బిగ్ బాస్ తో భీష్మ బుల్లితెర యుద్ధం

By iDream Post Oct. 24, 2020, 05:04 pm IST
బిగ్ బాస్ తో భీష్మ బుల్లితెర యుద్ధం

రేపు విజయదశమి పండగ. కరోన తగ్గుముఖం పడుతున్న వేళ జనం కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఊళ్ళ మధ్య రాకపోకలు, మార్కెట్లో కొనుగోళ్ళు అంతా సందడి సందడిగా ఉంది. థియేటర్లు తెరుచుకుని ఉంటే హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతూ ఉండేవి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి ఆ ఛాన్స్ లేదు. కాని బుల్లితెర మీద మాత్రం ఓ రేంజ్ లో హంగామా ఉండబోతోంది. రకరకాల ప్రోగ్రాములు, ప్రీమియర్ షోలతో యమా కిక్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ప్రైమ్ టైం అయిన సాయంత్రం పూట ఈసారి మాంచి పోటాపోటీ ఉండబోతోంది. బిగ్ బాస్ తో భీష్మ ఢీ కొట్టబోతున్నాడు. సెలవు అందులోనూ సండే కాబట్టి రెస్పాన్స్ గురించి ఛానల్స్ ధీమాగా ఉన్నాయి.

విషయానికి వస్తే బిగ్ బాస్ 4 స్పెషల్ ఫెస్టివల్ ఎపిసోడ్ రేపు సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయబోతున్నారు. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం నాగ్ మనాలిలో ఉన్నారు కాబట్టి ఆయన స్థానంలో కోడలు సమంతా యాంకరింగ్ బాధ్యతలు తీసుకోబోతోంది. రాత్రి 9 దాకా ఏకంగా మూడు గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ని ప్లాన్ చేశారు. ఇదే ఎపిసోడ్ లో ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ స్పెషల్ గెస్టులుగా రాబోతున్నారు. ఎలిమినేషన్ ఉండదనే లీక్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అల్లరి మాములుగా ఉండేలా కనిపించడం లేదు. అందులోనూ సామ్ అభిమానులు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెడతారు.

ఇక ఈ ఏడాది మూడో అతి పెద్ద బ్లాక్ బస్టర్ నితిన్ భీష్మ మొదటిసారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతోంది. ఇది కూడా బిగ్ బాస్ మొదలైన సరిగ్గా అరగంటకు స్టార్ట్ అవుతుంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో ఇప్పటికే రికార్డులు సృష్టించిన నేపథ్యంలో దీని రేటింగ్స్ విషయంలోనూ జెమిని ఛానల్ చాలా ధీమాగా ఉంది. ఎంతలేదన్నా 20 దాకా టిఆర్పిని ఆశిస్తోంది. భీష్మ ను దృష్టిలో ఉంచుకునే దానికి సమానమైన పోటీని ఎవరు ఇవ్వలేకపోతున్నారు. కొన్ని ఛానల్స్ రియాలిటీ షోలతో సరిపెడుతున్నాయి. ఒక్క బిగ్ బాస్ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. దీంతో బిగ్ బాస్, భీష్మల సేమ్ టైం టెలికాస్ట్ ఖచ్చితంగా పరస్పరం ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి రేటింగ్స్ ఎలా వస్తాయో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp