వర్మ ఈసారైనా భయపెట్టారా

By iDream Post Apr. 16, 2021, 03:00 pm IST
వర్మ ఈసారైనా భయపెట్టారా

ఇవాళ శుక్రవారం అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం జోష్ లేదు. విడుదల కావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడటంతో అయిదు బడ్జెట్ సినిమాలు వచ్చాయి కానీ దేనికీ మినిమమ్ బజ్ లేదు. ఉన్నంతలో రామ్ గోపాల్ వర్మ దెయ్యం ఓ ఆప్షన్ గా కనిపించడంతో దానికి వెళ్ళినవాళ్ళు లేకపోలేదు. విలక్షణ దర్శకుడిగా తనదంటూ ఒక ముద్రవేసిన వర్మకు గత కొన్నేళ్లుగా తన స్థాయి సినిమా లేదు. అందులోనూ ఎప్పుడో ఏడేళ్ల క్రితం పట్టపగలు పేరుతో రావాల్సిన మూవీ ఇప్పుడు మోక్షం దక్కించుకోవడం కూడా అనుమానాలు పెంచింది. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరో కావడం ఒక్కటే సానుకూలాంశంగా కనిపించిన ఈ సినిమా రిపోర్ట్ చూద్దాం

స్వంతంగా గ్యారేజ్ నడుపుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న శంకర్(రాజశేఖర్)కూతురు విజ్జి(స్వాతి దీక్షిత్)కాలేజీలో చదువుతూ ఉంటుంది. అనూహ్యంగా ఈమె శరీరంలో గురు అనే చనిపోయిన వ్యక్తి ఆత్మ ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి విచిత్రంగా ప్రవర్తించడమే కాక ఏకంగా హత్యలు కూడా చేస్తుంది. దీంతో శంకర్ కు ఏం జరుగుతుందో అర్థం కాదు. బిడ్డను కాపాడుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. అసలు గురు విజ్జినే ఎందుకు పూనాడు, మర్డర్లు ఎందుకు చేశాడు, ఆ కుటుంబం ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడిందనేది తెరమీద చూసి తరించి భయపడాలి.

స్టోరీ లైన్ ఇలాంటి జానర్ కు సెట్ అయ్యేలా ఉన్నప్పటికీ టేకింగ్ లో ఉన్న లోపాలు, డబ్బింగ్ లో నిర్లక్ష్యం, బడ్జెట్ కాంప్రోమైజ్ లాంటి కారణాలు దెయ్యంని మాములు సినిమా స్థాయి కంటే కిందికి తీసుకొచ్చాయి. రాజశేఖర్ డబ్బింగ్ కూడా సింక్ కాకపోవడం చూస్తే ఎంత మొక్కుబడిగా దీన్ని రిలీజ్ చేశారో అర్థమవుతుంది. ఇంతటి బిలో యావరేజ్ ప్రోడక్ట్ ని కాపాడేందుకు సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. చాలా లాజిక్స్ ని ప్రశ్నలను గాలికి వదిలేశారు. మొత్తానికి తన మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకండని పదే పదే చెబుతూ వస్తున్న వర్మ మాటకు తగ్గట్టే ఉందీ సినిమా. దీనికన్నా 1996లో వర్మనే తీసిన దెయ్యం ఎన్నో రెట్లు నయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp