స్కూల్ ఎగ్గొట్టి హిందీ మ్యాట్నీ - Nostalgia

By G.R Maharshi Jan. 20, 2020, 04:28 pm IST
స్కూల్  ఎగ్గొట్టి హిందీ మ్యాట్నీ - Nostalgia

హైద‌రాబాద్‌లో ఈ రోజు నాలుగు హిందీ మాట‌లు మాట్లాడుతూ, 40 హిందీ సినిమాలు చూడ‌గ‌లుగుతున్నానంటే అంతా మా డ్రిల్ అయ్య‌వార్ల ధ‌ర్మం. హిందీకి, డ్రిల్‌కి ఏం సంబంధం అంటారా? అదే కదా క‌త‌.

మా డ్రిల్ అయ్య‌వార్లు వాళ్ల ప‌ని స‌క్ర‌మంగా చేసి ఉంటే నాకెప్ప‌టికీ హిందీ వ‌చ్చేది కాదు. శుక్ర‌, శ‌నివారాల్లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి డ్రిల్ పీరియ‌డ్‌లు. అదే స‌మ‌యానికి ప్యాలెస్ థియేట‌ర్‌లో హిందీ మ్యాట్నీలు. ఆ రోజుల్లో శుక్ర‌, శ‌ని, ఆదివారాలు మాత్ర‌మే మ్యాట్నీగా హిందీ సినిమాలు ఆడేవి. రంజాన్ , బక్రీద్ వ‌స్తే పండ‌గ కానుక‌గా మూడు ఆట‌లు వేసేవారు.

ప్యాలెస్ అంటే అదో భూత గృహం. ప్రేక్ష‌కుల సిగ‌రెట్ పొగ‌లు ధూపంగా లేసేవి. రంగు వెల‌సిపోయిన మంత్ర‌న‌గ‌రి అది. దానిలోప‌ల కూచుంటే లోకం గుర్తు ఉండేది కాదు. హిందీ సినిమాల‌తో వెసులుబాటు ఏంటంటే అవి గ్యారెంటీగా క‌ల‌ర్‌లో ఉంటాయి. మ‌న తెలుగులా బ్లాక్ అండ్ వైట్ కాదు. అయితే ప్యాలెస్ గొప్ప‌త‌నం ఏంటంటే , పిర‌మిడ్లులా రెండు ప్రొజెక్ట‌ర్లు ఉండేవి, వాటి కాలాన్ని పురావ‌స్తుశాస్త్ర‌వేత్త‌లే గుర్తించ‌గ‌ల‌రు. ఆన్ చేస్తే పాత సైకిల్ చైన్ తిరిగే శ‌బ్దం వ‌చ్చేది. క‌ల‌ర్ సినిమాని కూడా బ్లాక్ అండ్ వైట్‌లా చూపించే శ‌క్తి ఉండేది వాటికి. పాత న‌వారులాంటి రీళ్లు ఎప్పుడు ప‌డితే క‌ట్ అయ్యేవి. ఆప‌రేట‌ర్ త‌న సౌల‌భ్యం కోసం సినిమాని కొంచెం ముందుకు జ‌రిపేవాడు. ఎవ‌రి క‌ల్ప‌నా శ‌క్తి మేర‌కు వాళ్లు క‌థ‌ని ఊహించుకునేవాళ్లు.

అయితే మాకు ఈస్ట్‌మ‌న్ , గేవా, పార్ట్‌లీ క‌ల‌ర్ , అన్నీ ఒక‌టే. ఏ క‌ల‌రూ లేకుండా బొమ్మ బూజుగా క‌నిపించినా OK. కొన్ని సినిమాల‌కి రీళ్లు పాత‌ప‌డిపోయి , వాన లేక‌పోయినా , వాన ఎఫెక్ట్. సినిమా అంతా తెల్లటి చినుకులు వ‌చ్చేవి. అయినా Dont Care. బ‌ట్ట మీద బొమ్మ ఉందా లేదా? ఇదే పాయింట్‌.

నేను , నా మిత్రుడు శేఖ‌ర్ సినిమా ఉన్మాద మ‌త్తులు. మ‌మ్మ‌ల్ని డ్రిల్లు క్లాసులు ఆపుతాయా? అయినా డ్రిల్ అయ్య‌వార్ల‌కే డ్రిల్ రాదు, మమ్మ‌ల్ని వ‌రుస‌లో నిల‌బెట్టి అటెన్ష‌న్ , స్టాండ్ ఎట్ ఈజ్ అనే ప‌నికి మాలిన ప‌దాలు ప‌లికే వాళ్లు. ఇక ఆట‌ల్ని డ‌బ్బున్న వాళ్ల పిల్ల‌ల‌కే నేర్పించే వాళ్లు. డ‌బ్బు ఉంటే ఏ ఆట అయినా ఆడొచ్చు క‌దా! ఆ రోజుల్లో కాన్వెంట్లు , ప్రైవేట్ స్కూళ్లు లేవు. కుభేరుడి కొడుకైనా , కుచేలుడి పుత్రుడైనా గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్లో చ‌ద‌వాల్సిందే. ఆ ర‌కంగా అన్ని త‌ర‌గ‌తుల వాళ్లు , అన్ని త‌ర‌గ‌తుల్ని క‌లిసే చ‌దివేవాళ్లు.

హైస్కూల్‌కి కాంపౌండ్ వుండేది కాదు. కుక్క‌లు, పందులు, ప‌శువులు కూడా పాఠాలు వినడానికి వ‌చ్చేవి. మా రాళ్ల దెబ్బలు తిని గుణ‌పాఠాన్ని నేర్చుకునేవి. ప‌శువుల‌కి , విద్యార్థుల‌కి తేడాలేదు. ఆ రోజుల్లో ప్ర‌తి క్లాస్ బందెల దొడ్డిలా ఉండేది. రెంటికి బెత్తం దెబ్బ‌లు ప‌డేవి.

డ్రిల్ క్లాస్ నుంచి పారిపోవ‌డానికి దారి క‌ళ్ల ముందే ఉంది. బ‌స‌వ‌రాజు అనే మూగెద్దు ఉండేవాడు. వాడి మెడ‌కు బ్యాగులు త‌గిలిస్తే మోసుకొచ్చే వాడు. సినిమా 3 గంట‌ల‌కి. స‌రిగ్గా 3కి డ్రిల్ క్లాస్‌. అది ఎగ్గొట్టి దుమ్ము రేపుకుంటూ మెక‌నాస్ గోల్డ్ సినిమాలోని గుర్రాల్లా కాళ్ల‌కి చెప్పులు కూడా లేకుండా ప్యాలెస్‌కి ప‌రుగు తీసేవాళ్లం.

హిందీ సినిమాల్లో ఉన్న ఇంకో ఆకర్ష‌ణ ఏమంటే హెలెన్ డ్యాన్స్‌. రాయ‌ల‌సీమ క‌ర‌వులాగా ఆమెకి బ‌ట్ట‌ల క‌ర‌వు. ఉండాల్సిన చోట ఉండేవి కావు. భ‌విష్య‌త్‌లో స్మ‌గ్ల‌ర్లు కావాల‌నే కాంక్ష బ‌లంగా ఉండేది కాబ‌ట్టి , హిందీ సినిమాల్లో స్టైలిష్‌గా స్మ‌గ్లింగ్ టిప్స్ ఉండేవి. ముఖ్యంగా టేబుల్ కింద సూట్‌కేసులు మార్చుకోవ‌డం ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌.
అదీ కాకుండా ఇంట‌ర్నేష‌న‌ల్ స్మ‌గ్ల‌ర్‌కి హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ రావాలి. బ్రిటీష్ వాళ్లు మ‌ళ్లీ వ‌చ్చి మ‌న‌దేశాన్ని ఆక్ర‌మించినా , మాకు ఇంగ్లీష్ నేర్పించ‌లేరు.

Aని చూస్తే నిచ్చెన, B అంటే బాన‌పొట్ట‌, C గుర్రపు నాడాలా క‌నిపించే వాడికి ఇంగ్లీష్ నేర్పించ‌గ‌ల‌రా?
ఇక మిగిలింది హిందీ. మా హిందీ అయ్య‌వారికి బెత్తం త‌ప్ప చిత్తం లేదు. హ‌మ్‌, తుమ్ దాటిపోలేడు. అందుక‌ని మ్యాట్నీ అంటే ఒక ర‌కంగా స్పోకెన్ హిందీ కోర్స్‌. డ్రిల్ ఎగ్గొట్టినా, చ‌దువుపైన శ్ర‌ద్ధ త‌గ్గ‌లేదు మాకు.
మేము ఎంత వేగంగా వ‌చ్చినా సినిమా స్టార్ట్ అయ్యిపోయేది. స‌రే, మ‌న‌కు కావాల్సింది హెలెన్ డ్యాన్స్‌, స్మ‌గ్లింగ్ కోచింగ్‌, ఫైట్స్ మిగ‌తా వాళ్లు ఏం మాట్లాడినా , పాడుకున్నా అన‌వ‌స‌రం.

గేట్ కీప‌ర్‌కి 20 పైస‌లు ఇస్తే త‌లుపు తీసేవాడు. లోప‌ల క‌ళ్లు క‌న‌ప‌డేవి కాదు. ఏం మిస్ కాకుండా తెర‌ని చూస్తూ నేల మీద ఉన్న అనేక ఆకారాల‌ను తొక్కుతూ , కుయ్యో అనే అరుపులు వింటూ ఎక్క‌డో ఒక‌చోట ల్యాండ్ అయ్యేవాళ్లం.
స్క్రీన్‌పై భాష అర్థం కాక‌పోయినా క‌న్నీళ్లు, కోపం , న‌వ్వు అన్నీ అర్థ‌మ‌య్యేవి. హెలెన్ డ్యాన్స్ స‌రిగా అర్థ‌మ‌య్యేది కాదు. స‌రే నాలుగైదు సూట్ కేసులు మార్చిన అనుభ‌వం వ‌స్తే అదే అర్థ‌మ‌వుతుంద‌ని స‌ర్దుకునేవాన్ని.
సినిమా వ‌దిలే స‌రికి సాయంత్రం అయ్యేది. డ్రిల్ క్లాస్ లేట‌వుతుంద‌ని ఇంట్లో ముందే ప్రిపేర్ చేయ‌డం వ‌ల్ల అనుమానం వ‌చ్చేది కాదు. దారిలో బ‌స‌వ‌రాజు ఇంటి ముందు , బ్యాగులు క‌లెక్ట్ చేసుకుని , అల‌స‌ట అభిన‌యిస్తూ ఇల్లు చేరేవాళ్లం.

ఏది ఎక్కువ రోజులు జ‌ర‌గ‌దు. నాట‌కం మొద‌లు పెట్టిన‌ప్పుడే తెర‌ని కూడా సిద్ధం చేసుకోవాలి. యుద్ధం చేసే శ‌త్ర‌వుని క‌నుక్కోవ‌చ్చు. స్నేహం చేసే మిత్రున్ని క‌నిపెట్ట‌లేం.

గుర్నాథం అనే వాడు నా మీద ప‌గ ప‌ట్టాడ‌ని తెలియ‌దు. నేను చేసిన పాప‌మ‌ల్లా , పుల్ల ఐస్ వాడికి ఇవ్వ‌కుండా తిన‌డ‌మే.

ఒక‌రోజు మ్యాట్నీ చూడ‌టానికి , గుర్రాల్లా ప‌రిగెత్త‌డానికి కాళ్ల‌కి ప‌దును పెట్టుకుంటూ ఉండ‌గా డ్రిల్ అయ్య‌వారు శివ‌య్య మాయాబ‌జార్‌లో ఘ‌టోత్క‌చుడిలా "ఠింగ్‌" అనే సౌండ్‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. చేతిలో గ‌ద లాంటి బెత్తం.
"ఎక్క‌డికి రా"
"గ్రౌండ్‌కి సార్ "
"మిమ్మ‌ల్ని ఎప్పుడూ చూడ‌లేదే"
"అన్ని క్లాస్‌ల‌కి వ‌స్తున్నాం సార్‌"
గుర్నాథం శ‌కునిలా న‌వ్వి "ప్ర‌తి వారం , హిందీ సినిమాల‌కి పోతారు సార్‌" అన్నాడు. పాచిక వేశాడు.
"అంతా అబ‌ద్ధం సార్‌, నాకు హిందీ రాదు, నేనేం తురుకోళ్ల పిల్లోన్ని కాదు హిందీ సినిమా చూడ్డానికి" అన్నాను.
నా లాజిక్ శివ‌య్య‌కి న‌చ్చింది. హిందీ అయ్య‌వారికి , శివ‌య్య‌కి ప‌డ‌దు. హిందీ అయ్య‌వారి వ‌ల్ల ఆ స్కూల్లో ఎవ‌డికైనా హిందీ వ‌స్తుందంటే శివ‌య్య న‌మ్మ‌డు.

కానీ శ‌కుని ఆఖ‌రి పాచిక వేశాడు. బ‌స‌వ‌రాజుని ముందుకు తెచ్చాడు. అడుగుతున్న‌ది శివ‌య్య‌. బ‌స‌వ‌డు నిజ‌మే చెప్పాడు.

"స‌క్‌స‌క్‌"మ‌ని బెత్తం సౌండ్‌. దెబ్బ‌ల‌కి బ‌స‌వ‌డు రంకె వేశాడు. Next మేము పెడ‌బొబ్బ‌లు పెట్టాము.సినిమానా? డ‌్రిల్లా? అనే సంక్లిష్ట స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు సినిమానే ఎంచుకున్నాం.

కాక‌పోతే సోమ‌వారం శివ‌య్య వెతుక్కుంటూ వ‌చ్చి త‌న్నేవాడు. దీనికో ట్రిక్ క‌నిపెట్టా. సోమ‌వారం త‌ల‌కి ఫుల్‌గా కొబ్బెరి నూనె ప‌ట్టించేవాన్ని. అర‌చేతుల‌కి నూనె రుద్దుకుని శివ‌య్య ముందు చాస్తే దెబ్బ త‌గిలేది కానీ, బాధ తెలిసేది కాదు. చేతుల‌కి కొట్ట‌డం బోర్ కొడితే పిర్ర‌ల్ని వాయించేవాడు. అందుక‌ని మూడు నాలుగు నిక్క‌ర్లు వేసుకుని మందంగా నిల‌బ‌డేవాన్ని. నిక్క‌ర్ మీద దుమ్ము లేచేదే త‌ప్ప , దెబ్బ త‌గిలేది కాదు. కానీ శివ‌య్య‌కి ఏం తిక్క లేసిందో ఒక‌రోజు టెక్నిక్ మార్చి చేతివేళ్ల కణుపుల మీద స్కేల్‌తో వాయించాడు. మందు క‌నుక్కునేలోగా స్కూల్ అయిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp