నాటీ & బ్యూటీ కాంబో రిపీట్

By iDream Post Jun. 20, 2021, 06:30 pm IST
నాటీ & బ్యూటీ కాంబో రిపీట్

గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్స్ లో చోటు దక్కించుకున్న భీష్మలో నటించిన జోడి మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నితిన్, రష్మిక మందన్నను సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఇది డేట్ల అందుబాటు మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది నితిన్ అనూహ్యంగా రెండు ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. చెక్ దారుణంగా దెబ్బ తినగా రంగ్ దే సైతం అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యింది. అందుకే ఇప్పుడు ఆశలన్నీ మాస్ట్రో మీద పెట్టుకున్నాడు. అయితే ఇదో డిఫరెంట్ జానర్ కాబట్టి మరీ అద్భుతాలు ఆశించడానికి లేదు.

అందుకే ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వక్కంతం వంశీ చెప్పిన ఎంటర్ టైనర్ కం యాక్షన్ డ్రామా వైపు నితిన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. నిజానికి దీనికన్నా ముందు నితిన్ దర్శకుడు కృష్ణ చైతన్యకు ఓ సినిమా చేయాల్సి ఉంది. పవర్ పేట టైటిల్ తో రెండు భాగాలు రూపొందించేలా స్క్రిప్ట్ వర్క్ కూడా చేసుకున్నారు. కానీ ఇంతలో ఏమయ్యిందో దాని గురించి చడీచప్పుడు లేకుండా ఇప్పుడు వక్కంతం వంశీ ప్రాజెక్టును తెరమీద తెచ్చారు. బడ్జెట్ కారణాల వల్ల పవర్ పేటను పెండింగ్ పెట్టారా లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇప్పట్లో అయితే లేనట్టే.

రవితేజతో చేయాల్సిన సినిమా పెండింగ్ లో ఉండిపోవడంతో వక్కంతం వంశీ కూడా నితిన్ వైపు తిరిగినట్టు టాక్ ఉంది. మొత్తానికి ఇటీవలి కాలంలో టాలీవుడ్ కాంబో అటుఇటుగా మారడం సర్వసాధారణం అయిపోయింది. స్టార్లతో మొదలుపెట్టి మీడియం రేంజ్ హీరోల దాకా అందరిదీ ఇదే తంతు. మాస్ట్రో విడుదల విషయంలో కూడా ఓటిటినా థియేటరా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మరికొద్ది రోజులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ వల్ల గత రెండు నెలలుగా సైలెంట్ గా ఉన్న పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. రాబోయే రోజుల్లో అనౌన్స్ మెంట్లు ముంచెత్తడం ఖాయం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp