ప్రతినెలా డబ్బులు పంపే దర్శకుడు

By iDream Post Jul. 05, 2020, 06:56 pm IST
ప్రతినెలా డబ్బులు పంపే దర్శకుడు

తెలుగు సినిమాలో కామెడీ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలు అవి ఇవి అని తేడా లేకుండా అన్నింటిలోనూ తన ప్రజ్ఞను చాటుకున్న రమాప్రభ గారి గురించి ప్రత్యేకంగా మూవీ లవర్స్ కు చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఇంటితోనూ ఆవిడకు అనుబంధం ఉంది. రోజు టీవీలోనో యుట్యూబ్ లోనో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా రమాప్రభ గారి దర్శనం కలుగుతూనే ఉంటుంది. సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన అరుదైన ఘనత ఆవిడ సొంతం. 1964తో మొదలుకుని ఇప్పటిదాకా లెక్కలేనన్ని పాత్రలు వేసిన రమాప్రభ గారు ఇప్పటి జనరేషన్ కు సైతం చలాకిగా ఉండే అల్లరి బామ్మగా బాగా పరిచయం. ముఖ్యంగా నాగార్జునతో నిన్నే పెళ్ళాడతాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక ఆవిడ నేటి తరానికి కూడా బాగా కనెక్ట్ అయిపోయారు.

ప్రేమించుకుందాం రా, టాగూర్ , ప్రేమంటే ఇదేరా ఇలా ఎన్నో చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ వాటి విజయంలో రమాప్రభ గారి కృషిని తక్కువ చేయలేం. వ్యక్తిగత జీవితంలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వైవాహిక జీవితానికి సంబంధించి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు ఆవిడ. అయితే ఓ ప్రముఖ దర్శకుడు రమాప్రభగారికి నెల నెలా క్రమం తప్పకుండ పాతిక వేలకు పైగా పంపుతారు అనేది అందరికి తెలిసిన విషయం కాదు. దాని వెనుక ఒక కథ ఉంది. బి గోపాల్ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ఆరడుగుల బుల్లెట్టు షూటింగ్ జరుగుతున్న సందర్భంలో పూరి రమాప్రభను కలిశారు. అప్పటికే ఓ పత్రిక కథనం ద్వారా ఆవిడకు జరుగుబాటు విషయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురవుతోందన్న సంగతి తెలిసింది. పూరిని బాబు అని ఆప్యాయంగా పిలిచే చనువు రమాప్రభగారికి ఉంది.

మొదటి సినిమా బద్రి నుంచే ఆ బాండింగ్ మొదలైంది. అందుకే విషయం తెలిసిన వెంటనే ఎక్కువ ఆలస్యం చేయకుండా అప్పటి నుంచి పూరి ప్రతి నెల అలా డబ్బుని పంపడం అలవాటు చేసుకున్నారు. రమాప్రభ గారికి ఇష్టం లేకపోయినా అంత ప్రేమతో పూరి ఇవ్వడం కాదనలేకపోయారు. టెంపర్, దేశముదురు లాంటి ఎన్నో పూరి సినిమాల్లో రమాప్రభ గారు భాగమయ్యారు. కొన్నింటికి డబ్బుతో కొలవలేమని ఏదో జన్మలో ఉన్న రుణానుబంధం పూరిని అలా ప్రేరేపించింది తప్ప మరో కారణం లేదంటారావిడ. ప్రస్తుతం వయసు దృష్ట్యా విశ్రాంతి తీసుకుంటున్న రమాప్రభ గారు ఇప్పటికీ అదే చురుకుదనంతో కనిపిస్తారు. మొదటి సినిమాలో కనిపించే హుషారుని ఆవిడలో గమనించవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp