సౌండ్ ఇంజనీర్ గా డ్యాన్స్ మాస్టర్

By iDream Post Aug. 08, 2020, 05:38 pm IST
సౌండ్ ఇంజనీర్ గా డ్యాన్స్ మాస్టర్

రెండేళ్ళ క్రితం 2018లో రంగస్థలం ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో రా అండ్ రియలిస్టిక్ విలేజ్ డ్రామాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రామ్ చరణ్ లోని బెస్ట్ యాక్టర్ బయటికి వచ్చింది దీంతోనే. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి చెప్పేదేముంది. ఇప్పటికీ దాన్ని క్రాస్ చేసే ఆల్బం తనే ఇవ్వలేకపోయాడు. కన్నడలో వేరే స్టార్ హీరోతో రీమేక్ చేసే ప్రయత్నాలు జరిగాయి కానీ అవి సఫలీకృతం కాకపోవడంతో ఆఖరికి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఫలితం కూడా బానే వచ్చింది. ఇప్పుడు తమిళ్ లో దీన్ని పునఃనిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెన్నై టాక్.

హీరోగా డాన్స్ మాస్టర్ కం డైరెక్టర్ లారెన్స్ రాఘవేంద్ర చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రాధమికంగా చర్చలు జరిగాయట. ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న కథలు తమిళనాడులో బాగా ఆడతాయి. ఇప్పటికే చాలా వచ్చాయి కూడా. అయినప్పటికీ సరైన కథాకథనాలతో వచ్చిన వాటిని అక్కడి ప్రేక్షకులు ఎప్పుడూ తిరస్కరించలేదు. ఆ నమ్మకంతోనే రంగస్థలంకు సంబంధించిన పనులు ముందడుగు వేయబోతున్నట్టు తెలిసింది. లారెన్స్ ప్రస్తుతం లక్స్మీ బాంబ్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. డిస్నీ హాట్ స్టార్ ద్వారా నేరుగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతున్న మూవీగా ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్షయ్ కుమార్, కీయరా అద్వాని జంటగా నటించిన ఈ మూవీ వచ్చే నెల రాబోతోంది.

దీని సంగతలా ఉంచితే లారెన్స్ త్వరలో సూపర్ స్టార్ రజనికాంత్ తో మొదటిసారి చంద్రముఖి 2లో నటించబోతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గిపోయి కేసులు పూర్తిగా కుదుటపడ్డాక షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. ఓపెనింగ్ వచ్చే ఏడాది ఉండొచ్చు. రజని ఇంకా అన్నాతే బ్యాలెన్స్ పూర్తి చేయాల్సి ఉంది. ముని సిరీస్ లో ఐదో భాగాన్ని కూడా లారెన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఒకే తరహా స్టొరీని పదే పదే రిపీట్ చేస్తున్నా మాస్ అండతో గట్టెక్కుతున్న లారెన్స్ కు రంగస్థలం రీమేక్ అయితే కచ్చితంగా ఫ్రెష్ గానే ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో రావొచ్చు. అయితే దర్శకుడు మాత్రం లారెన్స్ కాదట. రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ ఇంకా ఫైనల్ చేయలేదని సమాచారం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp