స్వర్గానికేగిన మేలిమి కమెడియన్ వివేక్

By iDream Post Apr. 17, 2021, 10:21 am IST
స్వర్గానికేగిన మేలిమి కమెడియన్ వివేక్

తమిళ సినిమాలతో పాటు వాటి డబ్బింగుల ద్వారా తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన వివేక్ ఇవాళ తెల్లవారుఝామున 4.35 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. శరవణన్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న వివేక్ షూటింగ్ స్పాట్ లో అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే ఇంటికి వచ్చారు. కాసేపటికే స్పృహ కోల్పవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్మొ సపోర్ట్ ద్వారా చికిత్స ప్రారంభించిన వైద్యులు యాంగియోప్లాస్టీ నిర్వహించారు. రక్తనాళ్లల్లో బ్లాక్ ఏర్పడటంతో ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు. కోవిడ్ కు వ్యాక్సిన్ వేయించుకున్న మరుసటి రోజే ఇలా జరగడం మీద మీడియాలో ఇప్పటికే పలు రకాల కథనాలు వచ్చాయి.

వివేక్ 1987లో బాలచందర్ తీసిన 'మనతిల్ ఉరుది వేండుం' ద్వారా పరిచయమయ్యారు. ఆనతికాలంలోనే టాప్ కమెడియన్ గా అవతరించారు. సుప్రసిద్ధ హాస్యనటుడు ఎన్ఎస్ కృష్ణన్ ని స్ఫూర్తిగా చెప్పుకునే వివేక్ తర్వాత చిన్న కలైవనర్ అనే పేరు తెచ్చుకున్నారు. 90వ దశకంతో మొదలైన వివేక్ హవా ఏ స్థాయిలో సాగిందంటే ఒకదశలో ఈయన లేని తమిళ సినిమా లేదు అనే రేంజ్ కి ఎదిగిపోయింది. రజినీకాంత్ తో మొదలుపెట్టి ధనుష్ దాకా ఇండస్ట్రీలో ప్రతిఒక్క హీరోతో నటించిన వివేక్ విచిత్రంగా కమల్ తో చేయలేదు. ఆ కోరిక ఇండియన్ 2తో నెరవేరింది కానీ దాని షూటింగ్ పూర్తి కాకుండానే కన్ను మూయడం విషాదం,.

గత ఏడాది 'వెళ్ళె పూక్కల్' వివేక్ కు చాలా పేరు తీసుకొచ్చింది. ఈయన చివరి చిత్రం 2020లో వచ్చిన ధారల ప్రభు. మరికొన్ని షూటింగ్ చివరిదశలో ఉన్నాయి. 2009లో వివేక్ ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లెక్క లేనన్ని అవార్డులు అందుకున్నారు. ఏపిజె అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకుని గ్రీన్ కలాం ప్రాజెక్ట్ పేరుతో పర్యావరణ రక్షణ కోసం మొక్కలు నాటే మహా యజ్ఞాన్ని కూడా వివేక్ కొనసాగించారు. అపరిచితుడు, బాయ్స్ లాంటి సినిమాల ద్వారా తెలుగులోనూ విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న వివేక్ లాంటి నటులు లేకపోవడం కోలీవుడ్ కే కాదు యావత్ చిత్ర పరిశ్రమకే తీరని లోటు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp