పాత క్రైమ్ థ్రిల్లర్స్ కి డిమాండ్

By iDream Post Aug. 08, 2020, 08:04 pm IST
పాత క్రైమ్ థ్రిల్లర్స్ కి డిమాండ్

ఇప్పుడు ట్రెండ్ క్రైమ్, సైకో కిల్లింగ్, మర్డర్స్ చుట్టూ ఎక్కువ తిరుగుతోంది. అందులోనూ వెబ్ సిరీస్ లు ఎక్కువయ్యాక ఈ ధోరణి మరింత పెరిగింది. తమిళం, మలయాళంలో ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి కానీ తెలుగులోనూ రాక్షసుడు తర్వాత వీటి వేగం ఊపందుకుంది. అయితే వీటికి కథల కొరత ఎక్కువ. పదే పదే తీస్తే ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. అందుకే దర్శక నిర్మాతలు కొత్త తరహా ప్లాట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. కొందరు మాత్రం తెలివిగా పాత క్రైమ్ క్లాసిక్స్ ని రీమేక్ చేసే పనిలో ఉన్నారు. ముప్పై నలభై ఏళ్ళ క్రితం వచ్చిన కల్ట్ క్లాసిక్స్ ని ఇప్పటి జనరేషన్ లో చూసినవాళ్లు తక్కువగా ఉంటారు.

అందుకే వాటిని వెలికితీసే పని మొదలయ్యిందట. అందులో మొదటిది 'ఎర్ర గులాబీలు'. కమల్ హసన్, శ్రీదేవి కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్. దర్శకుడు భారతీరాజా కొడుకు దీన్ని మళ్ళీ తీసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇంకో సినిమా 'టిక్ టిక్ టిక్'. కమల్ మాధవి కాంబోలో వచ్చిన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్. మరొకటి 'నూరవ రోజు'. విజయ్ కాంత్, నళిని జంటగా నటుడు మణివణ్ణన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇది హిందిలో రీమేక్ చేస్తే అక్కడా హిట్టు కొట్టింది. దీని స్ఫూర్తితో తర్వాత చాలా చిత్రాలు వచ్చాయి. స్వాతి త్రిపుర కూడా నూరవ రోజు ఇన్స్ పిరేషన్ తో తీసిందే .

ఇలా ఆ టైంలో వచ్చిన చాలా క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇప్పటి టేస్ట్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగులోనూ ఇలాంటివి లేవా అంటే వచ్చాయి. అవే కళ్ళు, అన్వేషణ, కోకిల, సాక్షి, ఆర్తనాదం, తేజ లాంటివి లేకపోలేదు. కాకపోతే వీటి సక్సెస్ రేట్ అరవంలోనే ఎక్కువగా ఉంది. రిమేక్ ఆలోచన మంచిదే కానీ వీటిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏ మాత్రం తేడా కొట్టినా ఒరిజినల్ ని చెడగొట్టిన నిందను కూడా మోయాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని వెబ్ సిరీస్ ల కోసం తిరగరాసి ఎపిసోడ్ల వారిగా పొడిగించుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సదరు నిర్మాతలకు ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇవి ఆదాయాన్ని ఇచ్చేలా ఉన్నాయి. పోలిక రాకుండా జాగ్రత్త పడాల్సిన బాద్యత మాత్రం దర్శక రచయితలదే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp