సినిమా VS వెబ్ సీరీస్

By iDream Post Jun. 02, 2020, 12:08 pm IST
సినిమా VS వెబ్ సీరీస్

ఈ హెడ్డింగ్ కొంత అసంబద్ధంగా అనిపించినా కరోనా లాక్ డౌన్ వల్ల స్టార్ డైరెక్టర్లు సైతం వెబ్ సిరీస్ లవైపు చూస్తున్న వేళ రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. అందులోనూ సినిమాలకు ధీటుగా వాటిలో కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు సైతం మంచి ఆదరణ కలిగిస్తున్నారు. కొన్ని టీవీ ఛానల్స్ ఏకంగా వీటినే రోజు వారి అరగంట ఎపిసోడ్లుగా ప్రసారం చేయడానికి పూనుకున్నాయి. ఇంకొద్ది రోజుల్లో సినిమా షూటింగులు మొదలుకాబోతున్నాయి కాబట్టి నిజంగా వీటికి చెక్ పడుతుందా లేదా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. అలవాటు పడ్డారు కాబట్టి పబ్లిక్ ని ఓటిటి నుంచి డైవర్ట్ చేయగలమా లేదా అనే అనుమానంలో కూడా కొందరు దర్శక నిర్మాతలు ఉన్నారు.

ఇళ్ళల్లో ఉన్న సమయంలో అధిక శాతం వీటిని చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చిన జనం ఇక వెబ్ సిరీస్ లను చూడటం మానేస్తారా అనేది ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేం. అయితే వెబ్ సిరీస్, సినిమా ఈ రెండింటిలో దేనికి భవిష్యత్తు ఎక్కువగా ఉంటుందంటే ఖచ్చితంగా సినిమా అనే చెప్పాలి. దానికి కారణాలు లేకపోలేదు. ఇప్పటిదాకా తెలుగు, హిందితో సహా అన్ని బాషల్లోనూ వచ్చిన ఏ వెబ్ సిరీస్ చూసినా, అది ఎంత పెద్ద హిట్టైనా వాటికి రిపీట్ వేల్యూ తక్కువ. అందులోనూ గంటల కొద్ది సాగే ఎపిసోడ్లను పదే పదే చూసేందుకు ఎవరూ ఇష్టపడరు. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్ లు మనీ హీస్ట్, డార్క్ లాంటివి మహా అయితే రెండు మూడు సార్లకంటే ఎక్కువ చూడలేం. అదే అవతార్, జురాసిక్ పార్క్, జాస్, టైటానిక్, స్పైడర్ మ్యాన్ లాంటివి దశాబ్దాలు దాటినా బుల్లితెరపై తరగని ఆదరణ ఉంటుంది.

తెలుగులోనూ మాయాబజార్, శివ, అడవి రాముడు, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సినిమాలు టైంతో సంబంధం లేకుండా జనం మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. కాని వెబ్ సిరీస్ లకు ఇంత సీన్ ఉండదు. కాబట్టి ఎప్పటికైనా సినిమాకున్న లైఫ్,స్పాన్ దేనికీ రాదన్నది వాస్తవం. అంత ఎగబడి చూసే టీవీ సీరియల్స్ కూడా రిపీట్ టెలికాస్ట్ లో రేటింగ్స్ తక్కువ తెచ్చుకుంటాయి. ఎందుకంటే రెండోసారి బోర్ కొట్టేస్తుంది కాబట్టి. కాని సినిమా దానికి మినహాయింపు. హిట్ చిత్రాలకు విసుగు పుట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సో వెబ్ సిరీస్ ల వల్ల పరిశ్రమ ఏదో ప్రభావితం చెందుతుందన్న టెన్షన్ అక్కర్లేదు. వెబ్ సిరీస్ లు నక్షత్రాలు లాంటివి. ఇరవై నాలుగు గంటలు కనిపించవు. సినిమా ఆకాశం లాంటిది. శాశ్వతంగా ఉండిపోతుంది. సింపుల్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp