గోపీచంద్ బుల్లెట్ కు మోక్షం దక్కనుందా

By iDream Post Sep. 27, 2020, 05:37 pm IST
గోపీచంద్ బుల్లెట్ కు మోక్షం దక్కనుందా

లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడటం కొందరికి వరమైతే మరికొందరికి శాపంగా పరిణమిస్తున్నాయి. కానీ గోపీచంద్ సినిమా మాత్రం ఫస్ట్ క్యాటగిరిలో పడేలా ఉంది. మూడేళ్ళకు పైబడి ల్యాబులోనే ఉన్న ఆరడుగుల బుల్లెట్ ఎట్టకేలకు ఓటిటి డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. జీ 5 సంస్థ సుమారు 7 కోట్లు ఆఫర్ చేసి హక్కులు కొనుగోలు చేసినట్టు వినికిడి. ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. ఫిలిం నగర్ టాక్ అయితే జోరుగానే ఉంది. చాలా పెద్ద క్యాస్టింగ్ తో క్రేజీ కాంబినేషన్ తో రూపొందిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, ఉత్తేజ్, రమాప్రభ ఇలా సీనియర్లు చాలానే ఉన్నారు, మణిశర్మ సంగీతం మరో ఆకర్షణ. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని తరహాలో నిర్మాతలకు సంబంధించి ఏవో ఆర్ధిక లావాదేవీల వల్ల ఇప్పటిదాకా ఆలస్యమవుతూ వచ్చింది. 2017లో జూన్ 17 విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటనలు ఇచ్చి ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు కూడా అమ్మారు. తీరా షో మొదలయ్యే సమయానికి క్యాన్సిల్ చేసి డబ్బులు రీ ఫండ్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఇది బయటికి రానే లేదు. ఇప్పుడు జీ5 ఇచ్చిన డీల్ రీజనబుల్ అనిపించినా అనిపించకపోయినా వేరే ఆప్షన్ లేక ఒప్పుకున్నట్టు వినికిడి. నిజానికిది భారీ బడ్జెట్ తో రూపొందింది. అయితే గోపిచంద్ మార్కెట్ గత కొంత కాలంగా చాలా డల్ గా ఉంది. కరోనా అయ్యాక థియేటర్లు తెరిచినా భారీ ఓపెనింగ్స్ తెచ్చే పరిస్థితిలో లేడు.

అందులోనూ ఇలా ఏళ్ళ తరబడి విడుదల ఆగిపోయిన సినిమాల మీద ప్రేక్షకులు అంత ఆసక్తి చూపించరు. నిజంగా ఇందులో అంత గట్టి విషయమే ఏదో ఒక మార్గం అప్పుడే దొరికేది. కానీ ఆలా జరగలేదు. అందుకే ఇలాంటి చిత్రాలకు ఇదొక్కటే మార్గం. కొత్తగా ట్రైలర్ కట్ చేసి ప్రమోషన్లు మొదలుపెడతారని టాక్. దసరాకు స్ట్రీమింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. జీ5 కొత్తగా జీ ప్లెక్స్ ని పే పర్ వ్యూ మోడల్ లో సినిమాలు విడుదల చేయబోతోంది. మరి ఆరడుగుల బుల్లెట్ కూడా అందులోనే వస్తుందేమో చూడాలి. ఊర మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు కానీ ఓటిటినే కాబట్టి కాంబినేషన్ క్రేజ్ మీద ఎక్కువ శాతం చూసే అవకాశం ఉంది. అసలే మాస్ ప్రేక్షకులకు ఒక్కటంటే ఒక్క సినిమా కనీస స్థాయిలో సంతృప్తి పరచలేదు. ఇదైనా తీరుస్తుందేమో చూద్దాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp