బాలీవుడ్ టార్గెట్ అయోధ్య రాముడే

By iDream Post Aug. 09, 2020, 11:39 am IST
బాలీవుడ్ టార్గెట్ అయోధ్య రాముడే

ఐదు శతాబ్దాల ఎదురుచూపులకు కళ్ళెం వేస్తూ ఇటీవలే అయోధ్యలో అంగరంగవైభవంగా శ్రీరామమందిరం శంఖుస్థాపన జరగడం దాన్ని కోట్లాది ప్రజలు కనులారా తిలకించడం జరిగిపోయింది. తీవ్ర వివాదాల మధ్య నలుగుతూ ఎందరికో కలగా మిగిలిపోయిన నిర్మాణం ఇంకో మూడేళ్ళలో పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి బాలీవుడ్ వర్గాలు. జనంలో ఉన్న రామ సెంటిమెంట్ ని బాక్సాఫీస్ దగ్గర వసూళ్లుగా ఎందుకు మార్చుకోకూడదన్న ఆలోచన కొందరిని సినిమాలు తీసేందుకు ప్రేరేపిస్తోంది. అందుకు స్టార్లు సైతం ముందుకు రావడం గమనార్హం.

ముందుగా వీటిలో హృతిక్ రోషన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. దంగల్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మనీష్ తివారి సంవత్సర కాలంగా ఈ స్క్రిప్ట్ మీద పని చేస్తున్నారు. అల్లు అరవింద్ గత ఏడాది ప్రకటించిన ప్రాజెక్ట్ ఇదే. మధు మంతెన మరో నిర్మాతగా ఉంటారు. రామాయణం ఆధారంగా రూపొందబోయే ఈ ప్రాజెక్ట్ ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. మరో ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలాని ఏకంగా అయోధ్య కి కహాని పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. క్యాస్టింగ్ గురించి మాత్రం బయటికి చెప్పడం లేదు. మణికర్ణికగా అద్భుతంగా మెప్పించిన కంగనా రౌనత్ అపరాజిత అయోధ్య పేరుతో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. దీనికి ప్రసిద్ధ కథకులు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచన చేయబోతున్నారు.

ఇప్పటికే పనులు మొదలయ్యాయట. మొత్తం ఆరు వందల ఏళ్ళ చరిత్రను హీరో కోణంలో ఆవిష్కరిస్తూ అయోధ్య ఘట్టంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అన్నీ ఇందులో చూపించబోతున్నట్టుగా తెలిసింది. మొత్తానికి అయోధ్య రాముడిని అందరూ బాగానే టార్గెట్ చేస్తున్నారు. రాముడి మీద ఆదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు లాక్డ్ డౌన్ టైంలో 30 ఏళ్ళ నాటి సీరియల్ విశేష ఆదరణ దక్కించుకోవడమే ఉదాహరణ. గుడి నిర్మాణం పూర్తయ్యేలోపే ఈ సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళే కాకుండా మరికొందరు కూడా ఇదే తరహా కథల కూర్పులో బిజీగా ఉన్నారట. త్వరలో అన్ని ప్రకటనలు మూకుమ్మడిగా రాబోతున్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp