వసూళ్ల జాతరకు జేజమ్మ "అరుంధతి"

By Ravindra Siraj Jan. 17, 2020, 04:36 pm IST
వసూళ్ల జాతరకు జేజమ్మ "అరుంధతి"

ఆలోచనకు అంకురం

తెలుగు సినిమాని విజువల్ గ్రాఫిక్స్ ప్రత్యేకంగా ప్రభావితం చేసింది అమ్మోరు సినిమా నుంచే. ఎంఎస్ రెడ్డి తనయుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అంతకన్నా భారీగా కోట్లాది రూపాయల బడ్జెట్ తో అంజి నిర్మించిన శ్యామ్ దాని వల్ల నిరాశజనకమైన ఫలితాన్ని అందుకోవడమే కాక నష్టాలు కూడా చవిచూడాల్సి వచ్చింది. అలా అని ఆయన ప్రయత్నం మానుకోదలుచులేదు. మరింత కసిగా అమ్మోరుని మించిన సినిమా తీయాలనే ధృడసంకల్పానికి అంజికి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డు తీసుకుంటున్నప్పుడు నాంది పడింది. దాని ఫలితమే అరుంధతి .

దీని వెనుక వేరే కథ ఉంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డిని మేనత్త ఒకరు కలిసినప్పుడు గద్వాల్ సంస్థానం గురించి అందులో విశేషాల గురించి చెప్పేవారట. ఆ క్రమంలో అప్పుడెప్పుడో తన తాత గారు చెప్పిన ఒక ఆసక్తికర గాథ శ్యామ్ కు గుర్తుకొచ్చింది. యువరాణి ఓ పనివాడిని ప్రేమిస్తే రాజావారు వారిద్దరిని కలిపి గదితో సహా సమాధి చేయించారట. చాలా రోజుల వరకు అందులో నుంచి కేకలు వినిపించేవని చుట్టుపక్కల ప్రజలు దాని దరిదాపుల్లోకి వెళ్ళడానికి భయపడేవారు. ఆ సంఘటనే పదేపదే మననం చేసుకున్న శ్యామ్ తన టీమ్ తో కలిసి అరుంధతి కథను తయారు చేయించారు. చాలా పవర్ ఫుల్ టైటిల్ కావాలి కాబట్టి ఎంతో మేధోమధనం జరిగాక అరుంధతికి ఫిక్స్ అయ్యారు

నటీనటుల ప్రవేశం

ముందు అనుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో సినిమా అంటే చాలా సంవత్సరాలు వృధా అవుతాయని అందరూ భయపెట్టడంతో తను నో చెప్పింది. ఆఫర్ కాస్తా అనుష్కకు వెళ్ళింది. ఆ టైంలో రాజమౌళి విక్రమార్కుడు షూటింగ్ లో ఉంది. వెంటనే ఒప్పేసుకోమని జక్కన్న చెప్పడంతో అనుష్క ఇంకే ఆలోచన చేయలేదు. అంగీకారం తెలుపుతూ శ్యామ్ కు కబురు పంపింది. విలన్ గా తమిళ్ యాక్టర్ పశుపతిని అనుకున్నారు. కానీ రాజసం ఉన్న పర్సనాలిటీ అవసరం కాబట్టి సీన్ లోకి సోను సూద్ వచ్చాడు. దీంతో తన కెరీర్ గొప్ప మలుపు తిరుగుతుందని బహుశా ఊహించి ఉండడు. ఫకీర్ పాత్రకు నానా పాటేకర్, నసీరుద్దీన్ షా, అమిత్ కులకర్ణిలను ట్రై చేశారు కానీ డేట్ల సమస్య వల్ల ఫైనల్ గా షియాజీ షిండే ఫిక్స్ అయ్యాడు

ఇక దర్శకుడిగా కోలీవుడ్ నుంచి సభాపతి ఎంటరయ్యాడు. క్లైమాక్స్ ని శాంపిల్ గా షూట్ చేసి చూశారు. ఏ మాత్రం క్వాలిటీ లేకుండా చప్పగా వచ్చింది. దీంతో తన ఆస్థాన దర్శకులు కోడి రామకృష్ణకే కబురు పెట్టారు శ్యామ్. ఆయన రంగప్రవేశంతో సీన్ మారిపోయింది. క్రియేటివ్ డైరెక్టర్ రాహుల్ నంబియార్ ఫైనల్ ప్రోడక్ట్ విషయంలో చాలా కీలక పాత్ర పోషించారు. సెట్లు వేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండు ఫ్లోర్లు అద్దెకు తీసుకుని ఆర్ట్ వర్క్ చేశారు. కర్నూల్ జిల్లా బనగానపల్లిలోని ఓ పాడుబడిన కోటకు మెరుగులు దిద్ది మెయిన్ పార్ట్ షూటింగ్ అందులో ప్లాన్ చేశారు. అంతా సవ్యంగా జరిగితే ఇలాంటి బ్లాక్ బస్టర్లు ఎలా రూపొందుతాయి. రెండు నెలలు అనుకున్నది కాస్తా 9 నెలలు దాటేసింది. బడ్జెట్ 15 కోట్ల దాకా అయ్యింది. శ్యామ్ ఆర్థికంగా పెను సవాల్ ను ఎదురుకుంటున్నాడు. పెట్టుబడి గిట్టుబాటు కావాలంటే శ్యామ్ చెప్పే రేట్లకు కొనేందుకు ఎవరు సిద్ధంగా లేరు. దీంతో స్వంతంగా విడుదలకు రెడీ అయ్యారు.

సవాళ్ళతో విడుదల

ఇంత జరిగినా చాలా చోట్ల ఒక రోజు ఆలస్యంగా విడుదల తప్పలేదు. మొదటి వారం 35 ప్రింట్లతో రిలీజ్ చేశారు. ఇంకా అప్పటికి థియేటర్లలో శాటిలైట్ టెక్నాలజి అన్ని చోట్లా అందుబాటులోకి రాలేదు. అందుకే ఫిజికల్ ప్రింట్లు తప్పలేదు. టాక్ ఊపందుకుని రెండో వారంలోకి అడుగు పెట్టేలోపు 360 ప్రింట్ల దాకా నెంబర్ పెరిగిపోయింది. ఇలా పదింతలు పెరగడం చూసి ట్రేడ్ సైతం నివ్వెరపోయింది. సినిమా హాళ్ళ వద్ద జనం జాతర. టికెట్లు దొరక్క జనం కొట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. బ్లాక్ టికెట్ల దందా కళకళలాడుతోంది. వంద రోజులకు చాలా చోట్ల అగ్రిమెంట్లు జరిగిపోయాయి. ఎక్కడ చూసినా జేజమ్మ పాటే వినిపిస్తోంది. ఎవరైనా ఇంకా అరుంధతి చూడలేదంటే వాళ్ళను వింతగా భావించే పరిస్థితి. శ్యాం కన్న కల ఫలించింది. అంజి రేపిన గాయం అరుంధతి రూపంలో బంగారు పూత రూపంలో మానిపోయింది.

తెరవెనుక మాయాజాలం

ఇంకొన్ని తెరవెనుక సంగతులను చూస్తే అనుష్క ఫ్లాష్ బ్యాక్ లో పాత్రకు శిల్ప, మాడరన్ రోల్ లో సౌమ్య శర్మ డబ్బింగ్ చేసి హీరొయిన్ పాత్రకు గాత్రం ద్వారా జీవం పోశారు. పశుపతికి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ కు బొమ్మాలి అనే అరుపుకు ఐదారుసార్లు గొంతు రాసుకుపోయి మందులు తీసుకోవాల్సి వచ్చింది. కెరీర్ లో ఇంత ఛాలెంజింగ్ గా ఫీలైన పాత్ర ఇదేనని రవిశంకర్ చాలాసార్లు చెప్పాడు. దాదాపు 60 శాతం షూటింగ్ తానే చేయాల్సి వచ్చిందని క్రియేటివ్ డైరెక్టర్ రాహుల్ నంబియార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కోటి సంగీతం అరుంధతిని ఇంకో లెవెల్ కు తీసుకెళ్ళింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు జేజెమ్మా మాయమ్మా అంటూ సాగే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీనే

ఫలితం అపూర్వం

వసూళ్లలెక్కలో సుమారు 40 కోట్ల దాకా వసూలు చేసిన అరుంధతి శాటిలైట్ హక్కులు సైతం 7 కోట్లకు అమ్ముడుపోయి అప్పటిదాకా ఉన్న రికార్డులను పాతరేసింది. టికెట్ రేట్లు ఇప్పుడున్న ధరల్లో కేవలం పావలా వంతు మాత్రమే. డబ్బింగ్ రూపంలోనూ తమిళ మలయాళం భాషల్లో విజయ దుందుభి మ్రోగించింది. దీన్ని స్టార్లతో హిందీలో రీమేక్ చేయాలనీ శ్యామ్ చాలా అనుకున్నారు కానీ కార్యరూపం దాల్చలేదు.హారర్ జానర్ లో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ ఒక గ్రామర్ పుస్తకం లాంటిదని చెప్పుకోవచ్చు. మూఢనమ్మకాలను పెంచే విధంగా ఉందని కథాంశం ఉందని హేతువాదులు విమర్శించినా జనం వాటిని పట్టించుకోకుండా థియేటర్ల వైపు మళ్లారు

ముగింపు లేని చరిత్ర

అరుంధతి కథలో గొప్పదనం ఏంటంటే ఇందులో హీరో ఉండడు. హీరొయిన్ విలన్ మాత్రమే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. పూర్వ జన్మలో తనను ఘోరంగా అవమానించి చావుకు కారణమైన ఓ రాణి కూతురి మీద ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే ఓ రాక్షసుడి ఆత్మ కథే ఈ అరుంధతి. ఒకరకంగా చెప్పాలంటే అత్యద్భుతం అనిపించేది పాయింట్ పరంగా ఏమి లేదు. కానీ భారీతనం, ఔరా అనిపించే డ్రమ్స్ మధ్య అనుష్క చేసే నృత్యం, అనుభవజ్ఞులైన నటీనటుల అత్యుత్తమ నటనా కౌశలం, కళ్ళు చెదిరిపోయే గ్రాఫిక్స్, అచ్చెరువొందించే క్లైమాక్స్ ఇవన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ తర్వాత అరుంధతిని స్ఫూర్తిగా తీసుకుని చాలా సినిమాలు తీసి ఎందరో దర్శకులు చేతులు కాల్చుకున్నారు కానీ మళ్ళీ ఆ ఇంద్రజలాన్ని పునఃసృష్టి చేయలేకపోయారు.

అందుకే అరుంధతి కేవలం ఒక సినిమా కాదు, ఓ అద్భుతానికి వెండితెర సాక్షిగా నిలిచిన పుస్తకం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp