అల వైకుంఠపురములో ALL TIME రికార్డు

By iDream Post Aug. 27, 2020, 12:47 pm IST
అల వైకుంఠపురములో ALL TIME రికార్డు

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో దాహం ఏడు నెలల తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ ఛానల్ లో టెలికాస్ట్ అయిన ఈ బ్లాక్ బస్టర్ అంచనాలకు మించి ఏకంగా 29.4 టిఆర్పి రేటింగ్ తో అందరి మతులు పోగొట్టేసింది. నిజానికి ఇతర సినిమాలతో పోల్చుకుంటే కొంత ఆలస్యంగా ప్రసారం జరిగిన అల వైకుంఠపురములో గతంలో సరిలేరు నీకెవ్వరు సెట్ చేసిన బెంచ్ మార్క్ ని అందుకోగాలదా లేదా అనే అనుమానాలు కొంత మేర ఉండేవి. కాని వాటిని పూర్తి పటాపంచలు చేస్తూ ఈ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం.

మహేష్ బాబు ఇప్పటిదాకా 24+ రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా అతి తక్కువ గ్యాప్ లో మంచి మార్జిన్ తో బన్నీ దాన్ని తీసేసుకోవడం పట్ల అభిమానుల ఆనందం మాములుగా లేదు. వీటి దెబ్బకు బాహుబలి రెండు భాగాలూ మూడు, నాలుగో స్థానాలకు వెళ్ళిపోయాయి. ఇప్పటికే యుట్యూబ్లలో మిలియన్ల వ్యూస్ తో మ్రోత మోగిస్తున్న అల వైకుంఠపురములో ఆడియో, వీడియో పాటల సరసన ఇప్పుడు శాటిలైట్ కూడా చేరిపోయింది. నిజానికి ఈ సినిమా డిజిటల్ వెర్షన్ ఎప్పుడో ఏప్రిల్ లోనే సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్ ద్వారా వచ్చేసింది. అప్పుడు కోట్లలో ప్రేక్షకులు వీటితో పాటు వివిధ రకాల ఆన్ లైన్ మార్గాల్లో చూసేశారు. అయినప్పటికీ టీవీ ఛానల్ అధికారిక ప్రసారంలో వచ్చే కిక్ వేరేగా ఉంటుంది కాబట్టి మరోసారి అందరూ లుక్కేసినట్టు కనిపిస్తోంది.

అందుకే ఇంత పెద్ద రికార్డు సాధ్యమయ్యింది. అప్పుడే దీని తాలుకు పోస్టులతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేయడం మొదలుపెట్టారు. అంచనాలకు మించిన ఫలితం వచ్చినప్పుడు అంతకన్నా ఆనందం వాళ్ళకు ఏముంటుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి తమన్ సంగీతం అతి పెద్ద ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా బుట్ట బొమ్మా, రాములో రాములా, సామజవరగమనా పాటలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. చూడబోతే రిపీట్ టెలికాస్ట్ లోనూ అల వైకుంఠపురములో ఇదే తరహా సంచలనం మళ్ళీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓటిటిలు ఎంతగా విజృంభిస్తున్నా సాంప్రదాయక శాటిలైట్ ఛానల్స్ ఇంకా ఆదరణ కొనసాగుతుందని చెప్పడానికి అల వైకుంఠపురములో సాక్ష్యంగా నిలిచింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp