అంచనాలు పెంచేస్తున్న సౌత్ దర్శకుడు

By iDream Post Sep. 16, 2021, 11:00 am IST
అంచనాలు పెంచేస్తున్న సౌత్ దర్శకుడు

2018 చివర్లో వచ్చిన జీరో తర్వాత వెండితెర మీద దర్శనం లేక అభిమానులను తెగబాధపెట్టిన కింగ్ షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు వరస సినిమాలతో యమా బిజీ అయిపోయాడు. వచ్చే ఏడాది కనీసం రెండు విడుదలయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది. ఈ సంవత్సరం కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా కుదుటపడపోవడంతో ఎలాంటి రిలీజులు పెట్టుకోవడం లేదు. ప్రస్తుతం తను పఠాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ ఇంకా కొంత బ్యాలన్స్ ఉండగానే అట్లీ ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టేశారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ చిత్రాన్ని కనివిని ఎరుగని స్థాయిలో ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దబోతున్నట్టు సమాచారం.

కొత్తగా అందిన అప్ డేట్ మేరకు దీనికి లయన్ అనే టైటిల్ ని లాక్ చేయబోతున్నారట. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని బాషలకు ఒకే పేరు ఉండాలన్న ఉద్దేశంతో అట్లీతో పాటు షారుఖ్ ఖాన్ దీనికే ఓటు వేసినట్టు తెలిసింది. గతంలో ఈ టైటిల్ బాలయ్య వాడిందే. ఆరేళ్ళ క్రితం 2015లో లయన్ వచ్చింది. త్రిష హీరోయిన్. అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. పవర్ ఫుల్ క్యారెక్టర్ అయినప్పటికీ తీసికట్టు కథా కథనాలతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మళ్ళీ ఇప్పుడు షారుఖ్ కోసం దీన్ని వాడబోతున్నారు. ఇందులో హీరో పాత్ర పోలీస్ ఆఫీసర్ గా దొంగగా డ్యూయల్ రోల్ ఉంటుందని ముంబై న్యూస్. ఒకరకంగా చెప్పాలంటే ధూమ్ తరహా గేమ్ అన్నమాట.

దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. విచిత్రంగా పఠాన్ కంటే ఈ లయన్ సినిమా మీదే ఎక్కువ బజ్ ఉంటోంది. సౌత్ దర్శకుడితో మొదటిసారి టై అప్ అయిన షారుఖ్ విజిల్, తేరి తదితర చిత్రాలను చూశాక అట్లీని లాక్ చేసుకున్నాడు. దీనికన్నా ముందు నిజానికి సాహో దర్శకుడు సుజీత్ తో ఒక మూవీ అనుకున్నారు కానీ దాని డిజాస్టర్ ఫలితం చూశాక డ్రాప్ అయ్యారని అప్పట్లోనే టాక్ వచ్చింది. మొత్తానికి బాలీవుడ్ స్టార్ నే డీల్ చేసే రేంజ్ కి చేరుకున్న అట్లీ అక్కడ ఎలా మెప్పిస్తాడో చూడాలి. లయన్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్టుగా తెలిసింది. అఫీషియల్ నోట్ వచ్చాక అన్ని వివరాలు తెలుస్తాయి

Also Read: సెప్టెంబర్ 17 - మరో యుద్ధానికి సిద్ధం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp