బాలయ్య అభిమానులకు అరుదైన కనుక

By iDream Post Jun. 08, 2020, 02:00 pm IST
బాలయ్య అభిమానులకు అరుదైన కనుక

ఈ నెల 10న నందమూరి బాలకృష్ణ బర్త్ డే. 60వ వసంతంలోకి అడుగుపెట్టనుండటంతో అభిమానులు చాలా స్పెషల్ గా దీన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో చిరంజీవి సైతం ఇదే తరహాలో ఇండస్ట్రీ బిగ్ షాట్స్ ని పిలిచి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఆ రోజు బాలయ్య ఫ్యాన్స్ కు ఓ అరుదైన కానుకను ఇవ్వబోతున్నారు వాళ్ళ అభిమాన హీరో. 2004లో బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో మొదలుపెట్టిన నర్తనశాల అందులో ద్రౌపదిగా నటిస్తున్న సౌందర్య అకాల మరణంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. తన డ్రీం ప్రాజెక్ట్ గా ఎంతో భారీ బడ్జెట్ తో మొదలుపెట్టి తిరిగి సెట్స్ పైకి వెళ్ళకపోవడం అభిమానులను బాగా హర్ట్ చేసింది.

సౌందర్య స్థాయి నటి వేరొకరు లేకపోవడం వల్లే దాన్ని ఆపేశానని పలు సందర్భాల్లో బాలకృష్ణ చెప్పారు. అప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఆ ఫుటేజ్ ని 17 నిమిషాలకు ఎడిట్ చేయించి విడుదల చేయబోతున్నారు. అంటే 16 ఏళ్ళ క్రితం బాలయ్యను ఫ్రెష్ గా చూడబోతున్నారన్న మాట. వనవాసంకు సంబంధించిన సీన్లు ఉండొచ్చని తెలిసింది. మరో విశేషం ఏమిటంటే ఇందులో భీముడిగా నటించిన దివంగత శ్రీహరిని కూడా చూసుకోవచ్చు. అయితే ఆయన సన్నివేశాలు ఏ మేరకు ఉన్నాయన్నది ఇంకా తెలియలేదు. దీంతో పాటు ఇదే నర్తనశాల కోసం బాలకృష్ణ పాడిన పాట కూడా రిలీజ్ కాబోతోంది. ఇంత కన్నా ఎగ్జైటింగ్ గిఫ్ట్ ఫాన్స్ కు ఏముంటుంది. అప్పుడెప్పుడో 1996లో శ్రీకృష్ణార్జున విజయం తర్వాత బాలయ్య ఇలాంటి గాథల్లో కనిపించలేదు. ఆలోటుని కొంతైనా తీర్చేలా ఇలా నర్తనశాల ఫుటేజ్ ని విడుదల చేయడం సంతోషించదగ్గ విషయమే.

ఇందులో ఇంకా చాలా విశేషాలు ఉండొచ్చని తెలిసింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో మకుటంలా నిలిసిపోయున ఎన్టీఆర్ నర్తనశాలకు గొప్ప నివాళిగా కొత్త సినిమాను రూపొందించాలని బాలయ్య చేసిన ప్రయత్నం సఫలీకృతం కాలేకపోయింది. పదిహేడు నిమిషాల వీడియో అంటే చిన్నది కాదు కాబట్టి అందులో చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. వీటితో పాటు బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న మోనార్క్(ప్రచారంలో ఉన్న టైటిల్) అనౌన్స్ మెంట్ తో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అఘోరాగా ఒక పాత్ర వివరాలు బయటికి రాని మరో పాత్ర ఇలా డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. మొత్తానికి జూన్ 10న బాలయ్య పుట్టినరోజుకి ట్రిపుల్ స్పెషల్స్ ప్లాన్ చేశారు. నందమూరి అభిమానులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp