బాలకృష్ణ - చిరంజీవిల దాగుడుమూతలు!

By iDream Post Sep. 08, 2021, 01:30 pm IST
బాలకృష్ణ - చిరంజీవిల దాగుడుమూతలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా విడుదల విషయంలో స్టార్ హీరోల మధ్య ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోల మధ్య పోటీ ఈనాటిది కాదు. నటసింహం నందమూరి బాలకృష్ణ, చిరంజీవిల మధ్య కెరీర్ మొదటి నుంచి సినిమాల విషయంలో పోటీ నడుస్తూనే ఉంది. బాలకృష్ణ తన తండ్రి వారసత్వంగా వచ్చిన నటన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నటసింహంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం జీరో స్థాయి నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. అయితే గతంలో వీరిద్దరూ చాలా సార్లు బాక్సాఫీస్ వార్ కి దిగగా ఇప్పుడు మరో సారి ఆ వార్ కు సీనియర్ హీరోలు ఇద్దరూ సై అంటే సై అంటున్నారు. అయితే ఆ వార్ ప్రత్యక్షంగా జరగట్లేదు కానీ ఒకరితో ఒకరు దాగుడుమూత ఆడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఈ చర్చ అంతా చిరంజీవి మీద బాలకృష్ణ పరోక్షంగా చేసిన కామెంట్స్ గురించి మాత్రం కాదండోయ్...! విషయం ఏమిటంటే స్టార్ హీరోలు ఇద్దరూ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విడుదల గురించి.

కొంతకాలం క్రితం తన చిరకాల స్వప్నం అంటూ "సైరా"తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" అనే సోషల్ డ్రామా లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషల్ మెసేజ్ డ్రామా లో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తుండటంతో సినిమా మీద మెగా ఫ్యాన్స్ లో భీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు మినహా టాకీ పార్ట్ అంతా పూర్తయిందని కొద్ది రోజుల క్రితం ఆచార్య యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు "గౌతమీపుత్ర శాతకర్ణి" తరువాత సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న బాలయ్య "అఖండ"అనే మరో మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: మా ఎన్నికలలో ఇంకెన్ని ట్విస్టులో

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండగా అందులో ముఖ్యంగా ఆయన అఘోరి పాత్రపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇటీవలే చిత్రబృందం సినిమాకు గుమ్మడికాయ కొట్టేసింది.

విషయం ఏమిటంటే దాదాపు ఒకే దశలో ఉన్న ఈ రెండు సినిమాలు విడుదల విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నాయి. గతంలో ఈ రెండు సినిమాలను మే నెలలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడడంతో స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆచార్య నిర్మాతలు సినిమాని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలని ఆలోచిస్తుంటే అఖండ నిర్మాతలు కూడా దాదాపు అదే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: వినాయక చవితికి వినోదాల పండగ

అయితే ఈ దసరా, దీపావళి లోపు గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన టికెట్ల వ్యవహారం తేల్చకపోతే ఈ రెండు సినిమాలను వచ్చే ఏడాది వాయిదా వేసుకోవడానికి సైతం దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. దీపావళి తర్వాత సినిమాలను విడుదల చేయడానికి మంచి సీజన్ లేకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సంక్రాంతి ఎలాగు గట్టి పోటీ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో ఈ రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చివరిసారిగా 2017లో బాలకృష్ణ, చిరంజీవి బాక్సాఫీస్ వార్ జరిగింది. గౌతమీపుత్ర శాతకర్ణి అనే పౌరాణిక చిత్రం తో బాలయ్య బాక్సాఫీస్ పై దాడి చేస్తే, ఖైదీ నెంబర్ 150 అంటూ చిరంజీవి కలెక్షన్స్ దోపిడీ చేశారు. ఇద్దరి మధ్య పోటీ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Also Read: క్లాసిక్ రీమేక్ తెరపైకి వస్తోంది

అయితే ఆసక్తి కరంగా రెండు చిత్రాల మేకర్స్ ఒకరితో ఒకరు దాగుడు మూతలు ఆడుతున్నారు. ఎందుకంటే చిరంజీవి ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే వరకు అఖండ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకుండా ఉండాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అలాగే అఖండ విషయంలో ఏదో ఒకటి తేలేవరకు తాము కూడా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించకూడదని ఆచార్య యూనిట్ సభ్యులు భావిస్తున్నారని అంటున్నారు. అంటే ఎవరో ఒకరు ముందు తమ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే గాని మరొకరు రిలీజ్ డేట్ విషయంలో ముందడుగు వేయరన్న మాట. అలా అలా మొత్తానికి బాలకృష్ణ, చిరంజీవి మధ్య జరుగుతున్న దాగుడు మూతల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ముందుగా ఏ సినిమా మేకర్స్ తమ మూవీ రిలీజ్ డేట్ విషయం ముందుగా అనౌన్స్ చేస్తారో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp