బ్యాంకు 'బంగారం'తో 'బుల్లోడి' ఆటలు

By iDream Post Jan. 19, 2021, 05:12 pm IST
బ్యాంకు 'బంగారం'తో 'బుల్లోడి' ఆటలు

చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ సోలో హీరోగా నటించిన బంగారు బుల్లోడు ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇందాక ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గిరి పలిక దర్శకత్వంలో ఏకె ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా లాక్ డౌన్ కు ముందే పూర్తయినప్పటికీ థియేటర్లు తెరిచాకే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇంతదాకా ఆగారు. ఒకప్పుడు కామెడీ మూవీస్ కి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న నరేష్ గతకొంత కాలంగా ఫామ్ లో లేక మహర్షిలో సపోర్టింగ్ రోల్ కూడా చేశారు. మొత్తానికి ఏదైతేనేం మరోసారి తన భుజాల మీద మోసే సినిమాను ఎంచుకున్నాడు. ముందు కథేంటో చూద్దాం.

అనగనగా ఒక ఊరు. అందులో చిన్న బ్యాంకు. దాని మేనేజర్(పృథ్వి)కి ఇచ్చిన లోన్లు వసూలు కాక కొత్త అప్పులు ఇవ్వలేక ఆదాయం కోసం కొత్త మార్గం వెతుక్కుంటాడు. కస్టమర్లు తాకట్టు పెట్టిన నగలను బయటికి అద్దెకిస్తూ బండి నెట్టుకొస్తూ ఉంటాడు. ఈ బృహత్కార్యంలో అందులో పని చేసే ఉద్యోగి(అల్లరి నరేష్)కి కూడా భాగం ఉంటుంది. అయితే అనుకోకుండా వంద సవర్ల బంగారం తాలూకు స్కామ్ లో బ్యాంకు సిబ్బంది అంతా ఇరుక్కుంటారు. అవి గుడికి సంబంధించిన దేవుళ్ళ బంగారం కావడంతో నానా రచ్చ అవుతుంది. అసలు జరిగిందేమిటి, దీని వెనుక ఎవరున్నారు అనేది ఇంకో నాలుగు రోజులు ఆగి చూడాలి.

ట్రైలర్ వరకు ఎంటర్ టైనింగ్ గానే అనిపిస్తోంది. కామెడీతో పాటు మంచి ట్విస్టులు కూడా పెట్టారు. కాకపోతే అసలు సినిమాలో ఇవి ఎంత వరకు పేలాయో చూస్తే కానీ క్లారిటీ రాదు. నరేష్ ఎప్పటిలాగే తన టైమింగ్ తో అల్లుకుపోయాడు. తనికెళ్ళ భరణి, అజయ్ ఘోష్, ప్రవీణ్, పోసాని, ప్రభాస్ శీను తదితరులు ఇతర పాత్రలు పోషించారు. హీరోయిన్ గా పూజా ఝవేరి చేయగా సాయి కార్తిక్ సంగీతం అందించారు. కంటెంట్ కనక బాగుంటే ఇప్పటికే కాస్త నెమ్మదించిన సంక్రాంతి సినిమాల తర్వాత దొరికిన అవకాశాన్ని బంగారు బుల్లోడు పూర్తిగా సద్వినియోగపరుచుకోవచ్చు. ఈ శుక్రవామే రిలీజ్ కానుంది.

Trailer Link @ http://bit.ly/3qBWbSa

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp