త్రివిక్రం గారు! మురళిశర్మకు ఫ్యాన్స్ లేరా?

By Satya Cine Jan. 21, 2020, 11:31 am IST
త్రివిక్రం గారు! మురళిశర్మకు ఫ్యాన్స్ లేరా?

2007లో మహేష్ బాబు "అతిథి"లో కైజర్ అనే విలన్ పాత్రతో తెలుగుతెరమీద కనిపించాడు మురళిశర్మ. అది మొదటి మెట్టు.
 
తెలుగువాడైనప్పటికీ ముంబాయిలో పుట్టి పెరగడం వల్ల ఇతనిని ఇంపోర్టెడ్ నటుడ్నే అనుకున్నారు చాలాకాలం వరకు. తర్వాత కంత్రిలో కనిపించాడు. ఆ తర్వాత నూకయ్య, గోపాల గోపాల, కృష్ణం వందే జగద్గురుం వంటి సినిమాల్లో కనిపించినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది మాత్రం "భలె భలె మగాడివోయ్". దర్శకుడు మారుతి మలచిన అద్భుతమైన క్యారెక్టర్ రోలుకి పూర్తి న్యాయం చేసి తన ఉనికి చాటుకున్నాడు మురళి శర్మ. అది రెండో మెట్టు.
 
మొత్తానికి అప్పటినుంచి మురళిశర్మ అనే నటుడిని సామాన్య ప్రేక్షకులు కూడా పేరుతో గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఇక విశ్రాంతి తీసుకోనివ్వనన్ని అవకాశాలు వస్తున్నాయి మురళిశర్మకి. బాబు బంగారం, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, దువ్వాడ జగన్నాథం, ఎవరు...ఇలా ఆల్మోస్ట్ ప్రతి సినిమాలోనూ కనిపిస్తున్నారీయన. ఇప్పుడు తాజాగా వచ్చిన సంక్రాంతి సినిమాల్లో "సరిలేరి నీకెవ్వరు", ఇంకా "అల వైకుంఠపురంలో" కనిపించారు. "అల..."లో అయితే ఏకంగా ఈయన క్యారెక్టర్ మీద ఒక పాటే పెట్టేసారు. బన్నీ డ్యాన్సేసిన ఆ పాటలో మురళిశర్మ ఇమేజుని ఒక పెద్ద గోడ మీద కూడా చూపించారు. కథ మొత్తాన్ని నడిపే వాల్మీకి అనే కీలక పాత్ర మురళిశర్మది. ఈ సినిమాతో ఈయనకి స్టార్డం వచ్చిందని చెప్పాలి. ఇది ఆయన తన ట్యాలెంటు కారణంగా మూడో మెట్టు.
 
అయితే "అల వైకుంఠపురంలో" ఒక సీన్ ఉంది. మురళిశర్మ పాత్రతో రోహిణి పాత్ర అంటుంది, "వాడికి ఫ్యాన్స్ ఉన్నారు. చప్పట్లు కొడతారు. మీకు లేరు. కొట్టరు" అని. ఈ సినిమా షూటింగ్ సమయానికి ఏమో గానీ, ఇప్పుడు మాత్రం మురళి శర్మకి ఫ్యాన్స్ మొదలయ్యారు. ప్రకాష్ రాజ్ మాదిరిగా స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్నారు మురళిశర్మ. త్రివిక్రం గారు! ఆయనిక్కూడా ఫ్యాన్స్ ఉన్నారు సర్ ఇప్పుడు. అందులో మీకు కూడా క్రెడిట్ ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp