డబుల్ మిలియన్ కొట్టేసిన వైకుంఠపురములో

By Ravindra Siraj Jan. 18, 2020, 12:37 pm IST
డబుల్ మిలియన్ కొట్టేసిన వైకుంఠపురములో

సంక్రాంతి వద్ద బాక్స్ ఆఫీస్ పోరు రసవత్తరంగా కొనసాగుతూనే ఉంది. సెలవులు ఇంకో రెండు రోజులు ఉండటంతో ప్రమోషన్ విషయంలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఎలాగూ తర్వాతి సినిమాకు చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి ఇటు మహేష్ అటు బన్నీ పబ్లిసిటీ పరంగా ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. దానికి తోడు మేమే విన్నర్స్ అంటూ ఎవరికి వారు పోస్టర్లు వేసుకోవడం సాధారణ ప్రేక్షకులను కొంత అయోమయానికి గురి చేస్తోంది. ఏది ఎలా ఉన్నా టాక్ పరంగా అల వైకుంఠపురములో డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

నిన్నటితో యుఎస్ లో 2 మిలియన్ మార్క్ ను దర్జాగా అందుకుంది. అల్లు అర్జున్ ఇప్పటిదాకా ఈ ఫీట్ సాధించలేదు. ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకనో ఈ రికార్డు మాత్రం ఏ సినిమా సాధించలేకపోయింది. అల వైకుంఠపురములో కేవలం రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే 2 మిలియన్లు ఖాతాలో వేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అలా చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు ఇంకా వెనుకబడే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా కంటే త్రివిక్రమ్ మాటల మేజిక్ వైపే ఎన్ఆర్ఐలు మొగ్గు చూపుతున్నారు.

రేపో ఎల్లుండో ఇది 2 మిలియన్ చేరుకున్నా ఆపై మాత్రం రన్ అంత సులభంగా ఉండదు. అల వైకుంఠపురములో ఇస్తున్న పోటీని తట్టుకోవడం సరిలేరుపై ఒత్తిడిని పెంచుతోంది. దాన్ని క్రాస్ చేసే మాట అటుంచి కనీసం సమానంగా వచ్చినా చాలు అనుకుంటున్నారు అభిమానులు. తెలుగు రాష్ట్రాల వసూళ్ల గురించి మాత్రం క్లారిటీ లేదు. 100 కోట్ల గ్రాస్ దాటేసిందని సరిలేరు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇంకా అల టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. చూస్తుంటే ఈ రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు జరిగేలా ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp