బాలయ్య సినిమా కొత్త సంగతులు

By iDream Post Jul. 30, 2020, 05:29 pm IST
బాలయ్య సినిమా కొత్త సంగతులు

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ దారుణమైన ఫలితం ఇచ్చాక కొంత గ్యాప్ తీసుకుని రూలర్ తో పలకరించిన బాలకృష్ణకు అది అంతకన్నా బ్యాడ్ రిజల్ట్ ఇవ్వడం అభిమానులు ఊహించనిది. అందుకే ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శీను మీదే ఉన్నాయి. ఆ మధ్య వదిలిన టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కడంతో ఫ్యాన్స్ అంచనాలు రెట్టింపయ్యాయి. ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన కొత్త అప్ డేట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో చాలా కీలకమైన ఒక యంగ్ హీరో పాత్రను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేయించాలనే ఆలోచన ఉన్నట్టుగా ఇప్పటికే గట్టి ప్రచారం జరుగుతోంది. చర్చల దశలోనే ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మాజీ హీరొయిన్ స్నేహకు ఓ రోల్ ఆఫర్ చేసినట్టు తెలిసింది. అఘోరా పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఆవిడ పేరు పరిశీలనలో ఉందట. భూమికకు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినట్టు ముందే లీక్ వచ్చింది. వీళ్ళతో పాటు శ్రీకాంత్ విలన్ గా చేస్తున్నట్టుగా వినికిడి. తను కాకుండా మరో ప్రతినాయకుడు కూడా ఉంటాడట. అతనెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే అసలైన హీరోయిన్ మాత్రం ఇంకా లాక్ కాలేదు. కొత్త అమ్మాయిని తీసుకుంటున్నాం అన్నారు కానీ ఎవరు అనేది ఇంకా చెప్పలేదు. లాక్ డౌన్ టైంలో ఈ సెలక్షన్ కూడా జరిగిందట. ఇలా ఇన్నేసి పాత్రలు ఉన్నాయంటే కచ్చితంగా ఏదో గట్టి సబ్జెక్టే అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతోంది.

బాలయ్య 106వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. డేంజర్, సూపర్ మ్యాన్ అనే మరో రెండు పేర్లు చక్కర్లు కొట్టాయి కానీ యూనిట్ వాటిని కొట్టిపారేసింది. కేసులు తగ్గిపోయి పరిస్థితి పూర్తిగా సద్దుమణిగాక అప్పుడు పూర్తి వివరాలు ప్రకటించబోతున్నారు. వినయ విధేయ రామ కొట్టిన దెబ్బ నుంచి కోలుకునే ఉద్దేశంతో బోయపాటి శీను కూడా దీని కోసం బాగానే కసరత్తు చేస్తున్నాడని సమాచారం. విడుదల వచ్చే ఏడాది మార్చ్ లేదా వేసవిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. షూటింగ్ మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేలా షెడ్యూల్స్ స్కెచ్ వేసినట్టుగా వినికిడి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp