బయ్యర్ల ఒత్తిడి బాగా పెరిగిపోయాయి. ఇంతదాకా వచ్చి ఇప్పుడు వెనకడుగు వేయడం ఎందుకని ప్రొడ్యూసర్లు వాళ్లనే ఎలాగోలా బ్రతిమాలి ఒప్పిస్తున్నారు. లిరికల్ వీడియోస్, కొత్త టీజర్లు, ప్రోమోలు పైన చెప్పిన ఏ సినిమాకు చేయడం లేదు. ఇంకొద్ది రోజులు మౌనమే నీ బాష ఓ మూగ మనసా అని పాట పాడుకోవడం తప్ప ఇప్పటికి ఏ మార్గమూ లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp