భవిష్యత్తు మీద రేపటి ఆశలు

By iDream Post Jul. 29, 2021, 03:35 pm IST
భవిష్యత్తు మీద రేపటి ఆశలు

సుమారు 100 రోజుల సుదీర్ఘ విరామం. గత ఏడాది కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమై జనవరి నుంచి కోలుకుంటున్న దశలో మళ్ళీ ఏప్రిల్ చివరి వారం నుంచి సెకండ్ వేవ్ విరుచుకుపడి పరిశ్రమ ఎంత నరకం అనుభవించిందో అందరం చూశాం. మళ్ళీ మంచి రోజులు వచ్చేస్తున్నాయి. రేపటి నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని, శానిటైజ్ చేసుకుని, సిబ్బందికి తగినంత శిక్షణ ఇచ్చి యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆన్ లైన్ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నీ కాదు కానీ ప్రధానమైన స్క్రీన్లన్నీ సినిమాలను వేసేందుకు రెడీ అయ్యాయి. రేపటి పరిణామాలు చాలా కీలకం.

రేపు మొత్తం అయిదు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రాబోతున్నాయి. అవి తిమ్మరుసు, ఇష్క్, నరసింహపురం, త్రయం, పరిగెత్తు పరిగెత్తు. హాలీవుడ్ మూవీ మార్టల్ కంబాట్ ను కూడా వేస్తున్నారు. వీటిలో మొదటి రెండు తప్ప మిగిలిన వాటికి పెద్దగా స్పందన ఉండకపోవచ్చు. జనం ఎంతవరకు థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో విశ్లేషించేందుకు రేపటి కలెక్షన్లు కీలకంగా మారబోతున్నాయి. మొత్తం హౌస్ ఫుల్స్ పడతాయనే అత్యాశ ఎవరికీ లేదు కానీ ఉన్నంతలో కనీసం సగం హాళ్లు నిండినా వేసిన మొదటి అడుగు సఫలం అయినట్టే. ఏపిలో సగం సీట్ల నిబంధన వసూళ్ల మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.

అలా అని ఈ ఒక్క అంశమే నెగటివ్ గా మారే ఛాన్స్ లేదు. టాక్ కనక బాగా వస్తే ఏ సినిమాకైనా కలెక్షన్లు స్టడీగా పెరగడంతో పాటు స్క్రీన్లు కావాల్సినన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాబోదు. ఎటొచ్చి రీమేక్ సినిమాలైన తిమ్మరుసు, ఇష్క్ అంత మేజిక్ చేయగలవా లేదా అనేదే ఆసక్తికరం. ఈ రోజుతో పాటు ఆగస్ట్ 6న విడుదలయ్యే సినిమాలకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఆపై రిలీజ్ డేట్లు ప్రకటించేందుకు ఇతర నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మరోపక్క అనూహ్యంగా నిన్న దేశవ్యాప్తంగా కేసులు పెరగడం మళ్ళీ ఆందోళన కలిగిస్తోంది. ఈ కౌంట్ తాత్కాలికం అయితే బాగుంటుంది.

Also Read: రికార్డు దాటలేకపోయిన వకీల్ సాబ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp