ఆ రీ'మేకు'ల జోలికి వెళ్లకపోవడం బెటర్

By Ravindra Siraj Feb. 11, 2020, 03:45 pm IST
ఆ రీ'మేకు'ల జోలికి వెళ్లకపోవడం బెటర్

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బాషలో హిట్ అయిన సినిమాని ఇంకో బాషలో రీమేక్ చేయాలనుకుంటే వీలైనంత త్వరగా చేసేయాలి. ఆలస్యం చేస్తే సబ్ టైటిల్స్ తో జనం ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సైట్స్ లో చూసేసి హమ్మయ్య అనుకుంటున్నారు. జానుకి ఫలితం అంత అనుకూలంగా రాకపోవడానికి కారణం అదే. 96ని ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే మూవీ లవర్స్ అందరూ చూసేశారు. ఇదిలా ఉండగా మెగా కాంపౌండ్ రెండు రీమేక్ సినిమాలపై గట్టి కన్ను వేసిందని ఇన్ సైడ్ టాక్.

ఒకటి మాధవన్ - విజయ్ సేతుపతి నటించిన విక్రం వేదా కాగా రెండోది మోహన్ లాల్ లూసిఫర్. విక్రం వేదా వచ్చి మూడేళ్ళు అవుతోంది. అక్కడ క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాహుబలికి ధీటుగా తమిళనాడులో వసూళ్లు సాధించింది. లెక్కలేనన్ని ప్రశంశలు దక్కించుకుంది. దీన్ని మాధవన్ పాత్రలో రామ్ చరణ్ తో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అల్లు అరవింద్ లో ఉందని ఇప్పటికే టాక్ ఉంది. ఆర్ఆర్ఆర్ తో పాటు మరో రెండు సినిమాల ప్లానింగ్ లో ఉన్న చరణ్ అందుబాటులోకి వచ్చేసరికి ఎంతలేదన్నా రెండేళ్ళు దాటుతుంది. అప్పుడు విక్రం వేదా ఇంకా పాతబడుతుంది.

ఇక రెండోది లూసిఫర్ విషయానికి వస్తే థియేటర్లలో ఆడని ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మనవాళ్ళు తెలుగులోనే శుభ్రంగా చూసేశారు. కుటుంబ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథ కేరళలో భారీ వసూళ్లు దక్కించుకుంది. ఆరు నెలల క్రితమే చిరంజీవితో దీన్ని రీమేక్ చేస్తారనే వార్త గట్టిగా వినిపించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ తీయాలనుకున్నా మళ్ళీ మనవాళ్ళు లూసిఫర్ ని చూసేస్తారు. దాంతో సబ్జెక్టు మీద ఆసక్తి తగ్గిపోతుంది.

తమిళ మలయాళంలో వచ్చిన ప్రతి క్లాసిక్ ని రీమేక్ చేయాలనుకునే ఆలోచనలు చాలా రిస్క్ తో కూడుకున్నవి. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. ఒకప్పుడు నడిచేవి కానీ ప్రపంచ సినిమా అరచేతుల్లోకి వచ్చాక ఎప్పుడో రెండు మూడేళ్ళ క్రితం వచ్చిన సినిమాలను ఇప్పుడు రీమేక్ చేయాలనుకోవడం వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి విక్రమ్ వేదా, లూసిఫర్ ల జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటరేమో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp