ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్

By Ravindra Siraj Feb. 21, 2020, 01:13 pm IST
ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్

ఇటీవలే సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో రూపంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకుని మేఘాల్లో తేలిపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. దీనికోసం కాస్త పొడవుగా ఉండే జులపాల జుట్టు అవసరం కావడంతో ప్రస్తుతం దాన్ని పెంచే పనిలో ఉన్నాడు. కొవిడ్ వైరస్ భయం వల్ల విదేశాలకు వెళ్లేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి ఉన్నందున ఫారిన్ లో ప్లాన్ చేసే షెడ్యూల్ ని మార్చే ఆలోచనలో ఉన్నారట టీమ్ మెంబెర్స్. 

ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం సుక్కు సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడట. చాలా రఫ్ గా మాస్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా గెటప్ ని తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. గతంలో అల్లు అర్జున్ ఎన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించేందుకు సుకుమార్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. వాస్తవానికి అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా అన్ని హై ప్రొఫైల్ పాత్రలే చేస్తున్నాడు. 

అల వైకుంఠపురములో మిడిల్ క్లాస్ అబ్బాయిగా నటించినప్పటికీ ఆణువణువూ రిచ్ క్లాస్ ఫ్లేవర్ తడుతూ ఉంటుంది. అందుకే సుకుమార్ సినిమాలో లారీ డ్రైవర్ పాత్ర చాలా వినూత్నంగా ఉంటుందట. శేషాచలం అడవుల్లో షూటింగ్ కు అనుమతి దొరకని నేపథ్యంలో దానికి ప్రత్యాన్మాయం వెతికే పనిలో ఉన్నాడు సుకుమార్. ఎర్రచందనం దొంగతనం బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి కానీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. షూటింగ్ ఇంకా మొదలు కాలేదు కాబట్టి విడుదల వచ్చే ఏడాదే ఉండొచ్చు 
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp