నిర్మాతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు

By iDream Post May. 12, 2021, 02:00 pm IST
నిర్మాతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు

ఎవరూ ఊహించనిది కలలో కూడా అనుకోనిది కరోనా సెకండ్ వేవ్ రూపంలో జనానికి నిలువెల్లా నరకం చూపిస్తోంది. మొన్న ఏప్రిల్ రెండో వారం దాకా అంతా సాధారణంగా ఉందనుకుంటున్న తరుణంలో ఈ స్థాయిలో కేసులు పెరిగిపోవడం, నిన్న కళ్ళ ముందు కనిపించిన ప్రాణం ఇవాళ కనుమరుగై పోవడం సామాన్య జనం జీర్ణించుకోలేకపోతున్నారు. దీని ప్రభావం సినీ పరిశ్రమ మీద కూడా తీవ్రంగా పడింది. ఎక్కడిక్కడ షూటింగులు ఆగిపోయాయి. మరోసారి కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఇండస్ట్రీ పెద్దలు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టాలో నిర్ణయించుకోలేదు. ఇక నిర్మాతల కష్టాలు సరేసరి.

కోట్ల రూపాయల ఖర్చు పెట్టి స్టూడియోల్లో వేసిన సెట్లకు అద్దెలు కట్టలేక వాటి నిర్వహణకు మనుషులను పెట్టలేక చేతులారా వాటిని తీసేస్తున్న ఉదంతాలు ఇప్పుడు మొదలయ్యాయి. ముంబైలో థాంక్ గాడ్ అనే సినిమాకు సంబంధించి వేసిన రెండు కోట్ల రూపాయలకు పైగా ఖరీదు చేసే సెట్ ని నిర్మాతలు రెంటు కట్టలేక తీసేశారని ముంబై టాక్. అజయ్ దేవగన్ సిద్దార్థ్ మల్హోత్రా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. జనవరిలోనే ఈ సెట్ వేసి కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. కానీ తక్కువ గ్యాప్ లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడడంతో ఆపేయాల్సి వచ్చింది. దగ్గరలో మొదలయ్యే ఛాన్స్ కూడా లేదు.

అక్కడే కాదు హైదరాబాద్ లోనూ ఈ తరహా ఇబ్బందులను మన ప్రొడ్యూసర్లు ఎదురుకుంటున్నారు. హరిహర వీర మల్లు, శాకుంతలం లాంటి భారీ చిత్రాలు ఇంటీరియర్ సెట్స్ మీదే ఆధారపడి షూటింగులు జరుపుకుంటున్నాయి. దానికి తగ్గట్టే నిర్మాతలు ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టారు. టైంకు అన్ని సవ్యంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూస్తేనేమో తెలంగాణాలో పది రోజుల కఠిన లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. తర్వాత పొడిగించరన్న గ్యారెంటీ లేదు. వ్యాక్సిన్లు ఇంకా అందరికి అందుబాటులోకి రాలేదు. అసలు ఇదంతా ఎప్పుడు కొలిక్కి వస్తుందో అంతు చిక్కని అయోమయంలో నిర్మాతల వెతలు అన్ని ఇన్ని కావు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp