పోగొట్టుకున్న‌వ‌న్నీ సినిమాల్లో వెతుక్కుంటాం

By G.R Maharshi 17-11-2019 03:49 PM
పోగొట్టుకున్న‌వ‌న్నీ సినిమాల్లో వెతుక్కుంటాం

సినిమా ఒక భ్రాంతి, పిచ్చి, వినోదం. అంతేకాదు మ‌నం కోల్పోయిన‌వ‌న్నీ వెతుక్కునే ఒక మాంత్రిక శ‌క్తి కూడా!
వృద్ధులు త‌మ య‌వ్వ‌నాన్ని, ప్రేమ క‌థ‌ల్ని వెతుక్కుంటారు. పిల్ల‌లు త‌మ సాహ‌సాల్ని అన్వేషిస్తారు. యువ‌కుల‌కి ఒక క‌ల‌, కొత్త జీవితం క‌నిపిస్తుంది. త‌మ‌లో లేనివ‌న్నీ చూడ‌ట‌మే సినిమా.

ఒక క‌రుడుగ‌ట్టిన క్రూరుడు కూడా సినిమాల్లో మంచి గెల‌వాల‌ని కోరుకుంటాడే త‌ప్ప విల‌న్ గెల‌వాల‌ని కోరుకోడు. కోడ‌ల్ని హింసించే అత్త‌లు సినిమాల్లో కోడ‌లి క‌ష్టాల‌కి క‌న్నీళ్లు పెడ‌తారు. అత్త‌ల‌కి అన్నం పెట్ట‌ని కోడ‌ళ్లు కూడా సినిమా చూస్తున్న‌ప్పుడు గ‌యాలి కోడ‌ల్ని స‌పోర్టు చేయ‌రు. అంటే ఎవ‌రూ కూడా త‌మ‌లో చెడుని గుర్తించ‌లేరు. ఎదుటి వాళ్ల చెడ్డ‌త‌నాన్ని వెంట‌నే ప‌సిగ‌డ‌తారు.

ఒక వీధిలో రౌడీ ఉంటాడు. వాన్ని మ‌నం త‌న్న‌లేం. తంతే బాగుంటుంద‌ని ఎంత కోరుకున్నా మ‌న‌కి చేత‌కాదు. సినిమాల్లో హీరో గాల్లో లేచి ఫైట్స్ చేస్తూ ఉంటే చ‌ప్ప‌ట్లు కొడ‌తాం. అమ్మాయిల‌తో డ్యూయెట్లు మ‌నం పాడ‌లేం కాబ‌ట్టి హీరో పాడుతూ ఉంటే హీరో ప్లేస్‌లో మ‌న‌ల్ని ఊహించుకుని థ్రిల్ ఫీల్ అవుతాం.

ఉమ్మ‌డి కుటుంబాలంటే మ‌న‌కి ఇష్ట‌మే. అవ్వ‌, తాత‌, పిన్ని, బాబాయ్‌, పెద్ద‌మ్మ‌, పెద‌నాన్న‌, అత్తామామ‌, ఈ పిలుపుల‌న్నీ చాలా అప్యాయంగా ఉంటాయి. కాని మారుతున్న ప‌రిస్థితుల్లో ఈ సంబంధాల‌న్నీ తెగిపోయాయి. ఫంక్ష‌న్ల‌లో త‌ప్ప క‌లుసుకోలేం. అందుకే మ‌న‌కి "క‌లిసుందాంరా" లాంటి సినిమాలు న‌చ్చుతాయి.
హీరో ఎందుకు న‌చ్చుతాడంటే మ‌నం చేయ‌లేనివ‌న్నీ అత‌ను చేస్తాడు కాబ‌ట్టి. నిజ జీవితంలో మ‌నం విల‌న్లు, క‌మెడియ‌న్లు కావ‌చ్చు, అస‌లేమీ కాక‌పోవ‌చ్చు. అయినా మ‌న‌కు హీరోనే న‌చ్చుతాడు త‌ప్ప విల‌న్ న‌చ్చ‌డు. మ‌న‌లో లేని ల‌క్ష‌ణాలు హీరోలో చూసి ఆనందిస్తాం. యూత్ క్ర‌మేపి ఆరాధ‌నా స్వ‌భావం పెంచుకుని ఫ్యాన్స్‌గా మారి వెర్రి ల‌క్ష‌ణాల‌కు కూడా దిగుతారు.

ఆర్ట్ అంటేనే త‌మ‌లో లేనివి వెతుక్కోడం. హీరో త‌న‌లో లేని క‌రుణ‌ను ప్ర‌ద‌ర్శిస్తాడు. హీరోయిన్ ప్రేమ‌ను న‌టిస్తుంది. పిల్లిని చూసి భ‌య‌ప‌డే విల‌న్, స్క్రీన్ మీద పులిలా ఉంటాడు.జీవిత‌మే ఒక నాట‌క‌మ‌ని అంటే ఇదే. ఎవ‌డూ త‌మ‌లా ఉండ‌డాన్ని కోరుకోరు. ఇత‌రుల్లా ఉండాల‌నుకుంటారు. దీనివ‌ల్లే ప్ర‌పంచం ఎదిగింది, పాతాళానికి దిగజారింది కూడా.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.